Pollution: ప్రమాదంలో ఢిల్లీ.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:46 PM
సిగరెట్ స్మోకింగ్ ప్రధాన కారణంగా వచ్చే క్యాన్సర్ కేసులు ఢిల్లీలో విచిత్రస్థితిని చూపిస్తున్నాయి. గత 30 ఏళ్లలో ఢిల్లీలో లంగ్ క్యాన్సర్ రోగుల్లో స్మోకర్స్ నిష్పత్తి 90% నుంచి 50%కి తగ్గింది. అయితే, నాన్-స్మోకర్స్ కేసులు గణనీయంగా పెరిగాయి.
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 17: దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్ (లంగ్ క్యాన్సర్) ముప్పును గణనీయంగా పెంచుతోంది. ప్రత్యేకించి సిగరెట్ తాగని వారిలో (నాన్-స్మోకర్స్) ఈ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని శాస్త్రీయ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రిసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC) ప్రకారం, PM2.5 (ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్) వంటి కాలుష్య కారకాలు గ్రూప్-1 కార్సినోజెన్‌గా వర్గీకరించబడ్డాయి. ప్రతి 10 మైక్రోగ్రామ్/క్యూబిక్ మీటర్ PM2.5 పెరుగుదలకు లంగ్ క్యాన్సర్ రిస్క్ 8-14% వరకు పెరుగుతుందని మెటా-అనాలిసిస్ అధ్యయనాలు చెబుతున్నాయి.
ఢిల్లీలో సగటు వార్షిక PM2.5 స్థాయి 90-104 మైక్రోగ్రామ్/క్యూబిక్ మీటర్‌కు చేరుకుంటోంది. ఇది WHO మార్గదర్శకాలు (5 µg/m³) కంటే 18-20 రెట్లు ఎక్కువ. ఈ కారణంగా నాన్-స్మోకర్స్, ముఖ్యంగా మహిళలు.. యువతలో అడెనోకార్సినోమా రకం లంగ్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.
గత 30 ఏళ్లలో ఢిల్లీలో లంగ్ క్యాన్సర్ రోగుల్లో స్మోకర్స్ నిష్పత్తి 90% నుంచి 50%కి తగ్గగా, నాన్-స్మోకర్స్ కేసులు గణనీయంగా పెరిగాయి. ఆసుపత్రుల్లో శ్వాసకోశ సమస్యలతో వచ్చే రోగుల సంఖ్య 20-30% వరకు పెరిగింది. తీవ్ర దగ్గు, ఊపిరి ఆడకపోవడం, ఊపిరితిత్తుల పనితీరు బలహీనం వంటి లక్షణాలు సాధారణమవుతున్నాయి.
ఎక్కువసేపు బయట పనిచేసే యువతీయువకులు, పిల్లలు, వృద్ధులు ఎక్కువ ప్రమాద జోన్‌లో ఉన్నారు. నైట్రోజన్ డయాక్సైడ్ వంటి ఇతర కాలుష్య కారకాలు కూడా ఊపిరితిత్తుల్లోకి చేరి దీర్ఘకాలిక నష్టం కలిగిస్తున్నాయి.
కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు, మాస్కులు ధరించడం, ఇంటి లోపలే ఉండటం వంటి జాగ్రత్తలను నిఫుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం దీర్ఘకాలిక విధానాలు అవసరమని చెబుతున్నారు.
Also Read:
శీతాకాలంలో పచ్చి బఠానీలు తినొచ్చా?
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ 36ల మధ్యలో 63 ఎక్కడుందో 7 సెకెన్లలో కనిపెట్టండి..