Glorious Palnadu Kingdom: అఖండ పల్నాడు రాజ్య స్థాపకుడు ‘అనుగురాజు’
ABN , Publish Date - Sep 27 , 2025 | 01:38 AM
మధ్యయుగంలో వినుతికెక్కినదే పల్నాడు రాజ్యం. విస్తీర్ణంలో, గ్రామాల పరంగా రాజ్యం చిన్నదే కావచ్చు. కానీ ఈ రాజ్య చరిత్ర మాత్రం అగణితం. ఎన్నో సామ్రాజ్యాలకు సైతం లేని స్వర్ణ చరి...
మధ్యయుగంలో వినుతికెక్కినదే పల్నాడు రాజ్యం. విస్తీర్ణంలో, గ్రామాల పరంగా రాజ్యం చిన్నదే కావచ్చు. కానీ ఈ రాజ్య చరిత్ర మాత్రం అగణితం. ఎన్నో సామ్రాజ్యాలకు సైతం లేని స్వర్ణ చరిత పల్నాడుకి దక్కింది. 194 గ్రామాలకు మాత్రమే పరిమితమైన పల్నాటి రాజ్య చరిత తొలి వీరగాథ. ప్రపంచ చరిత్రలో రోమ్ నగరం తరువాత పల్నాడులోనే యుద్ధంలో మృతి చెందిన వీరుల ఆయుధాలనే వీరులుగా భావించి, నేటికీ కొలుస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వైధవ్యం ప్రాప్తించిన ఒక స్త్రీమూర్తిని తొలి మహామంత్రిణిగా స్వీకరించిన ఘనత మొదటగా ఈ రాజ్య పాలకులకే దక్కింది. ఇది ఒక గొప్ప సంస్కరణ.
12వ శతాబ్దంలో చరితార్థమైన ఈ గాథ నేటికీ ప్రజల నాలుకలపై నడయాడుతూనే ఉంది. తొలుత 300 ఏళ్ళ పాటు మౌఖిక గాథగా మొగ్గ తొడిగిన ఈ చరిత్ర 15వ శతాబ్దిలో శ్రీనాథ మహాకవి మొట్టమొదటిగా అక్షరీకరించి ఒక ద్విపద కావ్యంగా సృజించారు. అట్లా వికసించిన ఈ గాథను భూమికగా చేసుకొని కవులు, రచయితలు, గణ కవిత్వంగా, కథనాలుగా, నవలలుగా, నాటకాలుగా మలిచారు. వీరిలో మూల వాస్తవ గాథకు తూట్లు పొడిచి చెప్పినవారే అధికం. కల్పనలు, మాయలు, మంత్రాలు, తంత్రాలు జోడించి అతిశయాలు పండించినవారే మిక్కుటం. భౌతికతత్వాన్ని వీడి తమ బుర్ర ఏ విధంగా చెబితే ఆ విధంగా వండివార్చినవారు, కల్పితాలకు రంగులు అద్ది చరిత్రను చిత్రించి భ్రష్టు పట్టించినవారూ లేకపోలేదు. నిజాయితీగా చెప్పడానికి ప్రయత్నించిన వారు పిడికెడు మంది కూడా లేరంటే అతిశయోక్తి కాదు.
ప్రధానంగా పల్నాడు చరిత్రకు శాసనాధారాలు బహు తక్కువ. మనకి ఇప్పుడు లభిస్తున్న పల్నాడు చరిత్ర సారస్వతంలో పల్నాటి రాజులను విస్మరణకు గురిచేసి, మంత్రులైన బ్రహ్మనాయుడు, నాయకురాలు నాగమ్మ చుట్టూనే కలం పట్టిన వారంతా ప్రదక్షిణలు చేశారు. ఇకముందు సైతం పల్నాటి చరిత్ర ఎవరు రాయబూనినా ఇతరత్రా కోణాలు దర్శించలేని వివశమైన స్థితినే ఎదుర్కొంటారు. అఖండ పల్నాడు స్థాపకులు అనుగురాజు యాదవ్ నుంచి, అనంతరం రెండు తరాలు నలగామరాజు యాదవ్, పెదమలి దేవరాజు యాదవ్, నలగాముని కుమారుడు అనుంగు కామరాజు యాదవ్ వీరెవరి గురించి పెద్దగా విషయాలు పొందుపరచకపోవడం ఒక వివక్షే. వీరి గురించి రాయాలంటే దుర్భిణితో వెతుక్కునే కసరత్తు చేయాలి.
అనుగురాజు హైహయ వంశజుడు. కార్తవీర్యార్జునుని పరంపరగా కొన్ని రచనలు నమోదు చేశాయి. ప్రస్తుత బిహార్ రాష్ట్రంలోని పాలమాచాపురి పట్టణం నుంచి వచ్చినట్లుగా బోధపడుతున్నది. 15వ శతాబ్దిలో శ్రీనాథుని సమకాలీనుడూ, ప్రౌఢకవి వినుకొండ వల్లభరాయుడు ‘క్రీడాభిరామం’ శీర్షిక కలిగిన తన ఖండకావ్యంలోని ‘పలనాటి వీరుల చరిత్ర’ ఖండికలో అనుగురాజును యాదవుడని స్పష్టం చేశాడు. ఆ ఖండికలోని ఒక పద్యంలో ‘‘ఇచ్చోట బోరిరి ఇలపణంబుగ గొల్ల/ సవతి తల్లుల బిడ్డలవని పతులు’’ అంటూ చెప్పుకొచ్చాడు. కోడి పోరు సందర్భాన్ని వర్ణిస్తూ గొల్ల(యాదవ) సవతి తల్లుల బిడ్డలైన నలగామరాజు యాదవ్, పెదమలి దేవరాజు యాదవ్ రాజ్యాలను పందెంగా పెట్టినట్లుగా వివరించాడు. ఈ మొదటి పాదంలోని ‘గొల్ల’ పదం కులాన్ని ప్రస్తావిస్తూ తెలిపిన విషయంగా అర్థమవుతున్నది. ఈ క్రమంలో అనుగురాజు యాదవ్ ‘యాదవ కుల సంజాతుడని’ ధృవపడుతోంది. పాలమాచాపురి నుంచి సైన్యసమేతుడై దివ్యక్షేత్రాలను దర్శిస్తూ, పుణ్యతీర్థాలు సేవిస్తూ మోటుపల్లి చేరుకున్నట్లు పూర్వపు రచనల ద్వారా తెలుస్తున్నది.
అప్పటికే ఆయనకు ఇరువురు రాణులున్నారు. ఒకరు విద్యలదేవి, మరొకరు భూ రమాదేవి. విద్యలదేవి పుట్టినింటి సంగతులను ఏ రచయితా ప్రస్తావించలేదు. భూ రమాదేవి గయను ఏలిన భీమరాజు కుమార్తె అని నమోదైంది. మోటుపల్లి వద్దనున్నప్పుడు తెల్ల జొన్నకంకుల నేపథ్యంగా ప్రారంభమైన వివాదం చిలికి చిలికి యుద్ధంగా పరిణమించి, ఆ సమరంలో విజయం సాధించిన అనుగురాజు యాదవ్‌కి పరాజయం పాలైన చందవోలునేలే గొంకరాజు యాదవ్ తన కుమార్తె మైలమాదేవిని ఇచ్చి పరిణయం జరిపించాడు. అప్పటి తన ఏలుబడిలో ఉన్న పల్నాడు ప్రాంతాన్ని కుమార్తె మైలమాదేవికి అరణంగా ఇచ్చాడు. భార్యకు అరణంగా వచ్చినప్పటికీ పాలకునిగా అనుగురాజు యాదవ్ ఏలుబడిలోకే వచ్చి, ఆయన అఖండ పల్నాడు స్థాపకునిగా గుర్తింపు పొందాడు. అఖండ పల్నాడును గురజాల రాజధానిగానే ఈయన పాలించారు. అనుగురాజు యాదవ్ పాలన మొదలై ఆయన పరమపదించే వరకూ పల్నాడు అఖండంగా ప్రగతి మార్గాన పయనించింది.
అనుగురాజు యాదవ్, ఆయన అనుచరులు అందరు కూడా శైవ మతస్తులు. ఈయన పాలనలో గురజాలలో ఇష్టకామేశ్వర దేవాలయం, జిట్టగామాలపాడులో చెన్నమల్లికార్జునస్వామి ఆలయం, తాడుట్ల బుగ్గమల్లేశ్వరస్వామి గుడి, సత్రశాల, దైద, కొదమగుండ్ల, గొళ్ళపాడు, గురజాల కోటగడ్డలు, గుత్తికొండ చీకటి మల్లయ్య కారంపూడి సూరేశ్వరాలయం, జూలకల్లు, మిరియాల శివాలయాలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆ నాటికి పల్నాడులో శివాలయం లేని గ్రామం ఉండదనడం సత్యదూరమేమీ కాదు. దాదాపుగా పల్నాడంతా శివమయమే. అనుగురాజు యాదవ్ పాలనలోనూ, అనంతరం ఆయన వారసుల పాలనలోనూ శక్తి ఆరాధన కూడా జరిగినట్లు వెల్లడవుతోంది. గురజాల మాత, కారంపూడి అంకాళమ్మ దేవాలయాలు పై సంగతిని రుజువు చేస్తున్నాయి.
అనుగురాజు యాదవ్ బ్రహ్మనాయుని తండ్రి దొడ్డనాయుడిని మంత్రిగా, కన్నమదాసు తండ్రి తెప్పలనీడుని సైన్యాధ్యక్షునిగా నియమించుకుని పాలన సాగించాడు. పల్నాటి చరిత్ర కన్నమదాసుని దళితునిగా (గోసంగి కులస్థునిగా) వివరిస్తున్న క్రమం, తెప్పలనీడు కూడా ఆ ప్రకారమే దళితుడని తెలియవస్తున్నది. ఈ సందర్భాన్ని మూల్యాంకనం చేసుకుంటే ఒక దళితుని సైన్యాధ్యక్షునిగా నియమించుకున్న అనుగురాజు యాదవ్ కుల వివక్షను దాటిన పాలనా సంస్కర్త. ఈయన పేరున పల్నాడులో కొన్ని గ్రామాలు ఏర్పడి కొంచెం అటూ ఇటుగా చెదిరి అవే నామాలతో నేటికీ పిలుస్తున్నారు. అనుగుమల్లిపాడు– అలుగుమల్లిపాడుగా, అనుగుపాలెం– అనుపాలెంగా, అనుగురాజుపల్లె– అలుగురాజుపల్లెగా పిలుస్తున్నారు. ఇంకా అనేక గ్రామాల పేర్లు 12వ శతాబ్ది నుంచి నేటికీ అవే నామాలతో మనగలగుతున్నాయి. జిట్టగామాలపాడు– గామాలపాడుగా, మాంచాలపాడు– మించాలంపాడుగా, రాచమల్లుపాడు– రచ్చమళ్ళపాడుగా కనిపిస్తున్నాయి. బెల్లంకొండ కొండపై అలరాజు బురుజు నేటికీ సజీవ సాక్ష్యంగా ఉంది. చెర్ల గుడిపాడు, కారంపూడి, కోలగుట్ల, మండాది, ఒప్పిచర్ల, కొదమగుండ్ల, అడిగొప్పల, గుత్తికొండ, జూలకల్లు, గుళ్ళపల్లి, నెకరికల్లు, చిన్న, పెద్ద నెమలిపురి గ్రామాలు పల్నాటి చరిత్రలో కుదురుకున్నాయి.
అనుగురాజు యాదవ్‌ను రెండు యుద్ధాలలో విజయం వరించింది. ఒకటి జొన్నకంకుల యుద్ధం, దీనినే కోరుట్ల యుద్ధం అని చెపుతారు. ఈ యుద్ధం మూలంగా మూడవరాణి అయిన మైలమాదేవిని బహుమానంగా పొందాడు. కాగా రెండవ యుద్ధం ఆరణగండ్ల యుద్ధం. ఈ యుద్ధం విజయం వల్ల ఆయనకు అధిక మొత్తంలో కప్పం, విలువైన కానుకలు లభించాయి.
సెప్టెంబర్ 28న పిడుగురాళ్ళలో అనుగురాజు యాదవ్ విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. రాష్ట్ర మంత్రివర్యులు కొలుసు పార్థసారథి, టీడీపీ రాష్ట్ర శాఖాధ్యక్షులు పల్లా శ్రీనివాసయాదవ్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, టీటీడీ బోర్డ్ సభ్యులు జంగా కృష్ణమూర్తి ఈ కార్యక్రమానికి రానున్నారు.
వై.హెచ్.కె. మోహన్‌రావు
(రేపు అనుగురాజు యాదవ్ విగ్రహావిష్కరణ)
ఇవి కూడా చదవండి..
అలాంటివి మాట్లాడుకోలేదు.. నాటో నిర్లక్ష్యాన్ని తప్పుపట్టిన భారత్..
భారత్‌పై సుంకాలు.. రష్యాపై తీవ్ర ప్రభావం: నాటో చీఫ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి