Share News

Health: మ్యూస్లీ, ఓట్స్‌లలో ఏది మంచిది?

ABN , Publish Date - Dec 14 , 2025 | 11:53 AM

మార్కెట్లో లభించే మ్యూస్లీలో ఓట్స్‌, మిల్లెట్స్‌, గోధుమలు, బార్లీ మొదలైన ధాన్యాలు ఉంటాయి. కొన్నింటిలో అదనంగా బాదం, కాజూ, పుచ్చ గింజలు, ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష లాంటి నట్స్‌, డ్రై ఫ్రూట్స్‌ కూడా ఉంటాయి.

Health: మ్యూస్లీ, ఓట్స్‌లలో ఏది మంచిది?
Muesli and Oats

నా వయస్సు 25 సంవత్సరాలు. బరువు తగ్గడానికి డైటింగ్‌ చేస్తున్నాను. బరువు తగ్గాలని అనుకునేవారికి ఓట్స్‌ లేదా మ్యూస్లీ... వీటిలో ఏది మంచిది?

- హారిక, హైదరాబాద్‌

మార్కెట్లో లభించే మ్యూస్లీలో ఓట్స్‌, మిల్లెట్స్‌, గోధుమలు, బార్లీ మొదలైన ధాన్యాలు ఉంటాయి. కొన్నింటిలో అదనంగా బాదం, కాజూ, పుచ్చ గింజలు, ఎండు ఖర్జూరాలు, ఎండు ద్రాక్ష లాంటి నట్స్‌, డ్రై ఫ్రూట్స్‌ కూడా ఉంటాయి. వీటిల్లో కొన్నిసార్లు తీయటి రుచి కోసం చక్కెర, బెల్లం, తేనె లాంటివి కూడా చేర్చుతారు. వీటివల్ల మ్యూస్లీలో అధిక క్యాలరీలు, అధిక పిండి పదార్థాలు ఉండే అవకాశం ఎక్కువ. ఓట్స్‌ విషయానికొస్తే, ఎటువంటి అదనపు పదార్థాలను చేర్చరు. కాబట్టి సాదా ఓట్స్‌ను నీటిలో లేదా పాలలో ఉడికించి తీసుకున్నప్పుడు వచ్చే క్యాలరీలు అదే పరిమాణంలో ఉండే తీయటి మ్యూస్లీ కంటే తక్కువ ఉంటాయి.


ఓట్స్‌ను కేవలం పాలలో వేసుకొని తినడమే కాకుండా కూరగాయలు వేసి, తక్కువ నూనెతో కీచిడీ లేదా ఉప్మాలా చేసుకున్నప్పుడు మరింత పీచు పదార్థాలు అందుతాయి. రక్తంలో గ్లూకోజు నియంత్రణకు కూడా ఉపయోగపడతాయి. ఒకవేళ ఓట్స్‌ కంటే మ్యూస్లీ తినడానికే ఇష్టపడేవారైతే ప్యాకేజ్‌పై ఉండే పోషక విలువల లేబుల్‌ చూసి అదనపు చక్కెరలు లేనటువంటి వాటిని ఎంచుకోవచ్చు. ఈ మ్యూస్లీని పాలతో తీసుకొనేప్పుడు తీపి కోసం ఎటువంటి పదార్థాలు చేరకుండా ఉంటే క్యాలరీలను కొంత వరకు నియంత్రించవచ్చు. బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఏదో ఒక ఆహారంపై ఆధార పడకుండా సమతులాహారాన్ని తగుపాళ్లలో తీసుకోవడం, శారీరక వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం మొదలైన పద్ధతులు పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.


నాకు స్టోన్‌ కారణంగా గాల్‌బ్లాడర్‌ తీసేశారు. అప్పటి నుంచి నూనె ఎక్కువగా ఉన్న ఆహారం ఏది తీసుకొన్నా కడుపు నొప్పి వస్తోంది. దీన్ని నివారించే మార్గాలు ఏమిటో చెప్పండి?

- రాధ, వైకుంఠపురం

ఆహారంలో తీసుకొనే కొవ్వులను జీర్ణించుకోడానికి అవసరమయ్యే బైల్‌ అనే పదార్థాన్ని కాలేయం స్రవిస్తుంది. ఈ బైల్‌ గాల్‌బ్లాడర్‌ లేదా పిత్తాశయంలో నిల్వ ఉంటుంది. కొవ్వు ఉన్న ఆహారం తిన్నప్పుడు జీర్ణాశయం, చిన్న ప్రేగులలోనికి చేరు తుంది. పిత్తాశయం తొలగించిన తర్వాత నూనెతో చేసిన ఆహారం తింటే జీర్ణమయ్యేం దుకు సరిపడా బైల్‌ ఒకేసారి విడుదల కావడం కష్టం కాబట్టి కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. పిత్తాశయం తీసేసిన వారు ఆహారపు అలవాట్లలో కొన్నిమార్పులు చేసుకొంటే ఇలా కడుపు నొప్పితో ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు.


నూనెలు, కొవ్వు అధి కంగా ఉండే స్వీట్లు, వేపుళ్ళు, ఫ్రై చేసిన పదార్థాలు, చిరుతిళ్ళు, వెన్న, నెయ్యి మొదలైనవన్నీ చాలా పరిమితంగా వాడాలి. ఒకవేళ కొవ్వు ఎక్కువ ఉన్న ఆహారం తీసుకుంటున్నట్టయితే మోతాదు చాలా తక్కువగా ఉండేలా, ఆ పదార్థంతో పాటుగా పీచు ఎక్కువగా ఉండే కూర గాయలను చేర్చుకుంటే మంచిది. రోజువారీ వంటలో కూడా తాలింపు, పోపు మొదలైన వాటికి చాలా తక్కువ నూనె మాత్రమే వాడాలి. ఒక్కసారిగా ఎక్కువ ఆహారం తినకుండా, రోజుకు నాలుగైదుసార్లు తక్కువ మోతాదులుగా తింటే జీర్ణక్రియ సులభంగా సాగుతుంది. పకోడీలు, పూరీలు, చిప్స్‌, బేకరీ ఐటమ్స్‌, స్పైసీ వంటలు, గ్రేవీలాంటి పదార్థాలు కడుపు నొప్పిని మరింత పెంచుతాయి కాబట్టి, వీటిని దూరంగా ఉంచాలి.


ఒక్కొక్కసారి గుడ్లు ఉడికించాక తినడం కుదరదు. అలాంటప్పుడు ఉడికించిన గుడ్లు వృథా కాకుండా ఫ్రిజ్‌లో పెట్టవచ్చా? ఉడికించిన గుడ్లను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు నిల్వ చేయొచ్చు?

- వీణ, తెనాలి

ఉడికించిన గుడ్లను ఎక్కువ రోజుల పాటు ఫ్రిజ్‌లో ఉంచడం కన్నా, 24 గంటల లోపే తినేయడం ఆరోగ్య పరంగా సురక్షితం. గుడ్లు ఉడికించిన తర్వాత ఎక్కువ కాలం నిల్వ చేస్తే రుచితో పాటు పోషక విలువలు కూడా తగ్గే అవకాశం ఉంది. గుడ్లు ఉడికించడానికి పెద్దగా సమయం పట్టదు కాబట్టి, రోజుకు ఎన్ని అవసరమో అన్ని మాత్రమే ఉడికించడం మంచి పద్ధతి. ఇలా చేస్తే ఎప్పుడూ తాజా గుడ్లు తినడం సాధ్యపడుతుంది. ఒకటి లేదా రెండు గుడ్లు అదనంగా మిగిలినప్పుడు, అవి పాడవకుండా ఉండేందుకు ఫ్రిజ్‌లో ఉంచి తర్వాతి రోజు ఉదయం లేదా మధ్యాహ్నం లోపే తినేయడం మంచిది. అవకాశం ఉంటే ఫ్రిజ్‌లోని గుడ్లు తినేముందు మరోసారి వేడి చేయడం మంచిది. సక్రమంగా భద్రపరచిన గుడ్లు సమతులాహారంలో భాగంగా తీసుకుంటే మంచిది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఇండియా కూటమిని ఏకం చేస్తాం

మంచి క్రెడిట్‌ స్కోర్‌ ఉన్నా గృహ రుణం రావటం లేదా

Read Latest Telangana News and National News

Updated Date - Dec 14 , 2025 | 12:42 PM