Share News

Health: పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:43 AM

పొట్టచుట్టూ, కడుపులోని అవయవాలపై పేరుకునే కొవ్వును విసరల్‌ ఫ్యాట్‌ అంటారు. చర్మం కింద పేరుకునే కొవ్వును సబ్‌ క్యుటేనియస్‌ ఫ్యాట్‌ అంటారు. విసరల్‌ ఫ్యాట్‌ అధికంగా ఉంటే జీవనశైలి వ్యాధులు వస్తాయి.

Health: పొట్ట చుట్టూ కొవ్వు తగ్గాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..

నాకు 40 ఏళ్ళు. బెల్లీ ఫ్యాట్‌ (పొట్ట చుట్టూ కొవ్వు) ఏర్పడుతున్నది. ఈ కొవ్వును కరిగించేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

- వందన, వైజాగ్‌

పొట్టచుట్టూ, కడుపులోని అవయవాలపై పేరుకునే కొవ్వును విసరల్‌ ఫ్యాట్‌ అంటారు. చర్మం కింద పేరుకునే కొవ్వును సబ్‌ క్యుటేనియస్‌ ఫ్యాట్‌ అంటారు. విసరల్‌ ఫ్యాట్‌ అధికంగా ఉంటే జీవనశైలి వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా మధుమేహం, ఫ్యాటీ లివర్‌, గుండె జబ్బులు, కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే అవకాశం పెరుగుతుంది. అధికంగా ప్రాసెస్‌ చేసిన ఆహారం, మైదా, పాలిష్‌ చేసిన బియ్యం, చక్కెర, బెల్లం వంటి తీపి పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాలు తీసుకోవడం, వేళకానివేళ భుజించడం, రాత్రిపూట ఎక్కువగా తినడంతోపాటు అసలు శారీరక శ్రమ లేకపోవడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. ఈ కొవ్వు తగ్గాలంటే ఆహారంలో, జీవనశైలిలో మార్పులు తప్పని సరి. ఆహారంలో కూరగాయలు, ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. నూనెలో వేయించినవి,


క్యాలరీలు అధికంగా ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. రోజూ అరగంట పాటు శారీరక శ్రమ లేదా వ్యాయామం చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే క్రమంగా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించుకోవచ్చు. బరువు తగ్గేకొద్దీ శరీరంలోని కొవ్వు అన్ని భాగాల నుండీ కొద్దికొద్దిగా తగ్గుతుంది. కాబట్టి రెండు వారాలకోసారి నడుము కొలత చూసుకోవాలి. యోగా, నడక లాంటి తేలికపాటి వ్యాయామాలతో నెలకు ఒకటిన్నర నుండి రెండున్నర సెంటీమీటర్ల మేరకు మాత్రమే నడుము కొలత తగ్గుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడానికి సమయం పట్టినట్టే, తగ్గడానికీ అధిక సమయం పడుతుందని గ్రహించాలి.


మార్కెట్లో విరివిగా దొరుకుతున్న పూల్‌ మఖానాలో పోషకాలు తెలపండి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఏవైనా ప్రత్యేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా?

- విజయలక్ష్మి, సికింద్రాబాద్‌

book6.3.jpg

పూల్‌ మఖానా ఈ మధ్య కాలంలో వివిధ రకాల ఆహార పదార్థాల్లో వినియోగిస్తున్నారు. స్నాక్‌ లేదా చిరు తిండిగా, కూరల్లోనూ వాడుతున్నారు. దీనిలో చాలా పోషకాలు ఉంటాయని ప్రసార మాధ్యమాల్లో చెప్తున్నారు. మఖానాలో పిండి పదార్థాలు అధికం. ఇంకా వందగ్రాముల మఖానాలో 9 గ్రాముల ప్రోటీన్‌ ఉంటుంది. వీటిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువ. క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఉండటంతో మఖానాతో వివిధ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మార్కెట్లో విరివిగా లభిస్తున్నప్పటికీ మఖానా ధర ఎక్కువ. మఖానాలో లభించే పోషకాలు వేరే ఆహారాల్లో కూడా లభిస్తాయి. కాబట్టి వెరైటీ కోసం లేదా రుచి కోసం అప్పుడప్పుడు మఖానా తీసుకున్నా, ధర పెట్టలేని వారు సెనగలు, బఠాణీలు లాంటి గింజలు, వివిధ రకాల కాయగూరలు తీసుకోవడం ద్వారా అవే పోషకాలను చౌకగా పొందొచ్చు. మఖానాకు ఈ మధ్య కాలంలోనే ప్రాముఖ్యత పెరిగింది. వీటి ఆరోగ్య ప్రయోజనాలపై తగినన్ని శాస్త్రీయ పరిశోధనలు జరగలేదు. ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనల ఫలితాలు తెలిసిన తరువాత మఖానా వాడకం ఎంత ఉండాలో నిర్ణయించుకోవచ్చు. అంతవరకు, సమతులాహారంలో భాగంగా అప్పుడప్పుడు మఖానా తీసుకోవడంలో నష్టమేమి లేదు.


నాకు 60 ఏళ్లు. చాలా కాలంగా మధుమేహం ఉంది. ఈ మధ్య చేతులు కాళ్ళు తిమ్మిర్లుగా ఉంటున్నాయి. ఏవైనా ఆహారపు మార్పులతో సమస్య తీరుతుందా?

- రమణి, మహబూబ్‌నగర్‌

book6.2.jpg

దీర్ఘ కాలంపాటు రక్తంలో చక్కర స్థాయి అధికంగా ఉన్నట్టయితే నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల చేతులు, కాళ్ళు తిమ్మిర్లు ఎక్కడం, మొద్దుబారినట్టు కావడం, మంటలుగా అనిపించడం, అప్పుడప్పుడు నొప్పిగా ఉండడం జరగవచ్చు. దీనిని డయా బెటిక్‌ న్యూరోపతి అంటారు. ఇకపై నరాలు దెబ్బతినకుండా ఉండాలి అంటే ముఖ్యంగా చేయవలసిన పని- రక్తంలో చక్కర స్థాయిని నియంత్రించడం. దీనికోసం మీరు వైద్యుల సలహా మేరకు సమయానికి మందులు వాడాలి. అలాగే ఆహారంలో కూడా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే తెల్ల అన్నం, మైదా పిండితో చేసే పదార్థాలు, పంచదార, బెల్లం, దుంపలు మొదలైనవి చాలా తక్కువ తీసుకోవాలి లేదా పూర్తిగా మానెయ్యాలి. తెల్ల అన్నం బదులుగా బ్రౌన్‌ రైస్‌, గోధుమ లేదా జొన్న రొట్టె, రాగులు, సజ్జలు, జొన్నలతో చేసిన జావలు లేదా రొట్టెలు తీసుకోవడం మేలు. ఈ విషయాన్ని వైద్యులు లేదా పోషకాహార నిపుణులతో చర్చించి మీరు తీసుకునే మందులకు అను గుణంగా ఆహార వేళలు నిర్ణయిస్తే మంచిది. అన్నం, రొట్టె ఏది తీసుకున్నా సరే కూర పరి మాణం, పప్పు పరిమాణం ఎప్పుడూ అన్నం కంటే ఎక్కువే ఉండాలి. తీసుకునే ఆహారంలో ప్రోటీన్‌ కూడా తప్పని సరిగా ఉండాలి. కొన్ని సార్లు బీ-12 తగినంత లేకపోయినా తిమ్మిర్లు వస్తాయి.. వైద్యుల సలహా మేరకు రక్తపరీక్షలు చేయించి తగిన మందులు వాడవచ్చు.

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.com కు పంపవచ్చు)

Updated Date - Sep 28 , 2025 | 11:43 AM