Share News

Gurram Jashuvas Gabbilam: అణచివేతకు అద్దం పట్టిన గబ్బిలం

ABN , Publish Date - Sep 27 , 2025 | 01:44 AM

సత్కవి గుఱ్ఱం జాషువా డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సమకాలికుడు. అస్పృశ్యతను చవిచూసిన ఈ కవివరేణ్యుడు తన ఖండకావ్యం ‘గబ్బిలం’లో నాటి సామాజిక వ్యవస్థ మూలాలను, అమానవీయ దౌష్ట్యాన్ని కరుణారసభరితంగా వర్ణించి...

Gurram Jashuvas Gabbilam: అణచివేతకు అద్దం పట్టిన గబ్బిలం

సత్కవి గుఱ్ఱం జాషువా డా. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ సమకాలికుడు. అస్పృశ్యతను చవిచూసిన ఈ కవివరేణ్యుడు తన ఖండకావ్యం ‘గబ్బిలం’లో నాటి సామాజిక వ్యవస్థ మూలాలను, అమానవీయ దౌష్ట్యాన్ని కరుణారసభరితంగా వర్ణించి సాహిత్య వేదికపై మానవజాతిని మేలుకొల్పిన సంఘసంస్కర్త. మరీ ముఖ్యంగా అరుంధతీయుల దుర్భర జీవనగతులను ప్రశ్నించే ‘చైతన్యంతో అనుసంధించి సమర సత్యాత్మక ప్రబోధంతో, సమాజాన్ని తట్టి లేపిన విశ్వనరుడు’. జాతీయోద్యమ స్ఫూర్తితో దేశభక్తి కొత్తపుంతలు తొక్కుతున్న సమయాన పేదల పక్షాన నిలబడ్డ దార్శనికుడు.

చిట్టి ‘చందమామ కథలతో సంతృప్తి చెందే చిన్నతనంలో ఆత్రంగా చదివిన ఉన్నవ లక్ష్మీనారాయణ ‘మాలపల్లి’, గురజాడ ‘కన్యాశుల్కం’, బోయి భీమన్న ‘పాలేరు’, జాషువా ‘గబ్బిలం’ వంటి సాంఘిక నవలలు, నాటికలు, కావ్యాల సారాన్ని పునఃశ్చరణ చేసుకుని సారాన్ని సంగ్రహించటానికి ఆరు పదుల వయస్సు మీద పడిన తరువాత గానీ సాధ్యపడలేదు. ‘కోవిడ్‌–19’ సమయంలోనే ఈ పుస్తక పఠనం వీలైంది.

కుల వ్యవస్థను, సామాజిక అంతరాల్ని నిరసిస్తూ వెలువడిన సాహిత్యానికి శతాబ్దాల చరిత్ర ఉంది. పాల్కురికి సోమన, యోగి వేమన, దున్నా ఇద్దాసు, పోతులూరి వీరబ్రహ్మం, నారాయణగురు, చొక్కామేళ ఇత్యాది విముక్త సాహిత్య స్రష్టలు, సాంఘిక సంస్కర్తలు దక్షిణ భారతదేశాన సామాజిక పరివర్తన దిశగా తమదైన ముద్ర వేశారు. ఉత్తరాదిన కూడా సంత్‌, సాధువులైన రవిదాసు, కబీరు, తుకారాం వంటి సంఘ సంస్కర్తలు కులాధిపత్యాన్ని నిలదీశారు. ఈ పరంపరలోని మహావ్యక్తీ స్వానుభవంతో జాషువా కవి శత్రువును సైతం క్షమించాలనే బౌద్ధ సుగుణం ఈయన పద్యాల్లో మరింత వెలుగు చూపింది.


శ్రీకృష్ణదేవరాయల ఎడబాటు నాలుగుదిక్కులా, సాహితీ చీకట్లు కమ్మిన సమయాన, తెలుగు కవితా సరస్వతి దారిబత్తెంతో తంజాపురం వైపు వలసపోయిన వేళలో అపర రాయలైన రఘునాథరాజు తన ఆస్థానంలో ఆశ్రయం ఇచ్చిన వైనం జాషువా కవివర్యుడు తన ఈ ఉద్గ్రంథంలో వర్ణించిన తీరు అజరామరం. చేమకూర వెంకట కవి తెలుగనే పద్మాక్షికి రెండర్థాల మాటలు నేర్పిన సమయం అది. మువ్వగోపాలుణ్ణి స్తుతించటానికి క్షేత్రయ్య కలం పట్టుకున్న తరుణమది. ఈ సాహిత్య నేపథ్య నిలువుటద్దంలో బాసటగా, రఘునాథుడి ఏలుబడిలో తంజావూరుకు దక్షిణాన నివాసమేర్పరుచుకున్న ఒక అరుంధతీయుడు, అతడు గర్భదరిద్రుడు. తన ఊరట లేని దీనావస్థను స్నేహపూర్వకంగా ఓ పక్షికి వివరించే వృత్తాంతమే ఈ ‘గబ్బిలం’ జాషువా కావ్యస్మృతి.

కుల మదంతో పొగరెక్కిన ఈ సమాజంలో, పురుగు, పుట్ర కాక పేదలకు ఆప్తులు, ఆత్మీయులు ఎవరున్నారని ప్రశ్నిస్తూనే, అతని గోరువెచ్చటి కన్నీటికి చక్రవాక పక్షులతో వ్యాఖ్యానం పలికించటం మానవతావాదిగా జాషువాకే చెల్లింది. కావ్య నాయకుడిగా చెప్పుకోవలసి వస్తే, ఈ అరుంధతీయుడు భారతమాతకు పుట్టిన కడగొట్టు బిడ్డ, మూలవాసి. అందరికీ నాల్గు దిక్కులుంటే, ఏ దిక్కూ మొక్కు లేని దీనుడితడు. సవర్ణులు ఈతనికి ఎన్నో మనః క్లేశాల్ని మిగిల్చినా, ఏనాడూ వారికి ఎదురు తిరగాలని అనుకోలేదు. పైపెచ్చు వారి పాదాలు కందిపోకుండా చెప్పులు కుట్టి ఇస్తాడు. ఈతడు మాత్రం చెప్పులు తొడుక్కుని సాటి నరుని కంటపడరాదు. ఈతడు ఆలయాన్ని తాకితే త్రిమూర్తులు కూడా ఉపవాసం ఉండవల్సిందే. ఈతడు చేసిన సేవకు యావత్తు భారతావని అప్పు పడిందని వాపోతాడు జాషువా.


కులం లేని పేదవాడిగా, పుట్టు బానిసగా బ్రహ్మచర్య దీక్ష పూనిన ఈ అరుంధతీయుడు, పగలంతా రెక్కాడించి, సూర్యుణ్ణి సాగనంపి తన గూటి (గుడిసె)కి చేరి, కాసిన్ని గంజి నీళ్ళు తాగి, నిద్రకై కుక్కి మంచంపై మేను వాల్చాడు ఒకనాడు. ముక్కూ, ముఖం లేని చీకటి ముద్దలాగ ఉన్న గబ్బిలం ఒకటి అటు తిరుగాడుతూ వచ్చింది గుడిసెలోకి. దాని రెక్కల గాలికి ఈతని ఇంటవున్న ఆముదపు ప్రమిద కొండెక్కింది. చీకటిలో దయ్యపు పిల్లలాగా తిరుగుతున్న ఆ తాపసి పిట్టను చూచి, ఈతనిలో కొత్త ఊహలు మొగ్గతొడిగి చిగురించటం ఊహాతీతం. ఆ గబ్బిలాల రాణికి స్వాగతం పలుకుతూ ‘పవిత్ర ఆలయాల్లో తిరుగాడేవు నీవు, ఈ అంటరాని వాడి నిషిద్ధ గృహానికి వస్తే ఈ లోకం నిన్ను కూడా బహిష్కరిస్తుందేమో? ఇది హృదయం లేని లోకం సుమీ!’ అంటూ హెచ్చరిస్తాడు.

‘జంతు ధర్మం, పక్షి ధర్మం నీలో ఉన్నాయని ఇప్పటికే ఈ లోకం నీ ముఖం చూడదు. ఈ నిరుపేదకు అలాంటి పట్టింపులు లేవు, ఈ కాళరాత్రి నా గుండె దిగులు పోగొట్టి, ఆ త్రిశూలధారికి నా ఈ సందేశాన్ని చేరవేద్దువు గానీ, ఆలయంలో తలకిందులుగా వేలాడేటపుడు శివయ్య చెవికి కాస్త దగ్గరగా ఉన్నపుడు, పూజారి లేని వేళలో, నా దీనావస్థను వినిపించు స్వామికి. పూజార్లు వింటే నీకు ప్రాయశ్చిత్తం చేసేరు సుమీ!’ అంటూనే, ఇక్కడ బ్రహ్మాది దేవుళ్ళూ ధనం గలవాడి అదుపాజ్ఞలలో బందీలయినారని వాపోతాడు.

జాషువా ‘గబ్బిలం’ కేవలం కవిత్వం కాదు. ఒక అస్పృశ్యుడి ఆర్తనాదం. భారతీయతత్వం, భాషలు, సాంస్కృతిక, చారిత్రక వైభవాన్ని లోకానికి తెలియజెప్పిన ‘భారతదర్శిని’.

దాసరి శ్రీనివాసులు

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి

(రేపు: గుఱ్ఱం జాషువా 130వ జయంతి)

ఇవి కూడా చదవండి..

అలాంటివి మాట్లాడుకోలేదు.. నాటో నిర్లక్ష్యాన్ని తప్పుపట్టిన భారత్..

భారత్‌పై సుంకాలు.. రష్యాపై తీవ్ర ప్రభావం: నాటో చీఫ్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 27 , 2025 | 01:44 AM