Jubilee Hills Bypoll: ఎవరు గెలవాలి? లేడీనా? రౌడీనా?
ABN , Publish Date - Nov 08 , 2025 | 09:20 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బోగస్ ఓట్ల, దొంగ ఓట్లతో గెలవాలని అధికార కాంగ్రెస్ పార్టీ చూస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. కారు గుర్తుకు ఓటెయ్యాలనుకునే వాళ్లు నవంబర్ 11వ తేదీ ఉదయం 6 గంటలకు పోలింగ్ బూత్‌కు వెళ్లి లైన్లో నిల్చోని కారు గుర్తుకి ఓటు వేయాలని కోరారు.
హైదరాబాద్, నవంబర్ 08: ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి కర్రు కల్చి వాత పెట్టబోతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు జోస్యం చెప్పారు. శనివారం సాయంత్రం షేక్ పేట అంబేద్కర్ నగర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్ రావు మాట్లాడుతూ.. దురదృష్టం కొద్ది మీరంతా అమితంగా ఇష్టపడి గెలిపించుకున్న మాగంటి గోపీనాథ్ అనారోగ్య కారణంగా చనిపోయారన్నారు. మగదిక్కు లేని ఆ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడిందని స్పష్టం చేశారు.
గోపీనాథ్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన సతీమణి సునీతకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ కేటాయించిందని గుర్తు చేశారు. అలాంటి వేళ బాధతో.. దు:ఖంతో ఉన్న ఆడబిడ్డ సునీతను కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీతమ్మను అవహేళన చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి చెప్పాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు ఆయన సూచించారు. గోపీనాథ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేద ప్రజలకు, బస్తీ వాసులకు అండగా నిలిచారని చెప్పారు.
ఈ నియోజక వర్గం నుంచి ఎదురీతకు లేడీ నిలుచుంటే అటు వైపు రౌడీ నిలబడ్డారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ఎవరు గెలవాలి? లేడీనా? రౌడీనా? అంటూ నియోజకవర్గ ప్రజలను ఈ సందర్భంగా ప్రశ్నించారు. మీ కష్టాలు.. మీ సమస్యల పరిష్కరించేందుకు సునీతమ్మతోపాటు మేమంతా మీకు అండగా ఉంటామని ఈ సందర్భంగా బస్తీ వాసులకు హరీశ్ రావు హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి రోడ్ షోలకు జూబ్లీహిల్స్ ప్రజలు రావడం లేదని తన సొంత నియోజక వర్గం కొడంగల్ నుంచి జనాలను ఇక్కడికి రేవంత్ రెడ్డి తరలిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు రూ. 2, 500 ఇస్తామన్నారని.. అవి ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. మహిళలకు రూ. 2,500 రావాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఓటర్లకు సూచించారు. హామీలు ఎగ్గొట్టినా గెలిపించారని సీఎం రేవంత్ రెడ్డి మీకు ఇచ్చిన హామీలు అమలు చేయడని వివరించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట మీద నిలబడే మనిషి అని గుర్తు చేశారు. రూ. 200 ఉన్న పెన్షన్‌ను రూ. 2 వేలకు పెంచారన్నారు. ఆడబిడ్డ కాన్పు అయితే కేసీఆర్ కిట్టు తెచ్చి.. ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని ఇంటి వద్ద దించారన్నారు. బతుకమ్మ చీరలు, ఇంటింటికి నల్ల ద్వారా తాగే నీరు ఇచ్చింది కేసీఆర్ అని వివరించారు. కరెంటు కోతలు లేకుండా చేసింది కూడా కేసీఆరే అని తెలిపారు.
రేవంత్ రెడ్డి ఏం చేశాడు? హైడ్రా తేవడం తప్ప? అంటూ మండిపడ్డారు. ఈ అంబేద్కర్ నగర్‌లోని వాసులకు కూడా హైడ్రా నోటీసులు ఇచ్చారన్నారు. నోటీస్ ఇచ్చాక కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇల్లు కూలగొట్టడానికి అనుమతిచ్చారని రేవంత్ రెడ్డి అనుకుంటాడంటూ హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఇల్లు కూలగొడతాం అని చెప్పిన తర్వాత కూడా ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో ఇళ్లు కూల్చడం తప్ప ఒక్కరికైనా ఇల్లు కట్టాడా? అంటూ ప్రజలను ప్రశ్నించారు. హైదరాబాదులో కేసీఆర్ లక్ష ఇళ్లు కడితే రేవంత్ రెడ్డి లక్ష ఇళ్లను కూలగొట్టాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్‌లో రేవంత్ రెడ్డిని ఓడగొడితే.. మహబూబ్‌నగర్‌లోని అవ్వ రూ. 4 వేలు పెన్షన్ వస్తుందని ఎదురు చూస్తుందన్నారు. నల్గొండ చెల్లి జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడగొడితే రూ. 2,500 వస్తాయని ఎదురు చూస్తుందని తెలిపారు.
జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను ఓడిస్తే.. కరీంనగర్‌లో రైతన్న.. తనకు రూ.15 వేల రైతుబంధు పథకం కింద వస్తుందని ఎదురు చూస్తున్నాడని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చదువుకునే విద్యార్థులకు సైతం సీఎం రేవంత్ రెడ్డి స్కాలర్‌షిప్‌లు ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. కరోనా వచ్చినా.. కష్టం వచ్చినా.. ఆ సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్ షీప్ విద్యార్థులకు అందించిందని గుర్తు చేసుకున్నారు. కరోనా సమయంలో కేసీఆర్ కడుపులో పెట్టుకొని కంటికి రెప్పలా ప్రజలను కాపాడుకున్నారని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు మీ చేతలతో సమాధానం చెప్పాలంటూ ప్రజలకు ఆయన పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ప్రజలకు స్పష్టం చేశారు.
బోగస్ ఓట్ల, దొంగ ఓట్లతో గెలవాలని అధికార పార్టీ చూస్తోందని ఆరోపించారు. కారు గుర్తుకు ఓటెయ్యాలనుకునే వాళ్ళు పోలింగ్ రోజు.. ఉదయం 6 గంటలకు పోలింగ్ రోజు లైన్లో నిల్చోని కారు గుర్తుకి ఓటు వేయాలని కోరారు. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. బుల్డోజర్ ఉండదు.. కాంగ్రెస్ పార్టీ ఉండదన్నారు. కాంగ్రెస్ లేక పోతే మీరు లేరంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ముస్లింలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కంటే ముందు ముస్లింలు ఉన్నారని.. ఆ పార్టీ ఖతమైన తర్వాత కూడా వారు ఉంటారని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఓటుతో సమాధానం చెప్పాలంటూ ముస్లిం సోదరులకు ఈ సందర్భంగా హరీశ్ రావు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కుప్పంలో ఏడు పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
మొంథా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర బృందం
For More TG News And Telugu News