Share News

Karur Stampede Tragedy: కరూర్‌ ప్రశ్నలు

ABN , Publish Date - Oct 16 , 2025 | 03:23 AM

కరూర్‌లో సెప్టెంబర్‌ 27న జరిగిన తొక్కిసలాటమీద బుధవారం తమిళనాడులోని శాసనసభలో చర్చకంటే రచ్చ అధికంగా జరిగింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే)అధినేత, నటుడు సి.జోసెఫ్‌ విజయ్‌ పేరు ప్రస్తావించకుండా ముఖ్యమంత్రి స్టాలిన్‌ చాలా...

Karur Stampede Tragedy: కరూర్‌ ప్రశ్నలు

కరూర్‌లో సెప్టెంబర్‌ 27న జరిగిన తొక్కిసలాటమీద బుధవారం తమిళనాడులోని శాసనసభలో చర్చకంటే రచ్చ అధికంగా జరిగింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే)అధినేత, నటుడు సి.జోసెఫ్‌ విజయ్‌ పేరు ప్రస్తావించకుండా ముఖ్యమంత్రి స్టాలిన్‌ చాలా విమర్శలు చేశారు. కరూర్‌లో తలపెట్టిన ర్యాలీకి విజయ్‌ ఆలస్యంగా రావడం ఈ తొక్కిసలాటకు దారితీసి, ఘోరాతిఘోరంగా నలభై ఒక్కమంది ప్రాణాలు పోయాయంటూ బాధిత కుటుంబాలకు ఆయన సభాముఖంగా తీవ్ర సానుభూతి తెలియచేశారు. పోలీసుల నుంచి అనుమతి తీసుకున్న సమయానికి ఏ మాత్రం కట్టుబడకుండా టీవీకే పూర్తి భిన్నంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. విజయ్‌ ఏడుగంటలు ఆలస్యంగా రావడంతో పాటు, ఆయన భారీ ప్రచారవాహనం జనం మధ్యనుంచి వెడుతున్న క్రమంలో గందరగోళం, తొక్కిసలాట చోటుచేసుకున్నాయని, ఈ క్రమంలో కొందరు జనరేటర్‌ గదిలోకి ప్రవేశించి దానిని నిలిపివేశారని, ప్రజలకు కనీసం మంచినీళ్ళు కూడా ఆ పార్టీ ఏర్పాటుచేయలేదని స్టాలిన్‌ విమర్శించారు. క్షతగాత్రులకు సాయపడేందుకు వైద్యసిబ్బంది ప్రయత్నిస్తుంటే, టీవీకే కార్యకర్తలు రెండు అంబులెన్స్‌లమీద దాడిచేశారనీ, పదకొండు నిబంధనలతో పోలీసులు ఈ ర్యాలీకి అనుమతి మంజూరు చేస్తే, విజయ్‌పార్టీ వాటిని పాటించలేదనీ స్టాలిన్‌ ఆరోపణ. ఈ దారుణం జరగకుండా నివారించాల్సింది ప్రభుత్వమేననీ, స్టాలిన్‌ తన వైఫల్యం ఒప్పుకోవాల్సిందేనంటూ అన్నాడీఎంకె సభలో టీవీకేనీ, విజయ్‌నీ సమర్థించుకుంటూ వచ్చినందుకు ముఖ్యమంత్రికి మాచెడ్డకోపం వచ్చింది. మన విపక్షం మరోపార్టీ పక్షాన ఇంతగా ఎందుకు గొంతుచించుకుంటున్నదీ అంటే, పొత్తు కోసం... ఏది జరిగినా అధికారం మళ్ళీ మాదేనంటూ స్టాలిన్‌ ప్రకటించారు. కరూర్‌ విషాద‍ ఘటన జరగ్గానే, పోలీసులు చెప్పిన విషయాలు, మంత్రులు చేసిన ఆరోపణలనే స్టాలిన్‌ చట్టసభలోనూ పునరుద్ఘాటించినట్టు కనిపిస్తున్నప్పటికీ, సీబీఐ దర్యాప్తుతో ఈ అంశం చేజారిపోతున్న కోపం, బాధ ఆయనకు ఉండటం సహజం.


సుప్రీంకోర్టు సోమవారం తీసుకున్న నిర్ణయంమీద విభిన్నమైన అభిప్రాయాలు, విశ్లేషణలూ సాగుతున్నాయి. ఒక ప్రఖ్యాత నటుడు, రాజకీయనాయకుడిగా అవతారమెత్తి ఒక భారీ ర్యాలీ సంకల్పించినప్పుడు సంభవించిన ఈ విషాదంమీద లోతైన దర్యాప్తు జరగాల్సిందే. అంచనాలను మించి జనాన్ని పోగేస్తున్న నిర్వాహకులు, అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ వ్యవస్థలు బాధ్యతగా వ్యవహరించిందీ లేనిదీ తేలవలసిందే. ఆ పాపంలో ఎవరివాటాలూ కోటాలూ ఎంతో సీబీఐ అయితే కచ్చితంగా, పక్షపాతరహితంగా నిగ్గుతేలుస్తుందని అధికుల నమ్మకం. దీనికితోడు, సీబీఐ జరపబోయే ఈ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అజయ్‌రస్తోగీ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని కూడా సర్వోన్నత న్యాయస్థానం నియమించినందున, అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ప్రమేయం ఉండదని ఓ నమ్మకం. దేశాన్ని కుదిపేసిన ఈ విషాదఘటనను తమిళనాట పార్టీలన్నీ రాజకీయం చేస్తున్న తరుణంలో వాటి ప్రభావాలకు అతీతంగా, అందనంత ఎత్తులో ఈ దర్యాప్తు జరగాలన్నది సుప్రీంకోర్టు అభిప్రాయం కావచ్చు.


అయితే, సుప్రీం నిర్ణయం మీద మద్రాస్‌ హైకోర్టు వైఖరి అధికంగా పనిచేసినట్టు కనిపిస్తోంది. టీవీకే కోరుతున్నట్టుగా సీబీఐ దర్యాప్తుకు హైకోర్టు అంగీకరించకపోవడమే కాక, విజయ్‌కు నాయకత్వ లక్షణాలు లేవని, ఘటన జరగ్గానే వారంతా పారిపోయారని సదరు న్యాయమూర్తి విమర్శలు చేయడంతోపాటు, విజయ్‌ను ఎందుకు అరెస్టు చేయలేకపోయారంటూ కొన్ని అనవసర, వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం టీవీకే పార్టీకి కలిసొచ్చింది. రాష్ట్ర పోలీసులమీద తమకు నమ్మకంలేదని, అది నియమించిన విచారణ కమిటీ తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని ఆరోపణలు చేస్తూ సీబీఐ దర్యాప్తును కోరుతున్న టీవీకే పార్టీ హైకోర్టు తీర్పును కూడా బూచిగా చూపడం, దానిని సుప్రీంకోర్టు అంగీకరించడంతో అంతిమంగా విజయ్‌ వాదనే నెగ్గింది. ఇప్పటివరకూ రాష్ట్రస్థాయిలో జరిగిన దర్యాప్తును అధ్యయనం చేసి, అందులో తీవ్రమైన లోటుపాట్లు ఉన్నపక్షంలో సీబీఐ గురించి సర్వోన్నత న్యాయస్థానం ఆలోచించివుంటే బాగుండేది. కానీ, విషాదానికి కారకులైనవారే తమకు ఏ విధంగా న్యాయం జరుగుతోందో చెప్పడం, తాము కోరుకున్న దానినే చివరకు సాధించుకోవడం విచిత్రం. మా పోలీసులమీద మాకు నమ్మకం లేదని ఓ రాజకీయనాయకుడో, ఓ పార్టీయో అన్నంతమాత్రాన సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తే ఎలా? అని గతంలో వ్యాఖ్యానించిన సర్వోన్నతన్యాయస్థానమే, ‘పంజరంలో చిలుక’ అంటూ తాను తప్పుబట్టిన సంస్థకే ఈ కేసు అప్పగించడం విశేషం. మరో ఆరేడునెలల్లో తమిళనాడు ఎన్నికలకు వెళ్లనున్న నేపథ్యంలో, అంతలోగా నిజాలు వెలుగుచూడాలని కోరుకుందాం.

ఇవి కూడా చదవండి..

మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. 27 మంది లొంగుబాటు

బెదిరింపులు నాకేం కొత్త కాదులే.. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఇక పోరాటమే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 16 , 2025 | 03:23 AM