Dangerous Fish To Avoid: ఈ చేపలతో జాగ్రత్త.. తిన్నారో ప్రాణాలు పోతాయి.!
ABN , Publish Date - Dec 16 , 2025 | 02:44 PM
చేపలు అంటే చాలా మందికి నోరు ఊరుతుంది. అయితే, కొన్ని రకాల చేపలను తయారు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న పొరపాటు కూడా ప్రాణాంతకం కావచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: చేపలంటే చాలా మందికి ఎంతో ఇష్టం. వాటిని వండాలనే ఆలోచన వచ్చినా నోరు ఊరిపోతుంది. అయితే, కొన్ని రకాల చేపలను సరైన విధంగా శుభ్రం చేయకపోతే లేదా వండడంలో చిన్న పొరపాటు చేసినా అది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. అందుకే మాంసాహారులు కొన్ని చేపల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏ చేపలతో జాగ్రత్త అవసరం?
చేపలను వండే పద్ధతులు ఎన్నో ఉన్నా, అన్ని చేపలు సురక్షితమైనవి కావు. కొన్ని రకాల చేపలు సరిగా శుభ్రం చేయకపోతే లేదా పూర్తిగా ఉడికించకపోతే తీవ్రమైన విష ప్రభావాలు చూపుతాయి. అలాంటి ప్రమాదకరమైన చేపల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పఫర్ ఫిష్
పఫర్ ఫిష్.. దీనిని ఫుగు అని కూడా పిలుస్తారు. ఇది జపాన్‌లో ప్రసిద్ధి చెందిన చేప. అయితే, దీన్ని తయారు చేయడంలో లేదా వండడంలో కాస్త పొరపాటు జరిగినా తినే వ్యక్తికి ప్రాణాంతకం కావచ్చు. ఈ చేపలో టెట్రోడోటాక్సిన్ అనే అత్యంత ప్రమాదకరమైన విషం ఉంటుంది. ఈ విషం చేప స్వయంగా ఉత్పత్తి చేయదని, అది తినే బ్యాక్టీరియా ద్వారా వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విషం చేప కాలేయం, కళ్ళు, ఇతర అవయవాల్లో ఎక్కువగా పేరుకుపోతుంది.

ఈ చేపను తిన్న తర్వాత 20 నిమిషాల నుంచి మూడు గంటల లోపే లక్షణాలు కనిపిస్తాయి. పెదవులు, నాలుక తిమ్మిరి, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. క్రమంగా శరీరం పూర్తిగా కదలకుండా పోయి, చివరికి శ్వాస ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అత్యంత భయంకరమైన విషయం ఏమిటంటే, ఈ విషానికి ఇప్పటివరకు ఎలాంటి విరుగుడు లేదు.
సలేమా పోర్జీ
సలేమా పోర్జీ అనే చేపను డ్రీమ్ ఫిష్ అని కూడా అంటారు. ఇది తూర్పు అట్లాంటిక్ సముద్రం ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ చేప తలను తినడం వల్ల వింత శబ్దాలు వినిపించడం, భయంకరమైన భ్రాంతులు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీని ప్రభావం కొన్ని మాదకద్రవ్యాల మాదిరిగానే ఉంటుంది.

అందమైన చేపలే ప్రమాదకరమా?
వింతగా కనిపించే చేపలే ప్రమాదకరమని అనుకోవద్దు. పగడపు దిబ్బల దగ్గర కనిపించే అందంగా కనిపించే కొన్ని చేపలు కూడా చాలా ప్రమాదకరమైనవే. వీటిలో సిగ్వాటాక్సిన్ అనే విషం ఉంటుంది. ఇది నరాల వ్యవస్థపై ప్రభావం చూపి, తీవ్రమైన అనారోగ్యానికి లేదా మరణానికి కూడా కారణం కావచ్చు. అందువల్ల, చేపలు తినేటప్పుడు వాటి రకం, వంట చేసే విధానం, శుభ్రత చాలా ముఖ్యం. తెలియని లేదా అరుదైన చేపలను తినే ముందు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.
(NOTE: పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
జీవితంలో ఈ విషయాలు ముందే రాసి పెట్టి ఉంటాయి
ఒక తెల్ల వెంట్రుకను పీకితే మిగిలిన వెంట్రుకలు కూడా తెల్లగా అవుతాయా?
For More Latest News