Adivasi Rights: యాభై ఏళ్ల ఆదివాసీ ఉనికి పోరు
ABN , Publish Date - Sep 27 , 2025 | 01:29 AM
1976లో నాటి ఉమ్మడి ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయ లబ్ధి కోసం సంచారజాతి కులానికి చెందిన లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చటంతో గత యాభై ఏళ్లుగా ఆదివాసులు అన్ని రంగాలలోనూ...
1976లో నాటి ఉమ్మడి ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయ లబ్ధి కోసం సంచారజాతి కులానికి చెందిన లంబాడాలను ఎస్టీ జాబితాలో చేర్చటంతో గత యాభై ఏళ్లుగా ఆదివాసులు అన్ని రంగాలలోనూ తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. ఆ కాలంలో పెద్దగా చదువుకోని, చట్టాలపట్ల అవగాహన లేని ఆదివాసీ రాజకీయ ప్రతినిధుల కారణంగా, ఆర్టికల్ 342 ప్రకారం పార్లమెంటరీ ప్రక్రియలేమీ నిర్వహించకుండా, ఏకపక్షంగా లంబాడా, ఇంకా దానితో సారూప్యత కలిగిన కులాలను ఎస్టీ జాబితాలో చేర్చారు. అప్పటి నుంచీ నాటి హైదరాబాద్ స్టేట్‌లోని 9 ఆదివాసీ తెగలకు చెందాల్సిన 4శాతం రిజర్వేషన్లను గత యాభై ఏళ్ళుగా లంబాడా సామాజిక వర్గాలు యథేచ్ఛగా కొల్లగొడుతున్నాయి.
ఆదివాసులకు న్యాయంగా దక్కాల్సిన భూమి, విద్యా, ఉద్యోగ అవకాశాలను దోచుకోవడంతో పాటు, అక్రమ రిజర్వేషన్లు గంపగుత్తగా అనుభవించి ఆర్థికంగా, రాజకీయంగా బలపడుతున్నారు లంబాడాలు. ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత వర్గాలకు చెందిన కులాలకు దీటుగా వారు అన్ని డిపార్టుమెంటుల్లోనూ, విశ్వవిద్యాలయాలలోనూ, రాజకీయ పార్టీలలోను తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. గత యాభై ఏళ్లుగా అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన లంబాడా సామాజిక వర్గాలు తమకు ఉన్న ఓటు బ్యాంకుతో అన్ని రాజకీయ పార్టీలను ప్రభావితం చేస్తూ ఆదివాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి.
అక్కడితో ఆగక, ఆదివాసులనూ వారి సంస్కృతి సంప్రదాయాలనూ రక్షించడానికి భారత రాజ్యాంగంలో చేర్చబడిన ఐదవ షెడ్యూల్ ప్రాంతాలలోనికి క్రమేణా ప్రవేశించి ఆదివాసులకు చెందాల్సిన ఏజన్సీ భూములను ఆక్రమిస్తున్నారు. గత కొన్నేళ్ళుగా ఆదివాసీ సంస్కృతిపై దాడి చేసే విధంగా సేవాలాల్, సంకీమాత, తుల్జాభవానీ, ధానూనాయక్ లాంటి పేర్లతో ప్రభుత్వాలను బెదిరించి ఆదివాసులకు చెందాల్సిన కేంద్ర, రాష్ట్ర నిధులను వాటి ఉత్సవాలకు నిర్లజ్జగా తరలిస్తున్నారు. ఉత్తర భారతదేశంలో అగ్రకులాల వారు నిర్వహించుకునే పండుగలను తమవిగా నిర్వహిస్తూ ఇక్కడి వారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. యావత్ ఆదివాసీ సమాజ ఆరాధ్య దైవాలైన ప్రకృతి వనదేవతలు, ఆదివాసీ ఆడబిడ్డలైన సమ్మక్క -సారలమ్మ జాతర కమిటీలలో కూడా ప్రవేశించగలిగేంత నిర్ణయాత్మకశక్తిగా మారారు. అందుకే చట్టబద్ధత లేని లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని తెలంగాణ రాష్ట్రంలోని తొమ్మిది తెగలకు చెందిన ఆదివాసీ ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగ సంఘాలు డిసెంబర్ 9, 2017న లక్షలాదిగా హైదరాబాద్ తరలివచ్చి తమ నిరసన తెలియచేశాయి. యావత్ తెలంగాణ సమాజం మద్దతు పొందాయి.
ఆ తర్వాత కూడా ఆదివాసీ సంఘాలు ప్రజాసామ్యయుతంగా పలు పోరాటాలు చేస్తూ వచ్చాయి. 2018లో చలో ఢిల్లీ పేరుతో ఆదివాసీ ప్రతినిధి బృందంతో ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. భారత రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాలు సమర్పించాయి. 2019లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని రాంలీలా మైదానంలో దాదాపు 9 తెగల ఆదివాసీ ప్రజానీకం లక్ష మందితో నిర్వహించింది. నాటి ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాబురావు ఆధ్వర్యంలో ఈ తొమ్మిది తెగల ప్రతినిధులు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలిశారు. సుగాలీ, లంబాడా, బంజరాలను భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 342(2) ప్రకారం కలపలేదని అన్ని ఆధారాలను సమర్పించారు. దీని తరువాత కూడా అనేకసార్లు కేంద్ర ప్రభుత్వంలోని హోంశాఖామాత్యులు, గిరిజన సంక్షేమ, న్యాయశాఖ మంత్రులకు నివేదికలు అందజేశారు. అయినా నేటికీ న్యాయం జరగలేదు.
తెలంగాణ రాష్ట్రంలోనైనా ఆదివాసులు ఆత్మగౌరవంతో భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా అభివృద్ధి చెందుతారని ఆశపడితే, ఇక్కడా భంగపాటే ఎదురైంది. ఆదివాసులకు దక్కాల్సిన న్యాయమైన 4శాతం రిజర్వేషన్‌తో పాటు, 5వ షెడ్యూల్ చట్టాలను కఠినంగా అమలుచేసి ఆదివాసులను రక్షించాల్సిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సమస్య తీవ్రతపై స్పందించకుండా కాలం గడుపుతున్నాయి. ఇదే కొనసాగి, రాబోయే కాలంలో మరికొన్ని సంచార కులాలు ఎస్టీ జాబితాలో చేరితే యావత్ ఆదివాసీ తెగల మనుగడే ప్రశ్నార్థకమవుతుంది.
ఈ భయాల నేపథ్యంలో ఆదివాసీ తెగలలోని ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, ప్రజానీకం, ఆదివాసీ సంఘాలతో పాటు, అన్ని పార్టీల ఆదివాసీ ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని డిసెంబర్ 9, 2025నాడు ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్లమల ఏజెన్సీ ప్రాంతాలలోని గూడేల నుంచి తొమ్మిది ఆదివాసీ తెగలు ‘చలో రాజ్‌భవన్’ నిర్వహిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మకు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించాలని యోచన చేస్తున్నాయి. అలాగే లంబాడీలను ఎస్టీ జాబితాల నుంచి తొలగించుటకై సెప్టెంబర్ 28న జరిగే ‘ఆదివాసీల ధర్మయుద్ధం మహాసభ’ను జయప్రదం చేయాలని సమస్త ఆదివాసీ ప్రజానీకానికి పిలుపునిస్తున్నాం.
చుంచ రామకృష్ణ
ఆదివాసీ 9తెగల ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షుడు
ఇవి కూడా చదవండి..
అలాంటివి మాట్లాడుకోలేదు.. నాటో నిర్లక్ష్యాన్ని తప్పుపట్టిన భారత్..
భారత్‌పై సుంకాలు.. రష్యాపై తీవ్ర ప్రభావం: నాటో చీఫ్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి