Share News

Flax Seeds: అవిసె గింజలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలుసుకుంటే అస్సలు వదలరు..

ABN , Publish Date - Jan 28 , 2025 | 07:20 AM

ఫ్లాక్స్ సీడ్స్ వీటినే తెలుగులో అవిసె గింజలు అంటారు. చిరుధాన్యాల్లో ఇవి ప్రధానమైనవి. చూసేందుకు నల్లగా చిన్నగా ఉన్నా.. వీటిని రోజూ ఓ టీ స్పూన్ తింటే చాలు ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా అవిసె గింజలతో క్యాన్సర్ కణాలను నిరోధించవచ్చు.

Flax Seeds: అవిసె గింజలతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తెలుసుకుంటే అస్సలు వదలరు..
Flax Seeds

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్యకాలంలో చాలా మందికి ఆరోగ్యంపై బాగా శ్రద్ధ పెరిగిపోయింది. ఆరోగ్యం కోసం కొంతమంది వాకింగ్, జాగింగ్‌లు చేస్తుంటే.. మరికొంతమంది వేల రూపాయలు ఖర్చు చేసి జిమ్ముల్లో కసరత్తులు చేస్తున్నారు. ఎప్పుడు ఏ అనారోగ్య సమస్య వస్తుందో తెలియక.. వాటిని నివారించేందుకు ముందుగానే జాగ్రత్త పడతున్నారు. మంచి పోషకాహారం తీసుకుంటూ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. మీరు డైట్‌లో ఫ్లాక్స్ సీడ్స్ చేర్చుకున్నట్లయితే ఎన్నో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల కలిగే ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


ఫ్లాక్స్ సీడ్స్ వీటినే తెలుగులో అవిసె గింజలు అంటారు. చిరుధాన్యాల్లో ఇవి ప్రధానమైనవి. చూసేందుకు నల్లగా చిన్నగా ఉన్నా.. వీటిని రోజూ ఓ టీ స్పూన్ తింటే చాలు ఎన్నో రోగాలకు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా అవిసె గింజలతో క్యాన్సర్ కణాలను నిరోధించవచ్చు. అవిసె గింజల్లో ఉండే గుణాలు రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. హార్మోన్ల అసమతుల్యతతో బాధపడుతున్న మహిళలు వీటిని రోజూ తింటే గొప్ప ఉపశమనం లభిస్తుంది.


ప్రస్తుతం చాలా మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. అలాగే బరువు పెరిగిపోతున్నామని ఆందోళన చెందే వారూ ఉన్నారు. ఆ సమస్యలను అవిసె గింజలతో మాయం చేయెుచ్చు. వీటిల్లో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ శరీర బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. అలాగే ప్రతి రోజూ ఈ గింజలు తీసుకోవడం ద్వారా దీర్ఘకాలిక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. వీటిల్లో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండడంతో శరీరానికి మంచి పోషణ లభించి ఆరోగ్యంగా ఉంటుంది.


డయాబెటిస్‌తో బాధపడేవారికి ఫ్లాక్స్ సీడ్స్ గొప్ప ఔషధమనే చెప్పాలి. వీటిని రోజూ తీసుకోవడం ద్వారా షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అవిసె గింజలు గుండె జబ్బులు రాకుండా నివారిస్తాయి. చెడు కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్ వంటి సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి వాళ్లు అవిసెలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించేందుకు సహజసిద్ధంగా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని అంటున్నారు. కాబట్టి, ప్రతి రోజూ వీటిని తిని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

Updated Date - Jan 28 , 2025 | 07:20 AM