Head Injury: తలకు దెబ్బ తగిలిందా? ఈ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి
ABN , Publish Date - May 01 , 2025 | 09:02 AM
మెదడుకు దెబ్బ తగిలిన సందర్భాల్లో కొన్ని మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: మనకొచ్చే ప్రతి ఆలోచన, మదిలో మెదిలే ప్రతిభావన.. మనం చేసే ప్రతి పని ఇలా అన్నింటికీ మెదడే కారణం. కాబట్టి, మెదడు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. చిన్న చిన్న గాయాలు కూడా ఒక్కోసారి పెద్ద సమస్యలకు దారి తీయొచ్చన్న విషయాన్ని మర్చిపోకూడదు. నిపుణులు చెప్పేదాని ప్రకారం, తలకు దెబ్బ తగిలాక కొన్ని మార్పులు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి. మరి ఈ మార్పులు ఏంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
తలకు దెబ్బ కారణంగా మెదడుపై తీవ్రమైన ప్రభావం పడితే కొన్ని స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
మెదడుకు పెద్ద దెబ్బ తగిలినప్పుడు ఆలోచనలు నెమ్మదిస్తాయి. ఏదైనా పని లేదా అంశంపై దృష్టి పెట్టడం, ఏకాగ్రతతో పనిచేయడం కష్టంగా మారుతుంది. మనసు పదే పదే విచలితమవుతుంది.
కొందరికి జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. కొత్త విషయాలను గుర్తుపెట్టుకోవడం లేదా పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడం కష్టంగా మారుతుంది. కొత్త విషయాలను గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బందిని వైద్య పరిభాషలో యాంటిరోగ్రేడ్ ఆమ్నీషియా అని అంటారు.
మెదడుకు తీవ్రమైన గాయం అయినప్పుడు కొందరికి రాత్రిళ్లు నిద్ర దూరమవుతుంది. ఓపట్టాన నిద్రపట్టదు. భావోద్వేగాలపై నియంత్రణ కూడా తగ్గుతుంది. అకారణంగా నవ్వడం లేదా రోదించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మెదడుకు తీవ్రమైన గాయం అయిన సందర్భాల్లో కొందరికి చికాకు, ఆందోళన, డిప్రెషన్ వంటి వాటి బారిన పడతారు. ఇతరులతో సామాజిక బంధాలు నెరపడంలో ఇబ్బంది ఎదుర్కుంటారు. నలుగురితో కలుపుగోలుగా ఉండటంలో సమస్య తలెత్తుతుంది.
ఇలాంటి వారిలో నిర్ణయాత్మక శక్తి కూడా సన్నగిల్లుతుంది. గతానుభవాల నుంచి నేర్చుకోవడం, ప్రస్తుత పరిస్థితులకు వాటిని అన్వయించుకోవడం కష్టంగా మారుతుంది.
ఈ సమస్యల్లో ఏవి కనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇక ఈ సమస్యలను తగ్గించేందుకు కొన్ని ఉపాయాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మనసులో ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వడం, క్రమతప్పకుండా ఓ షెడ్యూల్ ఫాలోకావడం, ఔషధాలు వాడటం భావోద్వేగాలపై నియంత్రణ పెంచుకునేందుకు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ తీసుకోవడం చేస్తే కొంత వరకూ లాభం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
గుండె ఆరోగ్యానికి కార్డియో బెటరా లేక బరువులెత్తడం మంచిదా?
రోజూ జిమ్‌కు వెళతారా? మీరు తెలుసుకోవాల్సిన తప్పనిసరి విషయాలు ఏంటంటే..
కిడ్నీ సమస్యలున్న వాళ్లు టమాటాలు ఎందుకు తినొద్దంటే..