Share News

Nara Bhuvaneshwari: మానవతావాదికి మహోన్నత పురస్కారం

ABN , Publish Date - Oct 16 , 2025 | 03:30 AM

మానవతా మార్గంలో నడుస్తూ, ఎన్‌టీఆర్‌ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలతో వేలాదిమంది జీవితాల్లో వెలుగు నింపుతున్న నారా భువనేశ్వరి తన స్వచ్ఛంద సమాజ సేవకు గుర్తింపుగా ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) సంస్థ ప్రకటించిన ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025’కు...

Nara Bhuvaneshwari: మానవతావాదికి మహోన్నత పురస్కారం

మానవతా మార్గంలో నడుస్తూ, ఎన్‌టీఆర్‌ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలతో వేలాదిమంది జీవితాల్లో వెలుగు నింపుతున్న నారా భువనేశ్వరి తన స్వచ్ఛంద సమాజ సేవకు గుర్తింపుగా ఇన్‍స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (IOD) సంస్థ ప్రకటించిన ‘డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డు 2025’కు ఎంపిక కావడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. ఈ అరుదైన గౌరవాన్ని వారు నవంబర్ 4, 2025న బ్రిటన్ రాజధాని లండన్‌లో జరిగే గ్లోబల్ కన్వెన్షన్‌లో అందుకోబోతున్నారు. ఈ విశిష్టమైన అవార్డును గతంలో భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, హిందూజా గ్రూప్ కో–చైర్మన్ గోపీచంద్ హిందూజా, ఆదిత్య బిర్లా సెంటర్ చైర్‌పర్సన్ రాజశ్రీ బిర్లా వంటి ప్రముఖులు అందుకున్నారు. ఈ ప్రపంచ ప్రఖ్యాత సంస్థ నేడు అంతటి గౌరవాన్ని భువనేశ్వరి గారికి ప్రదానం చేయడం భారతదేశ మహిళలకూ గర్వకారణం.

భువనేశ్వరి గారు మేనేజింగ్ ట్రస్టీగా ఉన్నప్పటి నుంచి ఎన్‌టీఆర్‌ ట్రస్ట్‌ పేద ప్రజల హృదయాల్లో ఆశాకిరణంగా నిలిచిపోయింది. వారి ప్రతి సేవా, సామాజిక కార్యక్రమమూ ఒక కుటుంబాన్ని, ఒక గ్రామాన్ని, ఒక జీవితాన్ని మార్చగల శక్తిగా నిలుస్తున్నది. సమాజంలో మానవత్వం మరుగునపడి నిలువెల్లా స్వార్థం పెరిగిన వేళ సమాజ శ్రేయస్సు కోసం నిస్వార్థ, స్వచ్ఛంద సేవలను అందిస్తూ ఎన్‌టీఆర్‌ ట్రస్ట్ ఆదర్శంగా నిలుస్తున్నది. ట్రస్ట్‌ ద్వారా భువనేశ్వరి అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు. ఉచిత రక్తదానం, ఉచిత విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, విపత్తు సహాయం, తలసేమియా రోగులకు రక్త సరఫరా వంటి అనేక సేవా కార్యక్రమాలను చేపట్టి ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు.


ఎన్‌టీఆర్‌ ట్రస్ట్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఇప్పటివరకు లక్షలాది మందికి రక్తం అందించి ప్రాణదాతగా నిలిచారు. ఉచిత విద్యా సహాయం ద్వారా, విద్యలో ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను, కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నారు. విద్యార్థుల కెరీర్ దిశగా కోచింగ్, శిక్షణ కార్యక్రమాలు, నాణ్యమైన విద్యను అందించేందుకు ఆధునిక సాంకేతికత కలిగిఉన్న పాఠశాలల ఏర్పాటు ద్వారా వారి భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తున్నారు. తుపాన్లు, వరదలు వంటి సహజ విపత్తుల సమయంలో తక్షణ సహాయాన్ని అందిస్తూ, వందలాది కుటుంబాలకు అండగా నిలుస్తున్న సేవా సైనికురాలు భువనేశ్వరి. ప్రత్యేకంగా తలసేమియా బాధిత చిన్నారుల కోసం నెలకు రెండుసార్లు ఉచితంగా రక్తం అందించడం, 24/7 రక్తం అందుబాటులో ఉండేలా ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేసి వారానికి వందలాది యూనిట్ల రక్తాన్ని ఉచితంగా అందించడం నిరుపమానమైన సేవ. ఈ స్వచ్ఛంద, నిస్వార్థ సేవలకు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కడం వల్ల, ఈ అవార్డు ద్వారా ప్రజాసేవలో ఆమె మరింత ముందుకు వెళ్లేందుకు మంచి ప్రోత్సాహం లభించినట్టయింది.

కరోనా కాలంలో భువనేశ్వరి స్వయంగా ఆహారం, మందులు, ఆక్సిజన్ సిలిండర్లు పంపిణీ చేయించి వేలమందికి జీవం పోశారు. కోవిడ్ వారియర్లకు మద్దతుగా నిలిచారు. రాజకీయ వర్గానికి చెందినప్పటికీ భువనేశ్వరి సేవలకు మాత్రం రాజకీయ పక్షపాతం ఏమీ లేదు. పార్టీలకు అతీతంగా సేవలను అందిస్తూ నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు. భువనేశ్వరి వంటి వ్యక్తులు అరుదుగా వుంటారు. ఆమె సేవలలో ఎక్కడా ప్రదర్శన, ప్రచారం ఉండదు. సంవేదనతో కూడిన నిబద్ధత మాత్రమే ఉంటుంది. బాధితుల కన్నీళ్ళు తుడిచి, వారి ముఖంలో చిరునవ్వుల వెలుగు నింపడమే ఆమె ధ్యేయం. ఆమె ఒక స్ఫూర్తి, ఆమె ఒక ఆదర్శం, ఎన్‌టీఆర్‌ ఆశయమై వెలిగే ఒక దివ్య దీపం. ఆమె చేస్తున్న స్వచ్ఛంద సేవా యజ్ఞం ఇలాగే కొనసాగాలని, పేదల జీవితాల్లో మరిన్ని వెలుగులు నిండాలని కోరుకుందాం.

కలిశెట్టి అప్పలనాయుడు

విజయనగరం పార్లమెంట్ సభ్యులు

ఇవి కూడా చదవండి..

మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. 27 మంది లొంగుబాటు

బెదిరింపులు నాకేం కొత్త కాదులే.. ఆర్‌ఎస్‌ఎస్‌పై ఇక పోరాటమే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 16 , 2025 | 03:30 AM