Share News

Bird Flu: తప్పుడు ప్రచారం నమ్మెుద్దు.. సీఎస్ విజయానంద్ సంచలన విషయాలు వెల్లడి..

ABN , Publish Date - Feb 13 , 2025 | 08:49 PM

బర్డ్ ఫ్లూ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎస్ విజయానంద్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Bird Flu: తప్పుడు ప్రచారం నమ్మెుద్దు.. సీఎస్ విజయానంద్ సంచలన విషయాలు వెల్లడి..
AP CS Vijayanand

అమరావతి: తెలుగు రాష్ట్రాల ప్రజలను బర్డ్ ఫ్లూ వ్యాప్తి ప్రచారం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. భయంతో రెండు రాష్ట్రాల ప్రజలు వణికిపోతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించి తప్పుడు ప్రచారం నమ్మెుద్దని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. బర్డ్ ఫ్లూ నివారణకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లు సీఎస్ వెల్లడించారు. రాష్ట్రంలో రెండు, మూడు జిల్లాల్లో మాత్రమే కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాపించిందని తెలిపారు. ఆయా ప్రాంతాల్లో తగిన చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగాన్ని ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా సహా ఎక్కడైనా తప్పుడు వదంతులు వింటే వాటిని నమ్మెుద్దని సీఎస్ విజయానంద్ విజ్ఞప్తి చేశారు.


బర్డ్ ఫ్లూ విషయంలో ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎస్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి పశుసంవర్ధక, వైద్య ఆరోగ్య శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వారికి దిశానిర్దేశం చేశారు. చనిపోయిన కోళ్లను సక్రమంగా పూడ్చిపెట్టే విషయంలో అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు సీఎస్. బర్డ్ ఫ్లూ వ్యాప్తి నియంత్రణకు కేంద్ర ప్రభుత్వ సైతం మార్గదర్శకాలను జారీ చేసిందని చెప్పుకొచ్చారు.


కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను కలెక్టర్లకు పంపామని ఆయా మార్గదర్శకాలను అధికారులు పాటించాలని సీఎస్ విజయానంద్ సూచించారు. కేంద్రం పంపిన మార్గదర్శకాల ప్రకారం వ్యాధి సోకిన ప్రాంతానికి ఒక కిలోమీటర్ పరిధిని రెడ్ జోన్‌గా ప్రకటించి అక్కడ రాకపోకలను నియంత్రించాలని సీఎస్ చెప్పారు. అలాగే కోళ్ల దాణా రవాణాను సైతం నియంత్రించాలని స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతం నుంచి తొమ్మిది కిలోమీటర్ల పరిధిలో ముందస్తు జాగ్రత్తలను చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. దీన్ని పశుసంవర్ధక శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Feb 13 , 2025 | 08:49 PM