Pakistan Airstrikes: పాక్‌లో ప్రజాసంహారం
ABN , Publish Date - Sep 27 , 2025 | 01:26 AM
పాకిస్థాన్ తన ప్రజలను తానే ఊచకోతకోస్తోందని ఐక్యరాజ్యసమితిలో భారత్ విమర్శించినప్పటికీ, ఎన్నడైనా ఆ ప్రావిన్సులోని జనాన్ని పాక్ తనవారని అనుకున్నదా? ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్సులోని తిరా లోయలో ఇటీవల పాకిస్థాన్ యుద్ధవిమానాలు బాంబుల వర్షం...
పాకిస్థాన్ తన ప్రజలను తానే ఊచకోతకోస్తోందని ఐక్యరాజ్యసమితిలో భారత్ విమర్శించినప్పటికీ, ఎన్నడైనా ఆ ప్రావిన్సులోని జనాన్ని పాక్ తనవారని అనుకున్నదా? ఖైబర్ ఫక్తున్‌ఖ్వా ప్రావిన్సులోని తిరా లోయలో ఇటీవల పాకిస్థాన్ యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించి ముప్పైమంది ప్రాణాలు తీశాయి. చనిపోయినవారిలో మహిళలు, పిల్లలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, గాయపడినవారి లెక్కలు బయటకు తెలియలేదని వార్తలు వచ్చాయి. నేలమట్టమైన ఇళ్ళు, కుప్పకూలిన భవనాలు, తగలబడుతున్న వాహనాలు, శిధిలాల్లో చిక్కుబడిన మృతదేహాలు ఇత్యాది దృశ్యాలతో ఒళ్ళు గగుర్పొడిచే రీతిలో ఈ మారణకాండ సాగింది. ఇటీవలే వరుస వరదలతో తీవ్రంగా దెబ్బతిని ఉన్న ఈ పాక్ వాయవ్య ప్రావిన్సు ప్రజలకు ఇది మరో దెబ్బ. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్థాన్ (టీపీటీ)కు చెందిన పేలుడు పదార్థాల గోదాము పేలిపోయి ఈ మరణాలు సంభవించాయని పాకిస్థాన్ ప్రభుత్వం బుకాయిస్తోంది. అయితే, అఫ్ఘానిస్థాన్ సరిహద్దు సమీపంలో జరిగిన ఈ వైమానిక దాడుల మీద సమగ్ర విచారణ జరపాలని పాకిస్థాన్ మానవహక్కుల సంఘం డిమాండ్ చేయడాన్ని బట్టి జరిగినదేమిటో అర్థమవుతూనే ఉంది.
నిరాయుధులైన ప్రజలను బాంబులతో హతమార్చడం ఎన్నడైనా చూశామా అంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన వందలాది మంది వైమానిక దాడులను నిరసిస్తూ పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారట. పాకిస్థాన్ సైనికబలగాలు తిరా లోయలో ఇలా ఘాతుకాలకు పాల్పడటం, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటివి ఖండిస్తూండటం, పాకిస్థాన్‌లోని పలు సంస్థలు విచారణకు డిమాండ్ చేయడం సర్వసాధారణమైపోయింది. పాకిస్థాన్‌తో దాదాపు యుద్ధమే చేస్తున్న టీపీటీకి ఇది అత్యంత కీలకమైన ప్రాంతం. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో స్థావరాలు ధ్వంసమైన చాలా ఉగ్రసంస్థలు కూడా తమ మకాం ఇటు మార్చాయని వార్తలు వస్తున్నాయి.
తెల్లవారుజామునే జరిపిన ఈ వైమానికదాడిలో చైనా తయారీ విమానాలను, బాంబులను పాకిస్థాన్ వాడిందట. బలూచిస్థాన్ తరువాత అత్యధిక ఉగ్రదాడులను చవిచూస్తున్న ఈ పర్వత ప్రాంతాలమీద ఆధిపత్యం సాధించడానికి పాకిస్థాన్ వరుస ప్రభుత్వాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అఫ్ఘానిస్థాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం టీపీటీకి అండదండలు అందిస్తున్నదని పాకిస్థాన్ ఆరోపణ. అఫ్ఘాన్ ప్రభుత్వ నీడలో ఉంటూ, సొరంగ మార్గాలద్వారా పాకిస్థాన్‌లోకి ప్రవేశించి టీటీపీ ఉగ్రదాడులకు పాల్పడుతున్నదని, దానిని నియంత్రించాలని పాక్ ప్రభుత్వం కోరడం, అఫ్ఘాన్ పాలకులు కొట్టిపారేయడం తెలిసిందే. శాంతిభద్రతలు కాపాడుకోలేని పాక్ పాలకులు తమను ఆడిపోసుకుంటున్నారని అఫ్ఘాన్ నేతలు అంటారు. అఫ్ఘానిస్థాన్‌లో నాలుగేళ్ళక్రితం తిరిగి అధికారంలోకి వచ్చిన తాలిబాన్ గతంలో మాదిరిగా పాకిస్థాన్ మాట వినడం మానేసింది. అల్లా దయవల్ల తాలిబాన్ తిరిగి తమ పొరుగుదేశంలో అధికారం చేపట్టిందని ఎగిరిగంతేసిన ఇమ్రాన్‌ఖాన్‌కు అతి త్వరలోనే సత్యం తెలిసొచ్చింది. తాలిబాన్‌ను కట్టడిచేయడానికి పాక్ ప్రయత్నించినప్పుడల్లా టీటీపీ తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తోంది. ఇటీవల పన్నెండుమంది పాక్ సైనికులను టీటీపీ ఊచకోత కోసినందుకు ప్రతీకారంగా పాక్ సైన్యం సోమవారం ఖైబర్ ప్రావిన్సులో ఈ వైమానిక దాడి జరిపిన మాట నిజం.
ఖైబర్ ఫక్తున్‌ఖ్వా, బలూచిస్థాన్ ప్రావిన్సులు పాక్ పాలకులకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఖైబర్‌లోని కొన్ని ప్రాంతాలను టీపీటీ ఏలుతున్నదని, ఆర్థికవ్యవహారాలు, కోర్టులు, భద్రత ఇత్యాదివన్నీ అదే నిర్వహిస్తున్నదని అంటారు. మరోపక్క స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలూచ్ వేర్పాటువాదులు సైనిక స్థావరాలు, గ్యాస్ పైప్‌లైన్లు, రైల్వేలైన్లు, చైనా–పాక్ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా ఉన్న ప్రాజెక్టులమీద భీకరదాడులకు పాల్పడుతున్నారు. ఖైబర్, బలూచ్ ప్రావిన్సులలో నెగ్గుకురాలేని పాకిస్థాన్ పాలకులు అఫ్ఘానిస్థాన్, ఇండియాలను ఆడిపోసుకుంటూ, అంతర్జాతీయ వేదికలమీద అర్థంలేని ఆరోపణలు చేస్తూ, అంతిమంగా తమ ప్రజలను తామే చంపుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి..
అలాంటివి మాట్లాడుకోలేదు.. నాటో నిర్లక్ష్యాన్ని తప్పుపట్టిన భారత్..
భారత్‌పై సుంకాలు.. రష్యాపై తీవ్ర ప్రభావం: నాటో చీఫ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి