Indian Constitutional Challenges: అసహనం పరాకాష్ఠకు
ABN , Publish Date - Sep 14 , 2025 | 01:53 AM
‘భారత రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం’ ..నేపాల్ పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చేసిన వ్యాఖ్య ఇది. రాజ్యాంగాన్ని చూసి మాత్రమే కాదు, అంతటి మహోన్నత రాజ్యాంగాన్ని రచించి మనకు అందించిన రాజ్యాంగ నిర్మాతలను...
‘భారత రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నాం’ ..నేపాల్ పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ చేసిన వ్యాఖ్య ఇది. రాజ్యాంగాన్ని చూసి మాత్రమే కాదు, అంతటి మహోన్నత రాజ్యాంగాన్ని రచించి మనకు అందించిన రాజ్యాంగ నిర్మాతలను చూసి కూడా గర్వించాలి కదా? భిన్న మతాలు, భిన్న జాతులతో కూడిన మన దేశం భిన్నత్వంలో ఏకత్వంతో అప్రతిహతంగా సాగిపోవడానికి వారు అందించిన రాజ్యాంగమే ప్రాతిపదిక కదా? రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని పరిరక్షించాల్సిన వ్యవస్థల అధిపతులు మంచివాళ్లు కాకపోతే పరిస్థితి ఏమిటి? శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ పరిణామాల తర్వాత మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందా? అన్న అనుమానం కొందరిలోనైనా ఏర్పడటం ఆందోళన కలిగిస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో రాజ్యాంగం లోపభూయిష్టంగా ఉందని కాదు.. పాలకులు బాధ్యతారహితంగా, రాజ్యం వీరభోజ్యం అన్నట్టుగా వ్యవహరించడం వల్ల అవినీతి, అరాచకాలు పెచ్చరిల్లి ప్రజల్లో అసహనం పరాకాష్ఠకు చేరింది. ఫలితమే ప్రజాగ్రహం పెల్లుబికి పాలకులు దేశం విడిచి పారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దుస్థితి వెనుక అమెరికా హస్తమో లేక మరొకరి హస్తమో ఉందని చెప్పుకోవచ్చు కానీ ప్రభుత్వాల పట్ల ప్రజల్లో అసంతృప్తి గూడుకట్టుకొని ఉండకపోతే తిరుగుబాట్లు చోటుచేసుకోవు. మన పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌తో మన దేశాన్ని ఏ విధంగానూ పోల్చలేము. భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతుల కలబోతగా ఉన్న మన దేశంలో ప్రభుత్వాలపై ఈ రూపంలో తిరుగుబాట్లు అసాధ్యం. అలా జరగాలని కూడా కోరుకోకూడదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థ అనేక పరీక్షలకు నిలబడి పరిపక్వత చెందింది. ప్రజలు కూడా ఎప్పటికప్పుడు విజ్ఞత ప్రదర్శించి హద్దులు మీరిన పాలకులకు ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ ద్వారా కర్రు కాల్చి వాత పెడుతున్నారు. అయితే ఏ సందర్భంలో కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల తీర్పు ఒకే రకంగా ఉండకపోవడం మన విశిష్టత. ఉదాహరణకు, ఎమర్జెన్సీనే తీసుకుందాం. నాటి ప్రధాని ఇందిరాగాంధీ తన అధికారానికి ముప్పు ఏర్పడుతోందని గ్రహించి దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఫలితంగా లభించిన అపరిమిత అధికారాలతో అధికార యంత్రాంగం ప్రజలను హింసించింది. భావ ప్రకటనా స్వేచ్ఛను హరించివేశారు. అయితే ఉత్తరాది రాష్ర్టాలతో పోల్చితే దక్షిణాది రాష్ర్టాలలో ఎమర్జెన్సీ ప్రభావం తక్కువగా ఉండింది. ఈ కారణంగా ఉత్తరాదిలో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీ దక్షిణాదిన కొంత మేరకు నిలదొక్కుకోగలిగింది. అత్యవసర పరిస్థితి నాటి దురాగతాలను కూడా ప్రజలు ఎన్నికల వరకు భరించి బ్యాలెట్ ద్వారా ఇందిరాగాంధీకి గుణపాఠం చెప్పారు. అంతేగానీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయలేదు. 1984లో తెలుగునాట చోటుచేసుకున్న అధికార దుర్వినియోగాన్నే తీసుకుందాం. మెజారిటీ శాసనసభ్యుల మద్దతు కలిగి ఉన్న ఎన్టీఆర్‌ను తొలగించి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా అప్పటి ఉమ్మడి రాష్ట్ర గవర్నర్ రాంలాల్ నియమించారు. ఇది కూడా నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రోద్భలంతోనే జరిగింది. ఎన్నికల్లో గెలుపొంది అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్‌ను అన్యాయంగా, అక్రమంగా తొలగించడాన్ని జీర్ణించుకోలేని తెలుగు ప్రజలు శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు ఆందోళన చేపట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఊపందుకోవడంతో గవర్నర్ రాంలాల్ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఇందిరాగాంధీ దిగివచ్చి ఎన్టీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా నియమించడానికి అంగీకరించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. ఆ కారణంగా జరిగిన ఎన్నికల్లో కూడా తెలుగు ప్రజల ఆగ్రహం చల్లారలేదు.
దేశవ్యాప్తంగా సానుభూతి పవనాలు వీచి కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ లేనంత స్థాయిలో మెజారిటీ లభించి, రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రి అయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో తెలుగునాట మాత్రం ప్రజలు కాంగ్రెస్‌పై తమ కక్ష తీర్చుకున్నారు. అధికార దురహంకారంతో వ్యవహరిస్తూ అవినీతి, అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వాలపై మన ప్రజలు బ్యాలెట్‌ను బుల్లెట్‌లా ప్రయోగించారే గానీ, పొరుగు దేశాల్లో వలె విధ్వంస చర్యలకు పాల్పడలేదు. ఇందుకు మన సమాజాన్ని చూసి మనం గర్వించాలి. అయితే ప్రజలు మాత్రమే ఎల్లవేళలా విజ్ఞత ప్రదర్శించాలనుకోవడం అత్యాశే అవుతుంది. పాలకులపై ఆ బాధ్యత ఉండదా? ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలించాల్సిన బాధ్యత పాలకులపై ఉండదా? ఒక్కసారి అధికారంలోకి వస్తే ఐదేళ్లపాటు విర్రవీగుతూ అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడవచ్చా? అలా చేయడం ప్రజల సహనాన్ని పరీక్షించడం కాదా? రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్న ఆయా వ్యవస్థల అధిపతులపై కూడా బాధ్యత ఉంటుంది కదా? మన రాజ్యాంగ నిర్మాతలు ఆయా రాజ్యాంగ వ్యవస్థల మధ్య సున్నితమైన లక్ష్మణ రేఖలు గీశారు. ఒక వ్యవస్థ అధికార పరిధుల్లోకి మరో వ్యవస్థ చొరబడకుండా సరిహద్దులు నిర్ణయించారు. అయితే రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉన్నవారు బాధ్యతారహితంగా వ్యవహరించిన సందర్భాలలో ఆయా వ్యవస్థల మధ్య ఘర్షణ తలెత్తుతోంది. శాసనసభలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న నాయకుడే ముఖ్యమంత్రిగా నియమితులు కావాలని రాజ్యాంగం అభిప్రాయపడింది. అదే సమయంలో గవర్నర్లు ఎవరినైనా ముఖ్యమంత్రులుగా నియమించవచ్చునని అదే రాజ్యాంగంలో పేర్కొన్నారు. దీని ఉద్దేశం దారినపోయే దానయ్యను ముఖ్యమంత్రిని చేయమని కాదు. ముఖ్యమంత్రిగా నియమితుడయ్యే వ్యక్తి అప్పటికి చట్టసభల్లో సభ్యుడు కాకపోయినా సభలో మెజారిటీ నిరూపించుకొని ఆరు నెలల్లో ఏదో ఒక సభకు ఎన్నిక కావాలని రాజ్యాంగంలో నిర్దేశించారు. సదుద్దేశంతో కల్పించిన ఈ వెసులుబాటును రాంలాల్ వంటి వారు దుర్వినియోగం చేశారు. రాజ్యాంగ నిర్మాతల అభిమతాన్ని తప్పుగా అన్వయించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన సందర్భాలను ఎన్నో చూశాం. రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించిన బిల్లులను ఆమోదించే విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి కాల వ్యవధి ఉండాలా? వద్దా? అన్నది ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానం విచారణ పరిధిలో ఉంది. రాజ్యాంగ నిర్మాతలు సదుద్దేశంతో రాష్ట్రపతి, గవర్నర్లు, న్యాయమూర్తులకు ప్రత్యేక రక్షణలు కల్పించడంతో పాటు విశేష అధికారాలూ కల్పించారు. అలా అని మా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామని వారు భావిస్తే ప్రజల్లో అసహనం ఏర్పడదా? బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం ఏమిటని పాలకులు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ప్రాథమిక బాధ్యత సర్వోన్నత న్యాయస్థానం పైనే ఉంటుంది. పార్లమెంటు ఆమోదించే చట్టాలు సైతం రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా లేవా అని సమీక్షించి నిర్ణయం తీసుకొనే అధికారం సుప్రీంకోర్టుకు ఉంటుంది కదా? శాసనసభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్లు, రాష్ట్రపతి ఆమోదముద్ర వేయకుండా నెలలూ, సంవత్సరాల తరబడి పక్కన పడేస్తే ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వాలు ఏమి చేయాలి? శాసనసభలు ఆమోదించిన బిల్లులు రాజ్యాంగానికి లోబడి లేని పక్షంలో ఆ విషయం చెప్పి తిరస్కరించవచ్చు. కానీ శాశ్వతంగా పెండింగ్‌లో ఉంచడం, అదేమంటే మా అధికారాన్ని ప్రశ్నించి, మాకు గడువు విధించే అధికారం సుప్రీంకోర్టుకు ఎక్కడిది? అని హుంకరించడం సమర్థనీయమా? గవర్నర్లు, రాష్ట్రపతి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి అవాంఛనీయ వివాదాలు తలెత్తవు కదా? మన దేశంలో రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల విశ్వసనీయత కొంతకాలంగా మసకబారుతోంది.

సీఎం, పీఎం ఇష్టమేనా?
ఇక చట్టసభల విషయానికి వద్దాం. అధికార పార్టీ, అంటే దాని అధినేత మనసులో ఏమనుకుంటారో అవే చట్టాలు అవుతున్నాయి. ఆయా బిల్లులపై పార్టీలో గానీ, మంత్రుల స్థాయిలో గానీ చర్చలు జరగవు. ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి మనసులో మాటకు అనుగుణంగా అధికారులు బిల్లులు రూపొందిస్తున్నారు. సదరు బిల్లులను కనీసం చదవకుండానే శాసనసభల్లో, పార్లమెంటులో ఆమోదిస్తున్నారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లో ప్రజల ద్వారా ఎన్నికైన ఒక ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి ఏదైనా కేసులో 3 నెలలకు మించి జైల్లో ఉంటే పదవి కోల్పోవలసి ఉంటుందని లోక్‌సభలో ఇటీవల ఒక బిల్లును ఆమోదించారు. ఈ బిల్లుకు మద్దతు తెలిపిన వారిలో ఎంత మంది ఆ బిల్లును చదివారంటే చెప్పలేని పరిస్థితి. ఒకరకంగా చూస్తే ఈ బిల్లు ఉద్దేశం మంచిదే. అయితే మన దేశంలో అస్మదీయుల విషయంలో ఒకలా, తస్మదీయుల విషయంలో మరోలా చట్టాలు, వ్యవస్థలు పనిచేస్తాయన్న విషయం తెలిసిందే కదా? ప్రస్తుత పరిస్థితులలో ప్రతిపక్షాలకు చెందిన లేదా తస్మదీయ ముఖ్యమంత్రులపై కేంద్ర ఏజెన్సీలతో కేసులు పెట్టించి మూడు నెలలకు పైగా జైల్లో పెట్టడం కష్టమా? న్యాయవ్యవస్థ కూడా బెయిలు మంజూరు విషయంలో ఒక్కో సందర్భంలో ఒక్కోలా వ్యవహరిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ బిల్లు చట్టమైతే అది దుర్వినియోగం కాదన్న గ్యారెంటీ ఏముంది? కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి గిట్టని ముఖ్యమంత్రిని ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకొని తొలగించబోరన్న గ్యారెంటీ ఏముంది? ఇలాంటి సందేహాలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మన దేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. పలువురిపై కేసులు నమోదయ్యాయి. పలువురు ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు బెయిల్‌పై ఉంటున్నారు. కేసులను ఎదుర్కొంటున్న నాయకులు అస్మదీయులు అయితే చట్టాలు వారి చుట్టాలవుతున్నాయి. తస్మదీయులైతే చట్టాలు కాల నాగుల్లా బుసకొడుతూ కాటేస్తున్నాయి.
తెలుగు రాష్ర్టాల విషయానికి వద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బెయిల్‌పై ఉన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై రేపేమాపో కాళేశ్వరం వ్యవహారంపై సీబీఐ విచారణ జరగబోతోంది. ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పుష్కర కాలంగా బెయిల్‌పై ఉన్నారు. అవినీతి కేసులలో బెయిల్‌పై ఉన్న ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు. జగన్‌రెడ్డి కేసు పుణ్యమా అని న్యాయ వ్యవస్థ విశ్వసనీయతపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్లు, రాష్ట్రపతికి గడువు లేకపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్న న్యాయ వ్యవస్థను జగన్మోహన్‌రెడ్డి వంటి వారి విషయంలో తీర్పు ఇవ్వడానికి గడువు లేకపోతే ఎలా? అని ప్రజలు ప్రశ్నించకుండా ఉంటారా? అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధుల కేసులు ఏడాదిలోగా పరిష్కారం కావాలని సర్వోన్నత న్యాయస్థానం పలు సందర్భాలలో స్పష్టంచేసింది. అయినా జగన్‌రెడ్డి కేసులలో పుష్కర కాలం గడచినా విచారణ కూడా పూర్తి కాలేదు. ఈ మధ్యలో ఎందరో ప్రధాన న్యాయమూర్తులు పదవీ విరమణ చేశారు. ఇలాంటి సందర్భాలలోనే కదా వ్యవస్థలపై ప్రజలు విశ్వాసం కోల్పోయేది? తమ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పాదుకోవాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థలోని బాధ్యులపై లేదా? జగన్‌రెడ్డిపై త్వరితగతిన విచారణ జరగకుండా అడ్డుకుంటోంది ఎవరు? ఆయనపై త్వరితగతిన విచారణ పూర్తిచేసి, దోషి లేదా నిర్దోషి అని ప్రకటిస్తే ప్రజలకు అటు న్యాయ వ్యవస్థపైనా, ఇటు పాలక వర్గాలపైనా నమ్మకం పెరుగుతుంది కదా? అతీగతీ లేకుండా పడివున్న ఈ కేసులలో భవిష్యత్తులో విచారణ పూర్తై జగన్‌రెడ్డి దోషిగా తేలితే గతంలో ముఖ్యమంత్రిగా ఆయన చేసిన తప్పు ఒప్పులకు ఎవరు బాధ్యత వహిస్తారు? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసునే తీసుకుందాం. మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేయడమే కాకుండా ఒక దివంగత ముఖ్యమంత్రికి సొంత సోదరుడు, మరో మాజీ ముఖ్యమంత్రికి సొంత బాబాయి అయిన వివేకానందరెడ్డి హత్య కేసుకే దిక్కూమొక్కూ లేకపోతే ప్రజలకు న్యాయ వ్యవస్థపైన, ప్రభుత్వాలపైన నమ్మకం ఎందుకుండాలి? ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పు మాత్రమే పరిష్కారం అని చెబితే మరి ఇన్ని వ్యవస్థలు ఎందుకు? మనం గర్విస్తున్న రాజ్యాంగానికి ఏపాటి విలువ ఇస్తున్నట్టు?
ప్రజలు ఆగ్రహిస్తే అంతే!
శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో ప్రజల తిరుగుబాటుకు రాజ్యాంగం బలహీనంగా ఉండటం కారణం కాదని చెప్పవచ్చు. విదేశీ హస్తం కూడా కారణం కాకపోవచ్చు. ప్రజల్లో అసంతృప్తి, అసహనం గూడుకట్టుకొని ఉండకపోతే ఏ విదేశీ శక్తి కూడా ఏమీ చేయలేదు. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు తన ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడినప్పుడల్లా విదేశీ హస్తం అని నిందించేవారు. నిజానికి నాటి నుంచి నేటి వరకు ఏ విదేశీ శక్తి లేదా హస్తం మన దేశ పురోగతిని అడ్డుకోలేకపోయింది కదా? ప్రభుత్వాలు, వ్యవస్థలలో అవినీతి పెరిగిపోవడం వల్లనే మన దేశం అభివృద్ధి చెందాల్సినంతగా చెందలేదు. రాజ్యాంగబద్ధ సంస్థలలో కూడా అవినీతి చొరబడటం వల్ల సామాన్యులకు న్యాయం దొరకని దుస్థితి ఏర్పడింది. జగన్‌రెడ్డి, వివేకానందరెడ్డి కేసులే అపరిష్కృతంగా ఉన్నాయంటే న్యాయ వ్యవస్థపైన, ప్రభుత్వాలపైన ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది? నేపాల్ ప్రభుత్వం కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను నిషేధించడం వల్ల ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికాయని చెబుతున్నారు గానీ, అంతకు మించిన కారణం ఉండే ఉంటుంది. కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను నిషేధించినంత మాత్రాన మంత్రులపై దాడులు చేయడం, వారి ఇళ్లు ధ్వంసం చేయడం జరిగే పనేనా? ఆ ప్రభుత్వంపై ప్రజల్లో అప్పటికే అసంతృప్తి గూడుకట్టుకొని ఉండి ఉంటుంది. ఆలస్యంగా అందుతున్న సమాచారం ప్రకారం నేపాల్‌కు చెందిన ఒక మంత్రి కారు ఒక మైనర్ బాలికను ఢీకొని ఆపకుండా వెళ్లిపోవడంతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. కారు డ్రైవర్‌ను పట్టుకున్న 24 గంటల్లోనే సదరు డ్రైవర్‌కు బెయిల్ ఇవ్వడం, సదరు సంఘటనను స్వల్పమైనదిగా పేర్కొనడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిలించిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిరాశ, నిస్పృహలతో ఉన్న ప్రజలు సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను నిషేధించడంతో ఆగ్రహావేశాలు కట్టులుతెగి దాడులకు తెగబడ్డారు. చివరికి ప్రభుత్వం కూలిపోయింది. శ్రీలంకలో కూడా ఆ దేశ అధ్యక్షుడి భవనంపై ప్రజలు దాడి చేసి అధ్యక్షుడి బెడ్ రూంలోనూ, స్నానాల తొట్టిలోనూ కూర్చొని ఫొటోలకు పోజులిచ్చారంటే ప్రభుత్వంపై ఎంత విరక్తి చెందారో అర్థం చేసుకోవచ్చు. ఆ తిరుగుబాట్ల తర్వాత శ్రీలంక, బంగ్లాదేశ్‌లో ప్రజల జీవితాలు అమాంతం బాగుపడ్డాయా అంటే లేదనే చెప్పవచ్చు. అయితే అప్పటి తమ కోపానికి కారకులైన పాలకులు దేశం విడిచి పారిపోవడంతో ప్రజలు శాంతించారు. ఇప్పుడు నేపాల్‌లో కూడా ఓలి ప్రభుత్వం రాజీనామా చేయడంతో ప్రజలు మెల్ల మెల్లగా శాంతించారు. ఆ దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తాత్కాలిక ప్రధానిగా నియమించుకుందామని సైన్యం నుంచి ప్రతిపాదన వచ్చినా ఆందోళనకారులు సమర్థించలేదు. అంటే న్యాయ వ్యవస్థపైనా అక్కడి ప్రజలు విశ్వాసం కోల్పోయారని భావించాలి.
ఎట్టకేలకు వివాదం పరిష్కారమైంది. మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కార్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ మూడు దేశాలు మన దేశానికి మిత్ర దేశాలు. కొంతకాలంగా శ్రీలంక, నేపాల్.. చైనాకు సన్నిహితం అవుతున్నాయని వార్తలు వచ్చాయి. ఈ మూడు దేశాలలో చోటుచేసుకున్న ప్రజల ధర్మాగ్రహం నుంచి మన పాలకులు, రాజ్యాంగ వ్యవస్థల అధిపతులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఉన్నాయని కచ్చితంగా చెప్పవచ్చు. మన దేశం భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న భాషల సమాహారం కనుక ఆ చిన్న దేశాలలో వలే తిరుగుబాట్లు చేయరు. అంతమాత్రాన ప్రజలను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు తీసుకోకూడదు. పాలకులు అప్రజాస్వామికంగా, దురహంకారంతో వ్యవహరించారని భావించడంతో 1984లోనే తెలుగునాట ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట సాగిన ఉద్యమం ఒక దశలో హింసాత్మకంగా మారింది. అప్పుడు పోలీసు వ్యవస్థ కూడా ప్రజలతో మమేకం అయింది. ఎన్టీఆర్‌కు అన్యాయం జరిగిందని శాంతిభద్రతలను కాపాడాల్సిన బలగాలు కూడా భావించాయి. దీంతో ఉద్యమకారుల పట్ల సానుభూతితో వ్యవహరించారు. పాలకులు ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఇందిరాగాంధీ వంటి శక్తిమంతురాలు కూడా ప్రజాగ్రహానికి దిగిరాక తప్పలేదు. ఇక్కడ ఇంకో విషయాన్ని పాలకులు గుర్తుంచుకోవాలి. నాడు అంతటి ప్రజాదరణను చూరగొన్న ఎన్టీఆర్‌ను ఐదేళ్ల తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో అదే ప్రజలు ఓడించారు. భారతీయులు శాంతి కాముకులు. మన చుట్టూ ఇప్పుడు జరుగుతున్న ఇటువంటి సంఘటనలు మన దేశంలో జరగకుండా మన రాజ్యాంగ నిర్మాతలు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. పొరుగు దేశాలలో వలె అధికారం సైన్యం చేతుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. మిలటరీని, వాయుసేనను, నౌకాదళాన్ని విడివిడిగా ఏర్పాటు చేసి వాటికి అధిపతులను నియమించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. అయితే పాలకులపై ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు. ఎల్లయ్య మీద కోపం వస్తే పుల్లయ్యకు పట్టం కడుతున్నారే గానీ ఎన్నికల ప్రక్రియ, రాజకీయ వ్యవస్థపై అపార నమ్మకం ఉండి కాదు. ప్రస్తుతానికి ఆయా వ్యవస్థలపై ప్రజల్లో అసంతృప్తి గూడుకట్టుకుంటోంది.
అధికారంలోకి రావాలనుకుంటున్న వారు సంక్షేమం పేరిట హద్దు మీరి ప్రజా ధనాన్ని పంచి పెట్టడంపై పన్ను చెల్లింపుదారులు ఆగ్రహంగా ఉన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రజలను సోమరులుగా మార్చే పథకాలను ప్రవేశపెట్టే అధికారం రాజకీయ నాయకులకు ఎక్కడిది? అన్న ప్రశ్న తరచుగా వినిపిస్తోంది. మరోవైపు వనరులన్నీ పాలకుల మెప్పు పొందిన వారి సొంతం అవుతున్నాయి. ఇంకోవైపు సామాన్యులకు న్యాయం ఎండమావి అవుతోంది. మొత్తంమీద మన దేశంలో ప్రస్తుతం ఫలానా వ్యవస్థ పటిష్ఠంగా, న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తోందని చెప్పలేని పరిస్థితి నెలకొంది. అధికార దుర్వినియోగం పరిపాటిగా మారిపోయింది. దీంతో అవినీతిపరులు తప్పించుకోవడం సులువవుతోంది. ఎవరు మాత్రం అవినీతికి పాల్పడటం లేదు? అని ప్రజలు నిస్పృహతో ప్రశ్నిస్తున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత అటు పాలకులు, ఇటు రాజ్యాంగ సంస్థల అధిపతులపై ఉంది. లేని పక్షంలో శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో వలె కాకపోయినా మన దేశంలో మరో రూపంలో అశాంతి ప్రబలుతుంది. ఈ క్లిష్ట సమయంలో న్యాయ వ్యవస్థపైనే గురుతర బాధ్యత ఉంది. న్యాయ వ్యవస్థ తాను రాజ్యాంగానికి మాత్రమే జవాబుదారీనని భీష్మించుకొని ఒత్తిళ్లు, ప్రలోభాలకు తలొగ్గకుండా వ్యవహరిస్తే మిగతా వ్యవస్థలు కూడా దారిలోకి వస్తాయి. ప్రజలు న్యాయంకోసం చివరిగా తలుపు తట్టేది న్యాయ వ్యవస్థనే. న్యాయాధికారులు, న్యాయమూర్తులు ఈ వాస్తవాన్ని గుర్తించి బాధితులకు సత్వర న్యాయం అందిస్తే మిగతా వ్యవస్థలు ఎన్ని వికారాలు పోయినా ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లదు. భారతదేశం అజేయంగా, మన ప్రజాస్వామ్యం అజరామరంగా వెలుగొందుతాయి. జై హింద్!
ఆర్కే
ఇవి కూడా చదవండి..
Congress AI Video On PM Mother: మోదీ తల్లిపై కాంగ్రెస్ వివాదాస్పద ఏఐ వీడియో.. బీజేపీ ఫైర్
Vijay Statewide Tour: రాజుల తరహాలోనే ప్రజాస్వామ్య యుద్ధానికి ముందు మీ ముందుకొచ్చా
For More National News and Telugu News