Share News

Telugu Talli vs Telangana Talli: తెలుగు తల్లి తెలంగాణ తల్లి

ABN , Publish Date - Oct 16 , 2025 | 03:16 AM

తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ సరిహద్దుల కోసం జరగలేదు. అది ఒక భావోద్వేగ, సాంస్కృతిక, ఆత్మగౌరవ ఉద్యమం. ఈ ఉద్యమంలో ‘తెలంగాణ తల్లి’ అనే ప్రతీక తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తూ అవతరించింది....

Telugu Talli vs Telangana Talli: తెలుగు తల్లి తెలంగాణ తల్లి

తెలంగాణ ఉద్యమం కేవలం రాజకీయ సరిహద్దుల కోసం జరగలేదు. అది ఒక భావోద్వేగ, సాంస్కృతిక, ఆత్మగౌరవ ఉద్యమం. ఈ ఉద్యమంలో ‘తెలంగాణ తల్లి’ అనే ప్రతీక తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తూ అవతరించింది. ఆ ప్రతీక తెలంగాణ ప్రజల చరిత్ర, భూభాగం, సంస్కృతి, యాసలకు ప్రతీకగా నిలిచింది. ఈ సాంస్కృతిక నిర్మాణంలో ఒక గందరగోళం కూడా రూపుదిద్దుకుంది. అదే ‘తెలుగు తల్లి, తెలంగాణ తల్లి’ అనే రెండు భావనల మధ్య ఉన్న అస్పష్టత.

హైదరాబాద్‌లోని తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ను ‘తెలంగాణ తల్లి’ ఫ్లైఓవర్‌గా మారుస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈ చర్చను మరింత ఉధృతం చేసింది. ఒక వర్గం దీన్ని తెలంగాణ గౌరవానికి ప్రతీకగా స్వాగతిస్తే, మరొక వర్గం దీన్ని తెలుగు భాషా ఐక్యతకు విరుద్ధమని అభిప్రాయపడింది. ఈ సందర్భంలో తెలుగు భాషకు, తెలంగాణ భౌగోళిక అస్తిత్వానికి మధ్య స్పష్టమైన గీత గీయడం అత్యవసరం.

తెలుగు భాష కేవలం ఒక మాటల వ్యవహారమేమీ కాదు; అది శతాబ్దాల సాంస్కృతిక ప్రవాహం. నన్నయ, తిక్కన, పోతన, శ్రీనాథుడు, అన్నమయ్య, త్యాగయ్య, దాశరథి వంటి మహానుభావులు ఈ భాషకు దిశా నిర్దేశం చేశారు. ఈ భాష కేవలం ఆంధ్రప్రదేశ్‌ది కాదు, తెలంగాణదీ కాదు. రెండింటికీ సమానంగా సొంతం. కాకతీయుల గర్వం, శాతవాహనుల శక్తి, భద్రాచలం రామదాసు, బాసర సరస్వతి, కూచిపూడి, పేరిణీ నృత్యాలు... ఇవన్నీ రెండు ప్రాంతాల సంస్కృతిలో అంతర్భాగాలే. భౌగోళిక సరిహద్దులు మారినా ఈ వారసత్వం విడిపోదు. కానీ రాజకీయ అవసరాలు ఈ ఉమ్మడి సంస్కృతిని విభజించాలనే ప్రయత్నం చేస్తున్నాయి. ‘తెలంగాణ యాస’ అనేది తెలుగు భాషలోని ఒక విలువైన వర్ణం; అది స్వతంత్ర భాష కాదు. దానిని వేరు చేసి చూపించడం అంటే... భాషా ఐక్యతకు బీటలు వేయడమే.


ప్రపంచీకరణ యుగంలో స్థానిక భాషలు తమ అస్తిత్వం కోసం పోరాడుతున్నాయి. ఇంగ్లీష్, హిందీ ఆధిపత్యం పెరుగుతున్న వేళ తెలుగు భాష మనకోసం కాకుండా, మనమే దాని కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది. రాజకీయ ప్రతీకల కోసం పేర్ల మార్పులు చేయడం, ఉత్సవాల్లో మాత్రమే తెలుగు మాట్లాడడం... వంటివి సరిపోవు. సాహిత్యం, సినిమా, విద్య, సాంకేతికత, సామాజిక మాధ్యమాల ద్వారా తెలుగు భాషను ఆధునికతతో మేళవించి యువతకు చేరువ చేయాలి.

భాషను కాపాడేది ప్రభుత్వాలు కాదు, ప్రజలు. మనందరిలోనూ తెలుగు భాష పట్ల గౌరవం ఉండాలి. పిల్లలు ఇతర భాషలు నేర్చుకోవడం తప్పు కాదు, కానీ తెలుగు మర్చిపోవడం తప్పు. తెలుగు పాఠ్యపుస్తకాలు, పత్రికలు, డిజిటల్ మీడియా, పాడ్‌కాస్ట్‌లు, సినిమాలు... ఇవన్నీ భాషా సంరక్షణకు సాధనాలుగా మారాలి. భాషకు సంబంధించినంత వరకూ తెలంగాణ, ఆంధ్రా అనే పేర్లు పెట్టుకుని విభజించుకోవడం కంటే ‘మన తెలుగు’ అనే భావనను బలపరచాలి. తెలుగు భాషలోని విభిన్న యాసలు, పదాలు, పాటలు అన్నీ కలిసి ఒక మహా ప్రవాహాన్ని సృష్టిస్తాయి. ఆ ప్రవాహాన్ని విభజించాలనుకోవడం అంటే సాహిత్యాన్ని కూడా రెండు సగాలుగా విడగొట్టడమే. పాలకులు, ప్రజలు, పండితులు... అందరూ ఈ భాషా వారసత్వాన్ని కొత్త తరాలకు అందించే కర్తవ్యాన్ని స్వీకరించాలి. తెలుగు తల్లి మన సాహిత్యానికి చిహ్నం, తెలంగాణ తల్లి మన సంస్కృతికి చిహ్నం. ఈ రెండూ కలిస్తేనే మన తెలుగు సంపూర్ణ రూపం.

– శ్రీనివాస్ గౌడ్ ముద్దం

ఇవి కూడా చదవండి..

మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. 27 మంది లొంగుబాటు

బెదిరింపులు నాకేం కొత్త కాదులే.. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఇక పోరాటమే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 16 , 2025 | 03:16 AM