ఇదేనా న్యాయం?
ABN , Publish Date - Feb 14 , 2025 | 02:23 AM
ఒకరి మరణానికి మరొకరి చర్యలు కారణమైనట్టుగా రుజువైతే చాలు, భారతదేశ చట్టాల ప్రకారం సదరు వ్యక్తికి ఐదేళ్ళనుంచి యావజ్జీవం వరకూ శిక్షపడుతుంది. కేసు తీవ్రత, ఇమిడివున్న హింస ఇత్యాదివి...

ఒకరి మరణానికి మరొకరి చర్యలు కారణమైనట్టుగా రుజువైతే చాలు, భారతదేశ చట్టాల ప్రకారం సదరు వ్యక్తికి ఐదేళ్ళనుంచి యావజ్జీవం వరకూ శిక్షపడుతుంది. కేసు తీవ్రత, ఇమిడివున్న హింస ఇత్యాదివి న్యాయమూర్తుల మనసును తాకితే శిక్షల స్థాయిలో తేడాలుంటాయి. ఇటీవల ఛత్తీస్‌గఢ్ హైకోర్టు న్యాయమూర్తి ఒక భయానకమైన కేసులో చెప్పిన తీర్పు ఆగ్రహాశ్చర్యాలను కలిగించింది, తీవ్ర చర్చకు దారితీసింది. భార్య నిరాకరిస్తున్నా అసహజ శృంగారం చేసి అంతిమంగా ఆమె చావుకు కారకుడైన ఓ నలభైయేళ్ళ వ్యక్తిని జస్టిస్ నరేంద్రకుమార్ వ్యాస్ నిర్దోషిగా ప్రకటించి, జైలునుంచి వదిలేయాల్సిందిగా ఆదేశించారు. తన చావుకు భర్త కారకుడని, తాను తిరస్కరిస్తున్నా అతడు అసహజమైన రీతుల్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడని మేజిస్ట్రేట్ సమక్షంలో భార్య ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, ఇప్పటికే జగదల్‌పూర్ అదనపు సెషన్స్ న్యాయమూర్తి అతడికి పదేళ్ళ కఠిన కారాగారశిక్ష విధించింది. ఆ తీర్పును ఇప్పుడు రద్దుచేస్తూ, భార్య వయసు పదిహేనేళ్ళు దాటినపక్షంలో, ‘సమ్మతి’ అన్నమాటకు విలువే ఉండదని న్యాయమూర్తి అన్నారు. వైవాహిక బంధంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు అన్న మాటలకు ఈ దేశచట్టాలు తావివ్వవు కనుక, ‘మారిటల్ రేప్’కు పాల్పడినందుకు మగవాడిని అరెస్టుచేయడానికి ఇక్కడ వీల్లేదు కనుక దిగువకోర్టు శోధించి విధించిన సెక్షన్లన్నింటినీ హైకోర్టు న్యాయమూర్తి పక్కకు నెట్టి సదరు భర్తను నిర్దోషి అని తేల్చేశారు. ఐపీసీ సెక్షన్ 375లో భర్తలకు దఖలుపడిన మినహాయింపుల కారణంగా, అత్యాచారం, అసహజ శృంగారం, దోషపూరిత నరహత్య ఇత్యాదివన్నీ ఈ కేసులో కొరగాకుండా పోయాయి. అన్యాయమైన చట్టాలున్నప్పుడు తీర్పులు కూడా అన్యాయంగానే ఉంటాయి. కానీ, ఈ కేసులో దిగువకోర్టులో బాధితురాలికి దక్కిన ఆ కాస్త మరణానంతర న్యాయం కూడా పెద్దకోర్టులో లభించకపోవడం విషాదం.
ఆమె మరణానికీ, వాంగ్మూలానికీ విలువే లేకపోయింది. 2013లో ఐపీసీ సెక్షన్ 375కు చేసిన సవరణ కారణంగా వైవాహిక బంధంలో భార్య అనుమతి, సమ్మతికి తావు లేకపోయింది. భర్తచేసే లైంగికచర్య ఎటువంటిదైనా అత్యాచారం కాకుండా పోయింది. అఘాయిత్యాలకు కూడా అధికారిక అనుమతి దక్కింది. నిర్దిష్ట వయోపరిమితి దాటితే చాలు, ఆమె అభీష్టంతో నిమిత్తం లేకుండా శృంగారానికి తెగబడవచ్చు. అతడి అసహజ శృంగారం కారణంగానే ఆమె శరీర అంతర్భాగాలు ఛిద్రమై మరణించిందని పోస్టుమార్టమ్ నివేదిక నిర్ధారించింది. వైవాహిక బంధంలో అత్యాచారం అన్నదానికి గుర్తింపు లేనందున, ఆమె ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా శృంగారం చేయడానికే కాదు, అసహజరీతిలో వ్యవహరించి ప్రాణాలనే ప్రమాదంలో పడవేయవచ్చునని ఈ తీర్పు చెబుతోంది. వైవాహిక స్థితితో నిమిత్తం లేకుండా ప్రతీ వ్యక్తి హక్కునూ, గౌరవాన్ని పరిరక్షించాల్సిన చట్టాలు కేవలం పెళ్ళయిన కారణంగా సమ్మతికి స్థానం లేకుండా చేసి, మరొకరికి బలిపెట్టే రీతిలో తయారుకావడం సరికాదు.
ఎనిమిదేళ్ళనాటి ఈ కేసు భారత న్యాయసంహితలోనూ పకడ్బందీగా కొనసాగుతున్న నిబంధలను సరిదిద్దుకోవాల్సిన కర్తవ్యాన్ని గుర్తుచేస్తోంది. కేవలం వివాహం అయిన కారణంగా ఆమె మరణానికి కారకుడైన వ్యక్తికి సెక్షన్ 304, 376, 377 వంటివి వర్తించకుండాపోవడం, భార్య మరణ వాంగ్మూలానికీ, పోస్టుమార్టమ్ నివేదికకూ వీసమెత్తు విలువలేకపోవడం, ఆమె మరణానికి కారకుడైనప్పటికీ భర్త అయినందున చట్టం అతడిని వదిలెయ్యడం సరికాదు.
వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేమనీ, ఇది చట్టబద్ధమైన అంశాన్ని మించిన సామాజిక సమస్య అని కేంద్రం వాదిస్తోంది. వివాహం చేసుకున్నంత మాత్రాన సమ్మతి తొలగిపోయినట్లు కాదనీ, దానిని రక్షించే నిబంధనలున్నాయని మరోపక్క హామీ ఇస్తోంది. కానీ, ఈ తీర్పు అనంతరం అనేక కొత్త ప్రశ్నలు, సవాళ్ళు తలెత్తాయి. సుప్రీంకోర్టు తక్షణ జోక్యంతో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ఆదేశాలను నిలువరించి, సమాజానికి తప్పుడు సందేశాలు పోకుండా జాగ్రత్తపడాలి. ఆమోదం లేని శృంగారానికీ, పెళ్ళి ముసుగులో జరిగే అఘాయిత్యాలకు ఎటువంటి రక్షణలూ దక్కకుండా దేశ సర్వోన్నత న్యాయస్థానం, కేంద్రప్రభుత్వం కలసికట్టుగా కృషిచేయాలి.
Also Read:
ఇద్దరు మహిళలు కలిస్తే ఇలాగే ఉంటుందేమో..
బర్డ్ ఫ్లూ.. సీఎస్ విజయానంద్ ఏం చెప్పారంటే..
అప్పుల తెలంగాణ.. కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..
For More Andhra Pradesh News and Telugu News..