Jubilee Hills Bypoll: సీఎంకు పట్టుకున్న ఓటమి భయం: నిరంజన్ రెడ్డి
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:24 PM
మరికొద్ది రోజుల్లో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటమి ఖాయమని బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఓటమి భయం సీఎం రేవంత్ రెడ్డి పట్టుకుందని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 04: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి జోస్యం చెప్పారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి.. నీటి విలువ, నోటి విలువ తెలియదన్నారు. ఆయనకు జూబ్లీహిల్స్ ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికల కోసం ప్రచారం చేస్తోన్నది సీఎం రేవంత్ రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై ఇష్టమెచ్చినట్లు మాట్లాడటమే సీఎం రేవంత్ రెడ్డికి తెలుసునని మండిపడ్డారు. తమ పార్టీ అధినేత కేసీఆర్‌పై కోపంతో మెత్తం వ్యవస్థను నాశనం చేస్తున్నారంటూ రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య పాలనలో తెలంగాణ రెండు తరాలు నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై రెండేళ్లకే ఆశలన్నీ పటాపంచలయ్యాయన్నారు.
నీళ్ల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్గొండ తప్ప ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. పాలమూరు అల్లుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ఆ జిల్లాలోని ప్రాజెక్టును పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. 2014 ముందు వరకు ఎస్ఎల్బీసీని కాంగ్రెస్, టీడీపీలు ఎందుకు పూర్తి చేయలేదని ఆయా పార్టీల నేతలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఎస్ఎల్బీసీ విషయంలో అవాస్తవాలు చెప్తుందంటూ కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నిక నవంబర్ 11వ తేదీన జరగనుంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోరు జరగనుంది. ఈ మూడు పార్టీలు తమ తమ అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఈ ఎన్నికల ప్రచార జోరు ఊపందుకొంది. ఆ పార్టీల అగ్రనేతలు సైతం రంగంలోకి దిగి.. తమ అభ్యర్థిని గెలిపించాలంటూ ఓటర్లకు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా కీలక హామీలు గుప్పిస్తున్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితం నవంబర్ 14వ తేదీన వెలువడనుంది.
ఇవి కూడా చదవండి..
కార్తీక పౌర్ణమి.. ఏం చేయాలి.. ఏం చేయకూడదు?
కార్తీక పౌర్ణమి.. 365 వత్తులతో దీపారాధన.. ఎందుకు వెలిగిస్తారంటే?
Read Latest Telangana News And Telugu News