Share News

GST Rate Cut a Reform: జీఎస్టీ తగ్గింపు ఎలాంటి సంస్కరణ

ABN , Publish Date - Sep 27 , 2025 | 01:50 AM

దేశ ఆర్థిక వ్యవస్థ స్థితి ఏమిటి? ఈ విషయాన్ని తెలుసుకునేందుకు నేను నెల నెలా రిజర్వ్‌ బ్యాంక్‌ బులెటిన్‌ కోసం ఎదురుచూస్తుంటాను. స్థూల దేశీయోత్పత్తి, ద్రవ్యోల్బణం, ఉపాధి, వాణిజ్యం మొదలైన కీలక సూచికల ద్వారా...

GST Rate Cut a Reform: జీఎస్టీ తగ్గింపు ఎలాంటి సంస్కరణ

దేశ ఆర్థిక వ్యవస్థ స్థితి ఏమిటి? ఈ విషయాన్ని తెలుసుకునేందుకు నేను నెల నెలా రిజర్వ్‌ బ్యాంక్‌ బులెటిన్‌ కోసం ఎదురుచూస్తుంటాను. స్థూల దేశీయోత్పత్తి, ద్రవ్యోల్బణం, ఉపాధి, వాణిజ్యం మొదలైన కీలక సూచికల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం పనితీరును విశ్లేషించే ‘స్టేట్‌ ఆఫ్‌ ది ఎకానమీ’ (దేశ ఆర్థిక వ్యవస్థ స్థితి) వ్యాసాన్ని శ్రద్ధాసక్తులతో చదువుతాను. ఆ వ్యాసం ఆరంభంలో ఒక హెచ్చరిక ఉంటుంది. అది నన్ను తప్పక ఉల్లాసపరుస్తుంది. సెప్టెంబర్ బులెటిన్‌లోని ఆ హెచ్చరిక ఇలా ఉన్నది: ‘ఈ వ్యాస రచనలో డాక్టర్‌ పూనమ్‌ గుప్తా (డిప్యూటీ గవర్నర్‌) సమకూర్చిన మార్గదర్శకత్వం, నిశితంగా చదివి మార్పులు, చేర్పులకు చేసిన సూచనలను కృతజ్ఞతాపూర్వకంగా అంగీకరిస్తున్నాము... ఈ వ్యాసంలో వ్యక్తమైన అభిప్రాయాలు రచయితలవే గానీ, భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ అభిప్రాయాలు కావు’. ఈ మాటలు నాకు గొప్ప వినోదం. ఎందుకంటే గవర్నర్‌ ఆమోదం, అనుమతి లేకుండా ఒక్క మాట కూడా ఆర్బీఐ నుంచి వెల్లడవదు. డిప్యూటీ గవర్నర్‌ అకడమిక్‌ పరిశోధనా పత్రం లేదా ప్రసంగం సైతం ముందుగా గవర్నర్‌ ఆమోదం పొంది తీరుతుంది. ఏవైనా ఆయన అనుమతితో మాత్రమే జరుగుతాయి.

ఆ హెచ్చరికను ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. ఆ వ్యాసాన్ని దేశంలో చాలా మంది, ముఖ్యంగా అర్థశాస్త్ర బోధన, పరిశోధనలలో ఉన్నవారు చదువుతుంటారు. దాని నుంచి విస్తారంగా ఉటంకింపులు చేస్తారు. ఆ వ్యాసంలో పదే పదే ప్రస్తావితమయ్యే పదం ఒకటి ఉన్నది: ‘అనిశ్చితి’. అవును, అనిశ్చితే, ఒకచోట కాదు, ఎల్లెడలా. ద్రవ్యోల్బణం, ధరలు, ఉద్యోగిత, వేతనభత్యాలు, పెట్టుబడులు, ఆదాయాలు, పన్నులు, విదేశీ వాణిజ్యం మొదలైన విషయాలలో ఎంతో అనిశ్చితి. ప్రభుత్వమూ, రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నాయి, మరెన్నో చర్యలు చేపట్టాయి. అయినా అనిశ్చితే! ఈ అనిశ్చితి ఆర్థికేతర రంగాలకూ వ్యాపించింది. పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌, ఓటర్‌ జాబితాలు, ఎన్నికల, చట్టాలు, వాటిని అమలుపరిచే విధి విధానాలు, విదేశాంగ విధానం, ఇరుగుపొరుగు దేశాల పట్ల అనుసరించాల్సిన విధానం మొదలైన విభిన్న విషయాలలో కూడా అనిశ్చితి ఎక్కువగానే ఉన్నది. వాస్తవంగా అనిశ్చితి అనేది ఆర్థికంగా, ఇతరత్రా దేశ ప్రస్తుత స్థితిగతులను నిర్వచిస్తోంది.


భారత ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత అనిశ్చిత పరిస్థితులకు కారణమేమిటి? రిజర్వ్‌ బ్యాంక్‌ చెప్పే మాట ఒక్కటే: ‘ఆర్థిక వ్యవస్థ శీఘ్రగతిన కోలుకొంటోంది’. ఇక్కట్ల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం మాదిరిగానే రిజర్వ్‌ బ్యాంక్‌ కూడా ఏదో ఒక అంశాన్ని ఆసరాగా తీసుకోవడం పరిపాటి. ఆర్థిక వ్యవస్థను సమస్యల నుంచి గట్టెక్కించేందుకు ప్రభుత్వానికి తట్టిన తరుణోపాయం వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల తగ్గింపు. ఈ రేట్ల తగ్గింపు జీఎస్టీ సంస్కరణల్లో ఒక మైలు రాయి అని రిజర్వ్‌ బ్యాంక్‌ అభివర్ణించింది. అవునా? జీఎస్టీని అధిక స్థాయిలో బహు విధంగా నిర్ణయించడమే అసలు పాపం. మరి ఆ అధిక, అనేక రేట్లను తగ్గించడంలో ‘సంస్కరణ’ ఏముంది? అయినా అదెలా సంస్కరణాత్మక చర్య అవుతుంది? జీఎస్టీ చట్టాల రూపకల్పన సక్రమంగా లేదు. జీఎస్టీ వ్యవస్థ నిర్మాణం తప్పుడు రీతుల్లో ఉన్నది. దాని నియమ నిబంధనలు తప్పు. పన్ను రేట్లు శుద్ధ తప్పు. బహు విధంగా, అందునా అత్యధికంగా ఉన్న పన్ను రేట్లను తగ్గించడమనేది పథ నిర్దేశక సంస్కరణ ఎలా అవుతుంది?

అయితే జీఎస్టీ రేట్ల తగ్గింపుతో దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఆ రేట్ల తగ్గింపుతో వినియోగదారులకు 2,00,000 కోట్ల రూపాయలు ఆదా అవుతాయని అంచనా వేస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ. 3,57,00,000 కోట్లు నామమాత్ర స్థూల దేశీయోత్పత్తికి వ్యతిరేకంగా ‘అదనపు’ డబ్బు 0.56 శాతం (ఇది జాతీయ రుణం– జీడీపీ నిష్పత్తిని కచ్చితంగా సూచిస్తుంది. ఈ నిష్పత్తిని దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణంతో పోలిస్తే అప్పులను తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. జాతీయ రుణం–జీడీపీ నిష్పత్తి అధికంగా ఉంటే ఆర్థిక స్థిరత్వానికి ప్రమాదం వాటిల్లవచ్చు) మన దేశంలో కిరాణా విపణి వార్షిక విలువ రూ. 82,00,000 కోట్లు అని అంచనా. దీనికి వ్యతిరేకంగా ‘అదనపు’ డబ్బు 2.4 శాతంగా ఉన్నది. అదనపు కిరాణా వ్యయం వినియోగాన్ని పెంపొందిస్తుంది. అయితే దేశ ఆర్థిక వ్యవస్థపై ఈ పెరుగుదల ప్రభావాన్ని అత్యుక్తులతో చెప్పడం సబబేనా?


జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోగదారులకు ఆదా అయ్యే రూ.2,00,0౦0 కోట్లు పూర్తిగా వినియోగంలోకి వెళ్లుతుందా? వెళ్లదు. అధికారిక సమాచారం ప్రకారం కుటుంబ రుణాల మొత్తం పరిమాణం జీడీపీలో 40 శాతానికి పెరిగింది. కుటుంబ పొదుపుల మొత్తం జీడీపీలో 18.1 శాతానికి పడిపోయింది. ఈ కారణంగా ఆదా అయ్యే జీఎస్టీ ‘డబ్బు’లో కొంత రుణాలు తీర్చుకోవడానికి, మరి కొంత పొదుపులు పెంచుకోవడానికి వినియోగమవుతుంది జీఎస్టీ రేట్ల తగ్గింపుతో వినియోగ వ్యయం పెరుగుతుందనే అంచనాతో నేను ఏకీభవిస్తున్నాను. అయితే అది వినియోగం, ఉత్పత్తి, పెట్టుబడి ఆవృతిని వేగవంతమూ, సమృద్ధమూ చేసేందుకు దోహదపడుతుందా? సర్కారీ–ఆర్థికవేత్తలు మాత్రమే ఈ ప్రశ్నకు సానుకూలంగా ప్రతిస్పందిస్తున్నారు. ఇతర ఆర్థికవేత్తలు సంభావ్య సానుకూలతలను సంశయిస్తున్నారు.

జీఎస్టీ రేట్ల తగ్గింపు ప్రభావంపై ఆర్థిక మంత్రిత్వశాఖ, రిజర్వ్‌ బ్యాంక్‌ సంపూర్ణ ఏకీభావంతో ఉన్నాయి. జూన్‌ 19, 2025న ఆర్థిక మంత్రిత్వశాఖ సంప్రతింపుల కమిటీ పరిశీలనకు నివేదించిన ఒక పత్రంలో మొదటి రెండు పేజీలలోనే ఈ శీర్షికలు ఉన్నాయి: ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెరిగిన అనిశ్చితి; మందగించిన ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులు’. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు సజావుగా, సుదృఢంగా ఉన్నది. అయినా ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు కఠిన సంస్కరణలను అమలుపరిచేందుకు సుముఖంగా లేరు. నిజం చెప్పాలంటే వాటిని అమలుపరచగల పరిస్థితి కూడా లేదు. ‘జీవన సౌలభ్యం’, (ఒక వ్యక్తి లేదా సమాజం జీవన స్థితిగతుల నాణ్యతను సూచించే భావన. ఆర్థిక అవకాశాలు, విద్యా వైద్య వసతులు, మౌలిక సదుపాయాలు, పర్యావరణ స్వచ్ఛత మొదలైన అంశాల ప్రాతిపదికన జీవన సౌలభ్య స్థాయిని నిర్ధారిస్తారు) ‘వ్యాపార సౌలభ్యం’ (ఒక దేశంలో లేదా ప్రాంతంలో వ్యాపారం ప్రారంభించడం, నిర్వహించడం, నియమ నిబంధనలు పాటించడం ఎంత సులభంగా ఉందో తెలిపే సూచిక ఇది) గురించి ప్రధాన మంత్రి చక్కగా మాట్లాడుతున్నారు. అయితే మాటలతో అవి సిద్ధిస్తాయా? కఠిన సంస్కరణలను అమలుపరిచి తీరాల్సిందే.


భారత్‌ సంపూర్ణంగా ఒక బహిరంగ, పోటీదాయక ఆర్థిక వ్యవస్థగా పరిణమించి తీరాలి. బహిరంగ ఆర్థిక వ్యవస్థగా మారే విషయంలో మన అనుభవం ఏమిటి? మనం ఒక ద్వారం తెరిస్తే ఒక కిటికీని మూసివేస్తాం! బహిరంగ ఆర్థిక వ్యవస్థ అనేది ప్రపంచంలోని సమస్త దేశాలతోనూ వాణిజ్య సంబంధాలు నెలకొల్పుకునేందుకు సుముఖంగా, సంసిద్ధంగా ఉండాలి. ‘పోటీదాయక’ ఆర్థిక వ్యవస్థగా రూపొందాలంటే ప్రపంచ దేశాలతో మనం ద్వైపాక్షిక, బహుళ పాక్షిక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలి. చిప్‌లు, నౌకలు తయారు చేయగలగడంతోనే ఏ ఆర్థిక వ్యవస్థా పోటీదాయక ఆర్థిక వ్యవస్థ కాదు, కాబోదు, కాలేదు. ఏ వస్తు సేవలతో ఏ దేశంతోనైనా పోటీపడగలమో ఆ వస్తు సేవలనే మనం ఉత్పత్తి చేయాలి.

దక్షిణాసియా, ఆసియాన్‌ (ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య)తో మనం తొలుత పోటీపడాలి. ప్రపంచంలో అతి తక్కువగా ఏకీకృతమైన వాణిజ్య మండలాలలో సార్క్‌ (దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం)నే మొదట చెప్పాలి. సార్క్‌ దేశాల మధ్య వాణిజ్యం ఆ దేశాల మొత్తం అంతర్జాతీయ వాణిజ్యంలో 5 నుంచి 7 శాతం మాత్రమే. సార్క్‌ దేశాలతో భారత్‌ వాణిజ్యం 8 శాతం మాత్రమే. ఆసియాన్ దేశాలతో భారత్‌ వాణిజ్యం 11 శాతంగా ఉన్నది.

మరో కఠిన సంస్కరణ నియంత్రణల తొలగింపు. ప్రతి ఒక్కరికీ– చట్టాలు అమలుపరిచే వారి నుంచి పన్నుల శాఖ అధికారుల దాకా– నియమ నిబంధనల పట్ల మహాప్రీతి. బిల్లుల ఉద్దేశాలు, లక్ష్యాల గురించి వివరిస్తారు గానీ నియమ నిబంధనలు, నియంత్రణలు, నోటిఫికేషన్లు, మార్గదర్శక సూత్రాల గురించి వెల్లడించరు. మన పాలనా వ్యవస్థలోని ఇటువంటి ధోరణుల వల్లే ఒక ఉత్తమ నిర్దుష్ట భావన అయిన జీఎస్టీ ‘గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌’గా మారింది. సరళీకృత ఆర్థిక విధానాలు ప్రారంభమైన తొలి దశ (1991–96 సంవత్సరాల మధ్య)లో వివిధ ఆర్థిక కార్యకలాపాలపై తొలగించిన నియంత్రణలు చాలావరకు ఏదో ఒక రూపంలో మళ్లీ వ్యవస్థలో అంతర్భాగమయ్యాయి! అయినా ప్రతిరోజూ మరిన్ని నియమ నిబంధనలు, నియంత్రణలు ప్రవేశపెడుతున్నారు!


ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలకు అనవసర అవరోధాలుగా ఉన్న నియమ నిబంధనలు నియంత్రణలను తొలగించేందుకు ఒక సాధికార కమిటీని నియమించాలి. తద్వారా ఒక పెద్ద సంస్కరణకు ప్రభుత్వం పూనుకోవాలి. ప్రధానమంత్రి పదే పదే మాట్లాడుతున్న ‘జీవన సౌలభ్యం’ ‘వ్యాపార సౌలభ్యం’కు అది విశేషంగా తోడ్పడుతుంది. వృద్ధిరేటు పెరుగుదలకు కూడా అది దోహదం చేయగలదని నేను విశ్వసిస్తున్నాను. వస్తుసేవల పన్ను రేట్లు తగ్గింపు నిర్ణయం అనేది అసలు పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం మాత్రమే. అంతకు మించి మరేమీ కాదు. ఆనందోత్సాహాలతో ఉత్సవం చేసుకునేందుకు ఆ నిర్ణయం తగదు. దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకు అది ఎంతమాత్రం సరైన జవాబు కానేకాదు.

పి. చిదంబరం

(వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి,

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు)

ఇవి కూడా చదవండి..

అలాంటివి మాట్లాడుకోలేదు.. నాటో నిర్లక్ష్యాన్ని తప్పుపట్టిన భారత్..

భారత్‌పై సుంకాలు.. రష్యాపై తీవ్ర ప్రభావం: నాటో చీఫ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2025 | 01:50 AM