Public Private Partnership in Medical Education: వైద్యానికి శస్త్రచికిత్స
ABN , Publish Date - Oct 12 , 2025 | 03:04 AM
కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల వ్యవహారాన్ని ప్రతిపక్షం అందిపుచ్చుకుంది. తాము ప్రభుత్వపరంగా వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతులు తెస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని...
కోతికి కొబ్బరికాయ దొరికినట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో వైద్య కళాశాలల వ్యవహారాన్ని ప్రతిపక్షం అందిపుచ్చుకుంది. తాము ప్రభుత్వపరంగా వైద్య కళాశాలల ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతులు తెస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యం పేరిట ప్రైవేటుపరం చేస్తోందని వైసీపీ కొన్ని రోజులుగా హడావిడి చేస్తోంది. పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారని విమర్శల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వం కూడా ఈ విషయంలో కొంత తొందరపాటు ప్రదర్శించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుకావలసిన వైద్య కళాశాలలను ప్రభుత్వ, ప్రైవేటు మోడల్‌లో నిర్మించాలన్న నిర్ణయం తీసుకునే ముందు అందుకు కారణాలను సహేతుకంగా వివరించకుండా హడావిడిగా నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపక్షం చేతికి అస్త్రం లభించింది. ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయం సరైనదా? కాదా? అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. వైద్య కళాశాలల అవసరం ఏ మేరకు ఉంది? ఇబ్బడిముబ్బడిగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేసుకుంటూ పోతే ఫ్యాకల్టీ పరిస్థితి ఏమిటి? వైద్య విద్యను బోధించే సిబ్బందిని సమకూర్చుకోకుండా కళాశాలలను ఏర్పాటు చేయడం సమర్థనీయమా? సంక్షేమం పేరిట బడ్జెట్‌లో సింహభాగం ఖర్చు చేస్తున్న ఈ రోజుల్లో ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి, నిర్వహించడం సాధ్యమా? ఉభయ తెలుగు రాష్ర్టాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో పలు కళాశాలలు ఉన్నప్పటికీ ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలల్లోనే చేరడానికి విద్యార్థులు ఎందుకు పోటీ పడుతున్నారు? వంటి ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించాలి. విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వాలు భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రజలు ప్రైవేటు రంగం వైపే ఎందుకు ఆకర్షితులవుతున్నారన్నది కూడా కీలక ప్రశ్నగా ఉంది. కాలమాన పరిస్థితులను బట్టి ఆలోచనలు, విధానాలు మారుతుంటాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ప్రభుత్వ రంగమే దిక్కుగా ఉండేది. అందుబాటులో ఉన్న పరిమిత వనరులతోనే దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ పలు ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారు. విద్యాసంస్థలను నెలకొల్పారు. ప్రభుత్వం వద్ద ఉన్న నిధులతోనే నీటి ప్రాజెక్టులను కూడా దశలవారీగా నిర్మించారు. పంచవర్ష ప్రణాళికలను రచించుకొని అమలు చేశారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ కూడా దాదాపుగా ఇవే విధానాలను కొనసాగిస్తూ సంక్షేమంపై కూడా దృష్టి పెట్టారు.
రాజభరణాలు రద్దు చేయడంతో పాటు ప్రైవేటు రంగంలో ఉన్న బ్యాంకులను జాతీయం చేశారు. ఇందిరాగాంధీ తదనంతరం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారాయి. రక్షిత ఆర్థిక వ్యవస్థకు, ప్రభుత్వ రంగం అన్న వాదనకు కాలం చెల్లింది. పోటీతత్వం పెరగడంతో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు బ్యాంకులను జాతీయం చేయగా, ఇప్పుడు ప్రైవేటు బ్యాంకులను ప్రోత్సహించే పరిస్థితి! అదే సమయంలో ప్రభుత్వ రంగంలో జవాబుదారీతనం లోపించింది. నెహ్రూ హయాంలో హైదరాబాద్‌లోని బాలానగర్ వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసూటికల్స్ సంస్థ (ఐడీపీఎల్) ఏర్పాటైంది. ప్రస్తుత ఫార్మా దిగ్గజాలైన మురళి, డాక్టర్ అంజిరెడ్డి, పార్థసారధి రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి వంటి వారందరూ అందులో పనిచేసినవారే. ఐడీపీఎల్‌లో తమ పరిస్థితి ఎదుగూబొదుగూ లేకుండా ఉండటంతో అందులో పనిచేసిన పలువురు బయటకు వచ్చి సొంతంగా ఫార్మా కంపెనీలను ప్రారంభించి ఇవాళ కుబేరుల జాబితాలో చేరారు. ఐడీపీఎల్ మాత్రం చాలాకాలం క్రితమే మూతపడింది. ప్రభుత్వ రంగం అని పట్టుకొని వేళాడితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పేందుకు ఈ సంస్థే నిదర్శనం. టెలికమ్యూనికేషన్ రంగాన్నే తీసుకుందాం. ఒకప్పుడు బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రమే ఉండేది. అప్పుడు టెలిఫోన్ కనెక్షన్ కోసం నెలలు, సంవత్సరాలు వేచి చూడవలసి వచ్చేది. ఈ రంగంలోకి ప్రైవేటు సంస్థలు ప్రవేశించడంతో పరిస్థితిలో ఎంత వేగవంతమైన మార్పు వచ్చిందో చూస్తున్నాం. ఫోన్ కనెక్షన్ల కోసం మన చుట్టూ తిరుగుతున్నారు. ఏ రంగంలోనైనా మార్పునకు శ్రీకారం చుట్టినప్పుడు వ్యతిరేకత రావడం సహజం. మార్పు వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తే అర్థం చేసుకుంటారు. టెలికమ్యూనికేషన్ రంగాన్ని ప్రైవేటుపరం చేసినప్పుడు కమ్యూనిస్టు పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ రంగంలో బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రమే ఉండాలని పట్టుబట్టాయి. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే నాటి మార్పును వ్యతిరేకించిన కమ్యూనిస్టు పార్టీలే దేశంలో బలహీనపడ్డాయి. ప్రైవేటు రంగంలోని టెలికాం కంపెనీలు దూసుకుపోతున్నాయి. ప్రజలకు కూడా సౌకర్యాలు మెరుగయ్యాయి. గుత్తాధిపత్యానికి తావు లేకుండా చేయగలిగితే పోటీతత్వం వల్ల ప్రజలకు మేలే జరుగుతుంది. విద్యా రంగంలో కూడా పోటీతత్వం పెరిగింది. తమ పిల్లలను పేరొందిన ప్రైవేటు విద్యా సంస్థల్లో చేర్చడానికే ప్రజలు ఉత్సుకత చూపిస్తున్నారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు బడుగు బలహీన వర్గాల పిల్లలకే పరిమితం అవుతున్నాయి. నిజానికి ప్రైవేటు రంగంలోని పాఠశాలల్లో ఇరుకు గదుల్లో చదువు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలకు విశాలమైన క్రీడా మైదానాలు కూడా ఉంటాయి. అధిక జీతాలతో ఉపాధ్యాయులను నియమిస్తున్నారు. అయినా ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం లేకపోవడానికి కారణం ఏమిటి? ప్రభుత్వ రంగంలో జవాబుదారీతనం లోపించడం ప్రధాన కారణం. విద్య, వైద్య రంగాలపై వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ ప్రజల్లో విశ్వాసం కలగడం లేదు. అరకొర సౌకర్యాలే ఉన్నప్పటికీ ప్రైవేటు సంస్థల వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ప్రభుత్వ రంగాన్ని ప్రోత్సహించడమే సరైన నిర్ణయం. మారిన పరిస్థితులలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించవలసి వచ్చింది. ఇప్పటి పరిస్థితులకు పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యమే సరైనది. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ పేరిట నెహ్రూ హయాంలో ఏర్పాటైన ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలను విక్రయిస్తున్నది. దీన్ని విమర్శించే వారు ఉన్నప్పటికీ ప్రజలు పట్టించుకోవడం లేదు. ఈ నిర్ణయం ప్రభావం రాజకీయాలపై కూడా కనబడటం లేదు.
కాలంతో మారాల్సిందే!
మెరుగైన విద్య, వైద్యం ఇతర సౌకర్యాల కోసం శక్తికి మించి అప్పులు చేసి అయినా ఖర్చు చేయడానికి ప్రజలు కూడా సిద్ధపడుతున్నారు. ప్రపంచీకరణ కారణంగా పోటీతత్వం పెరిగింది. ప్రభుత్వ రంగమైనా, ప్రైవేటు రంగమైనా పోటీ పడక తప్పని పరిస్థితి. పోటీ పడలేని ప్రైవేటు సంస్థలు కూడా కనుమరుగవుతున్నాయి. బూజు పట్టిన సిద్ధాంతాలు, కాలం చెల్లిన విధానాలకు ఇప్పుడు చోటు లేదు. విద్య, వైద్య రంగాలలో కూడా ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు రంగంతో పోటీ పడాల్సిందే. విశ్వవిద్యాలయాలనే తీసుకుందాం. ఒకప్పుడు ఉస్మానియా, ఆంధ్రా యూనివర్సిటీలకు ఎంతో పేరుండేది. కాలక్రమేణా అవి తమ ప్రతిష్ఠను కోల్పోయాయి. ప్రైవేటు రంగంలో ఏర్పాటైన యూనివర్సిటీలతో పోటీ పడలేక సతమతమవుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో పలు ప్రైవేటు ఆస్పత్రులను విజయవంతంగా నిర్వహిస్తున్న డాక్టర్లు ఒకప్పుడు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నిమ్స్‌లో పనిచేసినవారే. అక్కడ తమకు ఎదుగూబొదుగూ ఉండదని భావించి బయటకు వెళ్లిపోయి సొంత ఆస్పత్రులు ఏర్పాటుచేసుకున్నారు. ఉభయ తెలుగు రాష్ర్టాలలో పేరొందిన పలు ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నాయి. ఒకప్పుడు ప్రజలకు అవే దిక్కుగా ఉండేవి. ప్రజలకు కూడా వాటిపై విశ్వాసం ఉండేది. కాలక్రమంలో ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం పోతూ వచ్చింది. ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానాకు..’ అని సినిమా పాటలు కూడా వచ్చాయి అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పేదలు కూడా తమ శక్తికి మించినదైనా ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. అలా అని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంచి వైద్యులు ఉండటం లేదా? సౌకర్యాలు సరిగా లేవా? అంటే అదేమీ కాదు. సిబ్బందిలో జవాబుదారీతనం లోపించడమే ప్రధాన కారణం. అరకొర సౌకర్యాలు ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు కూడా బాగానే నడుస్తున్నాయి. అన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఆస్పత్రులు ప్రజల్లో విశ్వాసం ఎందుకు కల్పించలేకపోతున్నాయో ఆత్మపరిశీలన అవసరం. వైద్య విద్య విషయమే తీసుకుందాం. తెలుగునాట ఇటీవలి కాలంలో ప్రైవేటు రంగంలో పలు వైద్య కళాశాలలు ఏర్పాటయ్యాయి. ఇందులో కొన్ని గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటయ్యాయి. అయితే మిగతా రంగాలలో వలె కాకుండా వైద్య రంగంలో ప్రైవేటు వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోని కళాశాలలతో పోటీ పడలేకపోతున్నాయి.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని ప్రైవేటు కళాశాలలలో చేరడానికి వైద్య విద్యార్థులు ఇష్టపడటం లేదు. ఇందుకు ప్రధాన కారణం ఆయా కళాశాలల్లో ఫ్యాకల్టీ సరిగా లేకపోవడమే. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన వైద్య కళాశాలలు అన్నీ ప్రధాన పట్టణాలు, నగరాలలోనే ఉన్నాయి. ఈ కారణంగా ఆ కళాశాలలకు ఫ్యాకల్టీ ఇబ్బంది రాలేదు. ఆస్పత్రులైనా, కళాశాలలైనా నిపుణులైన ఫ్యాకల్టీ ఉన్నప్పుడే వాటిపై ప్రజలకు నమ్మకం కలుగుతుంది. పేరొందిన డాక్టర్లతోనే వైద్యం చేయించుకోవాలని ఎవరైనా కోరుకుంటారు. అలానే సరైన ఫ్యాకల్టీ ఉన్న వైద్య కళాశాలల్లో చేరడానికే విద్యార్థులు ఆసక్తి చూపుతారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన ఫీజుల చెల్లింపు పథకం ఫలితంగా ఇంజనీరింగ్ కళాశాలలు పుట్టగొడుగుల్లా ఏర్పడ్డాయి. ఫలితంగా రెండు రకాలుగా నష్టం జరిగింది. ఇంజనీరింగ్ విద్య నాణ్యత దెబ్బతింది. ఆయా కళాశాలలు మూతపడ్డాయి. సరైన బోధనా సిబ్బంది లేనప్పుడు ప్రైవేటు కళాశాల అయినా పిల్లలు ఎందుకు చేరతారు? నాణ్యతలేని ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన వేలు, లక్షల మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు నిరుద్యోగులుగా మన కళ్ల ముందే కనిపిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యతో పోలిస్తే వైద్య విద్యలో ఫ్యాకల్టీ ప్రాధాన్యం అధికంగా ఉంటుంది. వైద్య విద్యలో నిష్ణాతులైన వారు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి బోధించడానికి ఇష్టపడటం లేదు. ఫలితంగా ప్రైవేటు వైద్య కళాశాలలు కూడా మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. నీట్ పరీక్షలో అర్హత పొందినవారు తమ ప్రథమ ప్రాధాన్యంగా ఉస్మానియా, గాంధీ వైద్య కళాశాలలనే ఎంచుకుంటున్నారు. మిగతా ప్రభుత్వ కళాశాలలను ఎందుకు ప్రాధాన్యంగా ఎంచుకోవడం లేదంటే కారణం ఉంది. ఏ వైద్య కళాశాలపైన అయినా విద్యార్థులకు నమ్మకం ఏర్పడాలంటే ఫ్యాకల్టీతో పాటు రోగుల తాకిడి కూడా ఉండాలి. రోగుల సంఖ్య అధికంగా ఉన్నప్పుడే కదా విద్యార్థులు నేర్చుకోగలిగేది. మిగతా రంగాలతో పోల్చితే వైద్య రంగం భిన్నమైనది. వైద్య రంగంలో ప్రైవేటు రంగమే సూపర్ అని చెప్పలేని పరిస్థితి. ప్రైవేటు వైద్య కళాశాలలు వెలవెలబోతుండటం తెలిసిందే. ప్రైవేటు ఆస్పత్రులలో రోగులను ఫీజుల పేరుతో వేధిస్తున్నారన్న అభిప్రాయం ఉండనే ఉంది. అలా అని అన్ని ప్రభుత్వ కళాశాలలు, ఆస్పత్రులు గొప్పగా ఉన్నాయా అంటే అదీ లేదు. ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ పథకాల అమలుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా వందలు, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఈ పథకం కింద వైద్యం చేయించుకుంటున్నవారు ప్రైవేటు ఆస్పత్రులకే వెళుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో తగిన సౌకర్యాలు, వైద్యం అందుబాటులో ఉన్నప్పటికీ రోగులు వెళ్లడం లేదు. ఈ కారణంగా ఈ నిధులు ప్రభుత్వ ఆస్పత్రులకు దక్కడం లేదు.

ఏ విధానం గొప్ప?
ప్రపంచ దేశాలలో మెరుగైన వైద్య విధానం ఏ దేశంలో ఉంది? అని ఒక సందర్భంలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డిని నేను అడిగాను. ‘‘ఫలానా దేశం అనుసరిస్తున్న విధానం సరైనదని చెప్పలేం. ఒక్కో దేశంలో ఒక్కో లోపం ఉంది’’ అని ఆయన బదులిచ్చారు. ఈ నేపథ్యంలో మనం ఎటువంటి విధానాన్ని ఎంచుకోవాలి? అన్న దానిపై దృష్టి పెట్టాలి కదా! ప్రజలందరికీ ఉచిత వైద్య విద్య, వైద్యం అనే విధానాన్ని అమలుచేసే పరిస్థితిలో మన ప్రభుత్వాలు లేవు. అలాగని పేద ప్రజలను గాలికి వదిలేయలేం కదా? ఈ నేపథ్యంలో మధ్యే మార్గంగా ఏదో ఒక విధానాన్ని రూపొందించుకోవాలి కదా? దేశంతో పాటు తెలుగునాట కూడా వైద్యుల కొరత ఉంది. ఈ కొరతను అధిగమించాలంటే మంచి వైద్యులను తయారుచేసే వైద్య కళాశాలలను ఏర్పాటు చేయవలసిందే. అయితే అవసరం మేరకు వైద్య కళాశాలలు నెలకొల్పి వాటిని నిర్వహించే స్థోమత ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలకు లేదు. ఈ కారణంగానే జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వపరంగా 17 కళాశాలలను ఏర్పాటు చేయడానికి అనుమతులు పొందినా ఆయా కళాశాలల నిర్మాణాలను కూడా పూర్తిచేయలేకపోయారు. కొన్ని కళాశాలల భవనాల నిర్మాణం పునాదుల స్థాయిలోనే ఆగిపోయింది. ఒకవేళ నిర్మాణాలు పూర్తయినా వాటి నిర్వహణ భారాన్ని ప్రభుత్వాలు భరించగలవా? ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్లను అరికట్టడానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధ్యాహ్న భోజన పథకం తీసుకువచ్చారు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాలలోనూ మధ్యాహ్న భోజన ఖర్చును సకాలంలో చెల్లించడం లేదు. ఫలితంగా నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందడం లేదు. వైద్య కళాశాలలను కూడా సరిగా నిర్వహించలేకపోతే అక్కడ విద్యను అభ్యసించే వైద్య విద్యార్థుల పరిస్థితి ఏమిటి? నాసిరకం వైద్యులను తయారుచేయడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే కదా? పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం అంటే వైద్యాన్ని, వైద్య విద్యను పేదలకు దూరం చేయడమే అని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు విమర్శించవచ్చు గానీ అందులో వాస్తవం లేదు. వైద్య కళాశాలలకు అనుబంధంగా ఏర్పాటు చేసే ఆస్పత్రులలో ఎంత ఎక్కువ మంది రోగులకు వైద్యం చేస్తే అక్కడ చదువుకునే మెడికోలకు అంత మంచి విద్యను అందించడమే అవుతుంది. ఇకపై వైద్య కళాశాలల్లో పేదలకు చదువుకునే అవకాశం లభించదని విమర్శించడంలో కూడా హేతుబద్ధత లేదు. కన్వీనర్ కోటా కింద సీటు పొందినవారు నామమాత్రపు ఫీజులనే చెల్లిస్తారు. వైద్య విద్యపై ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు లక్షలు ఖర్చు చేయాలి. ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కనుక ఇకపై కేవలం ప్రభుత్వమే కళాశాలలను ఏర్పాటు చేయాలి అని నినదించడంలో అర్థం లేదు. అదే సమయంలో డబ్బున్న వారి వద్ద నుంచి అధిక ఫీజులు వసూలు చేసి నామమాత్రపు ఫీజుల భారాన్ని తగ్గించుకోవచ్చు. క్రాస్ సబ్సిడీ విధానం ఎల్లెడలా ఉన్నదే కదా! అందుకే ప్రభుత్వం వద్ద డబ్బు లేనప్పుడు పబ్లిక్– ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తే తప్పేమిటి? అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ప్రశ్నించింది.
సంక్షేమం పేరిట హద్దులు మీరి ఖర్చులు చేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో అన్నీ ప్రభుత్వమే నడపాలనుకోవడంలో అర్థం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైద్య విద్యను కాపాడుకోవాలన్నా, పేదలకు వైద్యం దూరం కాకూడదు అనుకున్నా ప్రభుత్వంతో ప్రైవేటు వ్యక్తులు చేతులు కలపక తప్పని పరిస్థితి. అదే సమయంలో వైద్య కళాశాలలను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నామన్నది కూడా ముఖ్యం. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాడేరులో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఏజెన్సీ ఏరియాలోని ఆస్పత్రుల్లో పనిచేయడానికి వైద్యులు ఇష్టపడరు. అలాంటిది ఏజెన్సీ ఏరియాలో వైద్య కళాశాల ఏర్పాటు చేస్తే అక్కడ వైద్య విద్యను ఎవరు బోధించాలి? తెలంగాణలో ఏర్పాటైన ప్రైవేటు వైద్య కళాశాలల్లో కూడా హైదరాబాద్‌లో ఏర్పాటైనవే బాగా నడుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటైన వాటిలో సరైన బోధనా సిబ్బంది ఉండటం లేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం రెండు అంశాలపై దృష్టి సారించాలి. పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలి. అదే సమయంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న కళాశాలలను రాజకీయ కోణంలో చూడకుండా ప్రధాన నగరాల్లోనే ఏర్పాటు చేయాలి. అలా చేసినప్పుడే బోధనా సిబ్బంది లభిస్తారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసే ప్రముఖ డాక్టర్లు కూడా విధిగా విద్యా బోధనకు కొంత సమయం కేటాయించాలన్న నిబంధనను కూడా అమలు చేయాలి. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణపై కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ఫలానా అధికారి భార్య ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవించారు.. ఫలానా నాయకుడు ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స చేయించుకున్నారు అని అప్పుడప్పుడూ గొప్పలు చెప్పుకొనే విధానం పోవాలి. కార్పొరేట్ ఆస్పత్రులను మినహాయిస్తే, మిగతా ప్రైవేటు ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆస్పత్రులకు మెరుగైన భవనాలు, వసతులు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. లేనిదల్లా వాటిపై ప్రజల్లో నమ్మకం. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం ఏర్పడాలంటే జవాబుదారీతనం తీసుకురావలసిందే. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో యూజర్ చార్జీలు వసూలు చేయాలని సంకల్పించగా తీవ్ర వ్యతిరేకత వచ్చింది.
ఇప్పుడు పరిస్థితులు మారాయి. క్రాస్ సబ్సిడీ విధానం అమలు చేయగలిగితే పేదలకు ఉచితంగా వైద్యం చేయడంతో పాటు డబ్బున్న వారికి మెరుగైన సదుపాయాలు కల్పించవచ్చు. ఇందుకోసం ఎంపిక చేసుకున్న ప్రధాన ఆస్పత్రుల్లోనైనా పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్య విధానం ప్రవేశపెట్టవచ్చు. ఈ విధానాన్ని కొంతకాలంపాటు గమనించి, ఫలితాలు బాగుంటే మరిన్ని ఆస్పత్రులకు విస్తరించవచ్చు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రైవేటు వార్డులు, గదులు ఉంటే తప్పేమిటి? పీపీపీ విధానంలో పేరొందిన డాక్టర్లకు ఆ ఆస్పత్రుల నిర్వహణ అప్పగించవచ్చు. తమ స్వార్థం కోసమైనా వారు కష్టపడతారు. శస్త్రచికిత్సల్లో నిపుణులను రప్పించి డబ్బు చెల్లించిన వారితో పాటు పేదలకు కూడా వారి సేవలను అందించవచ్చు. ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ కింద ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్న నిధులు కూడా ప్రభుత్వ ఆస్పత్రులకే దక్కుతాయి. ఫలితంగా వాటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. నిపుణులైన వైద్యులకు ఫీజు చెల్లించి ప్రభుత్వ ఆస్పత్రులకు రప్పించవచ్చు. పలువురు వైద్య నిపుణులు ప్రైవేటు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. అలాంటి వారికి సొంత ఆస్పత్రులు లేవు. వారికి ప్రభుత్వ ఆస్పత్రులు వేదిక అవుతాయి.
ఈ అంశంపై ప్రభుత్వం దృష్టిసారిస్తే పటిష్ఠమైన విధానం ఆవిష్కృతం కావచ్చు. పేదలకు ఉచిత వైద్యాన్ని నిరాకరించకుండా ప్రభుత్వ ధనంతో ఏర్పాటైన భవనాలు, సౌకర్యాలను ఉపయోగించి స్థోమత ఉన్న వారి వద్ద ఫీజులు వసూలు చేయడం తప్పిదం కాదు కదా? అంతిమంగా ప్రజలు కోరుకొనేది నాణ్యమైన విద్య. పేదలకు కావల్సింది ఉచిత వైద్యం. ఈ రెండూ ఏక కాలంలో లభించినప్పుడు ఎవరికైనా అభ్యంతరాలు ఎందుకుండాలి? వైద్య రంగంలో ప్రభుత్వం మాత్రమే ఉండాలనే విధానం ఫెయిల్ అయింది. ప్రైవేటు రంగం కూడా పేదలకు భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో మధ్యస్థంగా ఉండే పబ్లిక్–ప్రైవేటు భాగస్వామ్యమే పరిష్కార మార్గం కావొచ్చు. దీన్ని ఒక ప్రయోగంగా అమలు చేయడంలో తప్పు లేదు. ఏ విధానంలో అయినా చెక్స్ అండ్ బేలెన్సెస్ ఉండాలి. ప్రైవేటు వైద్య రంగానికి చెక్ పెట్టడానికైనా ఈ పీపీపీ విధానం దోహదపడవచ్చు. రాజకీయ పార్టీలు హిపోక్రసీతో సతమతం అవుతున్నాయి. అందుకే అన్నీ ఉచితం అంటాయి. ప్రభుత్వాల వద్ద డబ్బు లేనప్పుడు ఉచితం ఎలా? పరిస్థితుల్లో మార్పు లేకపోతే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కూడా లేకుండా పోతాయి. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడే ప్రజలకు మేలు చేసినవారవుతారు. రోగులకు ఇచ్చే మందులు తియ్యగా ఉండవు కదా? అలాగే మార్పునకు శ్రీకారం చుట్టినప్పుడు ఎంతో కొంత వ్యతిరేకత వస్తుంది. విమర్శలు కూడా వస్తాయి. ప్రభుత్వ ఉద్దేశాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి నూతన విధానం ఫలితాలను వీలైనంత త్వరగా చూపించగలిగితే మార్పును ప్రజలు కూడా ఆహ్వానిస్తారు. అయితే ప్రభుత్వాలకు సంకల్ప బలం ఉండాలి!
ఆర్కే
ఇవి కూడా చదవండి:
Prashant Kishore: రాహుల్ తరహాలోనే తేజస్వి ఓడిపోతారు.. ప్రశాంత్ కిశోర్ జోస్యం
Mamata Banerjee: బెంగాల్ సీఈఓకు మమతా బెదిరింపులు.. ఈసీ సీరియస్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి