Mutton Paya Soup: మటన్ పాయా సూప్ తాగుతున్నారా..? అయితే జాగ్రత్త..
ABN , Publish Date - Oct 25 , 2025 | 10:36 AM
ముఖ్యంగా గుండె సంబంధిత రోగులకు మటన్ పాయా సూప్ తాగడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఇది కొవ్వులను అధికంగా కలిగి ఉండడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు సూప్ తాగకూడదని అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మనం సహజంగా వివిధ కూరగాయలు, మాంసాహారాలతో తయారుచేసిన సూప్‌లను తాగుతుంటాము. అయితే ఎన్ని సూప్‌లు ఉన్నా కూడా మటన్ పాయా సూప్‌కు ఒక ప్రత్యేకత ఉంటుంది. మేక లేదా గొర్రె కాళ్ళతో తయారుచేసిన ఈ సూప్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని చెబుతుంటారు. ప్రతిరోజు తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, ఎముకలు దృఢంగా మారుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కొంతమందికి మాత్రం మటన్ పాయా సూప్ తాగడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా గుండె సంబంధిత రోగులకు మటన్ పాయా సూప్ తాగడం మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఇది కొవ్వులను అధికంగా కలిగి ఉండడం వల్ల గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు సూప్ తాగకూడదని అంటున్నారు. అలాగే.. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్నవారు, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడేవారు మటన్ పాయ సూప్‌ను తాగకూడదని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలతో బాధపడే వారు వైద్యుల సలహా తీసుకొని ఆ తర్వాతే సూప్ తాగడం మంచిదని పేర్కొంటున్నారు. గర్భిణులు మటన్ పాయా సూప్ వంటి కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
మటన్ పాయా సూప్‌ను తయారు చేసే సమయంలో మాంసాన్ని శుభ్రంగా కడగకపోయినా, చాలా సేపు ఉడికించకపోయినా కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. మేక లేదా గొర్రె కాళ్లను శుభ్రంగా కడగకపోతే సాల్మనెల్లా, ఈ కొలి వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మటన్ పాయా సూప్‌లో ఆరోగ్య పరంగా మంచి పోషకాలు ఉన్నా.. ఎవరుపడితే వారు తాగకూడదని డాక్టర్లు సూచిస్తున్నారు.