Medication Mistakes: టాబ్లెట్స్ వేసుకున్నాక ఈ పనులు చేస్తే.. గ్యాస్, అల్సర్..
ABN , Publish Date - May 02 , 2025 | 12:00 PM
Medication Mistakes To Avoid: జబ్బు త్వరగా నయం కావాలంటే సరైన మందులు వేసుకోవడంతో పాటు తీసుకునే విధానమూ చాలా ముఖ్యం. టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత అందరూ సాధారణంగా చేసే ఈ పనుల వల్ల జబ్బు నయం కాకపోగా.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి.
What Not To Do After Taking Medication: మనమందరం ఏదో ఒక సమయంలో టాబ్లెట్స్ వాడతాం. తలనొప్పి, జ్వరం, జలుబు, ఇలా శరీరంలో అసౌకర్యంగా అనిపించిన వెంటనే ఏదైనా మాత్ర వేసుకోవడం ఈ రోజుల్లో సర్వసాధారణం. ప్రస్తుతం బీపీ, షుగర్, అల్సర్ లాంటి అనేక వ్యాధులతో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇలాంటి వారంతా ఆహారంతో పాటే ప్రతి రోజూ టాబ్లెట్స్ కూడా వేసుకుంటూ ఉంటారు. కానీ, మందులు వేసుకున్నాక చేసే ఈ పనుల వల్ల ఆ వ్యాధుల లక్షణాలు నియంత్రించలేరు. పైగా ఔషధాల ప్రభావం తగ్గిపోయి కొన్నిసార్లు ఆరోగ్యానికి హానికరంగా మారతాయి. కాబట్టి, మాత్రలు వేసుకున్న తర్వాత చేయకూడని తప్పులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రపోవడం లేదా పడుకోవడం
మనలో చాలామంది మందులు తీసుకున్న వెంటనే పడుకుంటారు లేదా నిద్రపోతారు. జ్వరం లేదా ఏదైనా నొప్పితో బాధపడే వ్యక్తి ఇంతకంటే ఏం చేయగలరని మీరనుకోవచ్చు. కానీ టాబ్లెట్స్ వేసుకున్న కాసేపటికి వరకూ నిటారుగా కూర్చోవడం సరైన పద్ధతని డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే, కొన్ని మందులు తీసుకున్న వెంటనే పడుకుంటే యాసిడ్ రిఫ్లక్స్, గ్యాస్ లేదా కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
టీ లేదా కాఫీ తాగడం
టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత టీ లేదా కాఫీ తాగితే ఉపశమనం లభిస్తుందని కొందరు భావిస్తుంటారు. కానీ ఇందుకు ఫలితం విరుద్ధంగా వస్తుంది. ఔషధం తీసుకున్న వెంటనే టీ లేదా కాఫీ తాగడం వల్ల దాని ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే, టీ, కాఫీ రెండింటిలోనూ కెఫిన్ ఉంటుంది. ఇది కొన్ని మందుల శోషణకు ఆటంకం కలిగిస్తుంది. అంతే కాకుండా, కడుపులో ఆమ్ల ఉత్పత్తిని పెంచి గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను తీవ్రం చేస్తుంది. కాబట్టి, మందులు తీసుకున్నాక కనీసం గంట గడిచారకే టీ లేదా కాఫీ తాగాలి.
వ్యాయామం లేదా భారీ బరువులెత్తే పని
ఏదైనా ఔషధం తీసుకున్న తర్వాత వ్యాయామం లేదా బాగా అలసిపోయే పని చేయడం మానుకోవాలి. మందులు తీసుకున్న తర్వాత శరీరానికి కచ్చితంగా విశ్రాంతివ్వాలి. అలాకాక శరీరాన్ని కష్టపెడితే ఆ మందులు సరిగా పనిచేయవు. అలసట, బలహీనత, తలతిరగడం లేదా వికారం వంటి సమస్యలు రావచ్చు.
రెండు మాత్రలను కలిపి తీసుకోకండి
చాలా మంది ఒకసారి మందు వేసుకోవడం మర్చిపోతే తర్వాతి సారి రెండు మాత్రలు వేసుకుంటే డోస్ సరిపోతుందని అనుకుంటారు. అయితే మర్చిపోవడం అస్సలు సమస్యే కాదు. మీరు ఒకేసారి రెండు మాత్రలను వేసుకుంటే అది అధిక మోతాదుగా మారుతుంది. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. ముఖ్యంగా ఇది కాలేయం, మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. మీరు మాత్ర వేసుకోవడం మర్చిపోయి డోస్ తగ్గిందని భావిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి సలహా తీసుకోండి.
పాలతో మాత్ర
పాలతో మందులు తీసుకుంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని ప్రజలలో ఒక అపోహ ఉంది. పాలు శరీరానికి బలాన్ని ఇస్తాయి కాబట్టి మందులు, పాలు కలిపి తీసుకుంటే జబ్బు త్వరగా నయమవుతుందని అనుకుంటారు. వాస్తవానికి, ఇలా చేయడం ద్వారా వారు తమ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి ఔషధాన్ని పాలతో కలపకూడదు. కొన్ని మందులు పాలతో చర్య జరిపి వాటి ప్రభావాన్ని కోల్పోవచ్చు. కాబట్టి, డాక్టర్ మీకు అలా చేయమని చెబితే తప్ప, పాలతో మందులు తీసుకోవడం మానుకోండి.
Read Also: Eye Cancer: సైలెంట్‌గా కళ్లను కాటేస్తున్న క్యాన్సర్.. ఈ లక్షణాలుంటే బీ అలర్ట్..
Mangoes: మధుర ఫలం.. కెమికల్స్‌తో విషతుల్యం
Head Injury: తలకు దెబ్బ తగిలిందా? ఈ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి