Share News

GST Reduction on Medicines: క్యాన్సర్ నుంచి డయాబెటిస్ వరకు.. మందులపై జీఎస్టీ తగ్గింపు వల్ల లాభపడే వారు వీరే!

ABN , Publish Date - Sep 06 , 2025 | 01:31 PM

కేంద్ర ప్రభుత్వం మందులపై GSTని తగ్గించింది. దీని వలన ఖరీదైన మందుల ధరలు తగ్గుతాయి. లక్షలాది మంది రోగులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుంది. అయితే, ఏ మందులపై పన్ను తగ్గుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

GST Reduction on Medicines: క్యాన్సర్ నుంచి డయాబెటిస్ వరకు.. మందులపై జీఎస్టీ తగ్గింపు వల్ల లాభపడే వారు వీరే!
GST Reduction on Medicines

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో అనేక ముఖ్యమైన ఔషధాలపై జీఎస్టీ (GST) తగ్గనుంది. దీని వల్ల అత్యవసరమైన మందుల ధరలు తగ్గి, సామాన్య ప్రజలకు ఎంతో ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి ఈ నిర్ణయం బిగ్ రిలీఫ్ ఇవ్వనుంది.


క్యాన్సర్ చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది. మందులు, ఇంజెక్షన్లు, ట్రీట్‌మెంట్ ఇలా ప్రతిదీ లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అయితే, ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రకారం, క్యాన్సర్ మందులపై జీఎస్టీ పూర్తిగా తీసివేశారు. ముందుగా ఈ మందులపై 12% పన్ను ఉండేది. ఇప్పుడు అవి సున్నా జీఎస్టీతో అందుబాటులో ఉండనున్నాయి.


ఈ జాబితాలో అస్కిమినిబ్, మెపోలిజుమాబ్, పెగిలేటెడ్ లిపోసోమల్ ఇరినోటెకాన్, డరాటుముమాబ్, అగల్సిడేస్ ఆల్ఫా, అలిరోకుమాబ్, ఎవోలోకుమాబ్ మొదలైన అనేక తీవ్రమైన వ్యాధులకు మందులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే మందులు ఉన్నాయి. వీటి ధర చాలా ఎక్కువగా ఉండగా పన్ను తొలగింపు వాటి ధరలను నేరుగా తగ్గిస్తుంది. ఇది క్యాన్సర్ రోగులకు ఊరటనిస్తుంది. ఈ నిర్ణయం వల్ల బాధితులకు ప్రతినెలా వేల రూపాయలు ఆదా అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ మందులు దీర్ఘకాలం పాటు అవసరం అవుతాయి.


ఇతర మందులపై కూడా పన్ను తగ్గింపు

కేవలం క్యాన్సర్ మందులే కాకుండా, తరచుగా వాడే ఇతర ఔషధాలపై కూడా జీఎస్టీ తగ్గనుంది. గతంలో 18% పన్ను ఉన్న డయాబెటిస్, గుండె సంబంధిత మందులు, ఇన్సులిన్, బీపీ మందులు, పరీక్షా కిట్లు వంటివి ఇప్పుడు కేవలం 5% జీఎస్టీతో అందుబాటులోకి వస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రతి రోజూ మందులు వాడే లక్షలాది మంది రోగులకు ప్రయోజనం కలుగనుంది. మందుల ధరలు తక్కువై, ఎక్కువమంది వాటిని కొనుగోలు చేసి ఉపయోగించే అవకాశం ఉంటుంది. చికిత్సను మధ్యలో నిలిపివేయాల్సిన పరిస్థితులు తగ్గిపోతాయి.


Also Read:

సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్‌సూద్‌కు అస్వస్థత..

లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు

For More Latest News

Updated Date - Sep 06 , 2025 | 01:41 PM