సరిదిద్దుకోవాల్సిన తప్పు
ABN , Publish Date - Feb 25 , 2025 | 03:06 AM
భారత్, నేపాల్ సంబంధాలు సవ్యంగా లేని కాలంలో, ఒడిశాలోని కళింగ వర్సిటీలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన రెండు దేశాల మధ్యా దూరాన్ని మరింత పెంచింది. నేపాలీ విద్యార్థిని ప్రకృతి లామ్సాల్...
భారత్, నేపాల్ సంబంధాలు సవ్యంగా లేని కాలంలో, ఒడిశాలోని కళింగ వర్సిటీలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన రెండు దేశాల మధ్యా దూరాన్ని మరింత పెంచింది. నేపాలీ విద్యార్థిని ప్రకృతి లామ్సాల్ ఆత్మహత్య, న్యాయంకోసం పోరాడిన నేపాలీ విద్యార్థులపై దాడులు, క్యాంపస్ నుంచి గెంటివేత ఇత్యాది వరుస పరిణామాలమీద లోతైన దర్యాప్తు చేపట్టవలసిందిగా ఆ దేశ మానవహక్కుల సంఘం మనదేశంలోని సంస్థను అభ్యర్థించింది. నేపాలీ విద్యార్థులను మాటలతోనూ, చేతలతోనూ భయభ్రాంతులకు గురిచేసి, వారు తమ చదువు కొనసాగించలేని పరిస్థితులను యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అధికారులు సృష్టించారని, వారిమీద కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఆ భయం తొలగిపోదని ఆ సంస్థ సోమవారం విడుదల చేసిన తన లేఖలో వ్యాఖ్యానించింది. శనివారం నాడు ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ నేపాల్ విదేశాంగమంత్రితో ఫోన్‌లో మాట్లాడి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, బాధితులకు అండగా ఉంటామని చాలా హామీలు ఇచ్చారు. వాళ్ళు కూడా మా పిల్లలే, భద్రమైనవాతావరణంలో చక్కగా చదువుకొనేట్టు చేసే బాధ్యత నాది అంటూ భరోసా ఇచ్చారు. తనను కలిసిన నేపాల్ రాయబార కార్యాలయం అధికారుల్లో కూడా నమ్మకం పెంచే ప్రయత్నాలు చేశారు ఆయన. ఇదంతా బాగానే ఉన్నది కానీ, రాష్ట్ర రాజధాని నగరం భువనేశ్వర్‌లోని ఒక పెద్ద యూనివర్సిటీలో వెయ్యిమంది విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారని, వారిని యాజమాన్యం పక్షాన రంగంలోకి దిగిన ఓ నలభైయాభైమంది చావగొట్టారని, అంతా కలిసి ఈ నేపాలీ విద్యార్థులను క్యాంపస్‌నుంచి బయటకు గెంటేశారని ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు సమాచారం తెలియకుండా ఉంటుందా?
నేపాలీ విద్యార్థిని ఆత్మహత్యకు మరో విద్యార్థి కారకుడు కానీ, అనంతర పరిణామాలకు ఆ యూనివర్సిటీ యాజమాన్యం, ప్రొఫెసర్లు కారకులు. వారి బాధ్యతారహితమైన వ్యవహారశైలి, సామరస్యపూర్వకమైన పరిష్కారం మీద గౌరవం లేకపోవడం, పొరుగుదేశం పిల్లలమీద చిన్నచూపు ఇత్యాదివి ఈ చిచ్చురాజుకోవడానికి కారణం. తోటి నేపాలీ ఆత్మహత్య చేసుకున్నందున విద్యార్థులను ఆగ్రహావేశాలు కమ్ముకోవడం సహజం. కారకుడైన విద్యార్థిని అరెస్టుచేయాలనో, శిక్షించాలనో డిమాండ్ చేయడమూ సరైనదే. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు, విద్యార్థుల ప్రతిస్పందన, ప్రవర్తన అనూహ్యంగానే ఉంటాయి. నేపాలీ విద్యార్థులు యూనివర్సిటీ ఆస్తులనేమీ ధ్వంసం చేయలేదు, ఎవరిమీదా దాడులూ చేయలేదు. బాధితురాలికి మరణానంతర న్యాయం జరగాలని నిలదీస్తున్న మన పొరుగుదేశ విద్యార్థుల మీద అంత తీవ్రంగా విరుచుకుపడటం అన్యాయం. యువతి మృతి ఒక సమస్య అయితే, విద్యార్థులను ఉన్నపళంగా స్వదేశానికి తరిమేయడం దౌత్యపరంగా మరింత తీవ్రసమస్యను సృష్టించింది. నేపాల్ ప్రధాని పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించే అవకాశం మనమే అందించాం.
ఈ కమిటీలు, అరెస్టులు, సస్పెన్షన్లు ఇత్యాదివన్నీ జరిగిన నష్టాన్ని కొద్దిమేరకు భర్తీచేయడానికి ఉపకరిస్తాయేమో కానీ, నేపాల్ విద్యార్థులకు భారత్‌లో జరిగిన అన్యాయం, ఈ సందర్భంగా నేపాల్‌ను అవమానిస్తూ కొందరు ప్రొఫెసర్లు చేసిన వ్యాఖ్యలు ఆ దేశ ప్రజల మనస్సుల్లోంచి త్వరగా చెరిగిపోవు. పరిణామాలను పూర్తిగా యూనివర్సిటీ దయాదాక్షిణ్యాలకు వదిలేయకుండా అలజడి ఆరంభం కాగానే రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగకపోవడం పెద్ద తప్పు. ఇప్పుడది దౌత్యసమస్యగా పరిణమించడంతో నేపాల్‌ను అవమానించడం తమ ఉద్దేశం కాదనీ, విద్యార్థులంతా వెనక్కురావాలని యూనివర్సిటీ కోరుతోంది. సీనియర్ విద్యార్థిపై ప్రకృతి లమ్సాల్ చేసిన ఫిర్యాదులను పెడచెవినపెట్టి, ఆమె మరణానికి కారకులైనవారే ఆమె పేరిట ఒక అవార్డును కూడా ప్రకటించారు. కానీ, వందలాది మందిని సస్పెండ్ చేసి, దాడులతో వారిని భయభ్రాంతులను చేసిన నేపథ్యంలో, విద్యార్థుల విశ్వాసాన్ని చూరగొనడం అంత సులభం కాదు. నేపాల్ మీడియాలో మాస్కులు పెట్టుకొని ఈ సంఘటనపై విద్యార్థులు మాట్లాడుతున్న విడియోలు ప్రచారంలో ఉన్నాయి. విద్యార్థుల్లో భరోసా కల్పించే ప్రకటనలు, చర్యలతో కేంద్ర ప్రభుత్వం జరిగిన తప్పిదాన్ని సరిదిద్దాలి. డబుల్ ఇంజన్ సర్కార్ అయినంత మాత్రాన దానికే వదిలేయకూడదు.
ఇవి కూడా చదవండి..
Pratyekam : ఒంటరి తల్లులకు పెరుగుతున్న కష్టాలు.. ఆడవారిగా పుట్టడమే పాపమా..
ఇది గుడిసె అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. లోపలికి వెళ్లి చూస్తే నివ్వెరపోవాల్సిందే..
Kulu Manali Trip : రూ.15వేల ఖర్చుతోనే.. జంటగా మనాలీ చుట్టేయండి ఇలా..
మరిన్ని ప్రత్యేక , తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..