Share News

20 Years of RTI Act: సమాచార స్వేచ్ఛతోనే నిజమైన ప్రజాస్వామ్యం

ABN , Publish Date - Oct 12 , 2025 | 02:57 AM

భారత ప్రజాస్వామ్య చరిత్రలో 2005 సంవత్సరం ఒక మైలురాయి. ఆ ఏడాది అక్టోబర్‌ 12న అమల్లోకి వచ్చిన సమాచార హక్కు (సహ) చట్టం దేశ పాలనను ‘పారదర్శకత’ వైపు మళ్లించింది. ఆర్టీఐ కేవలం ఒక పరిపాలనా చట్టం కాదు. పారదర్శకత, బాధ్యతాయుత...

20 Years of RTI Act: సమాచార స్వేచ్ఛతోనే నిజమైన ప్రజాస్వామ్యం

భారత ప్రజాస్వామ్య చరిత్రలో 2005 సంవత్సరం ఒక మైలురాయి. ఆ ఏడాది అక్టోబర్‌ 12న అమల్లోకి వచ్చిన సమాచార హక్కు (సహ) చట్టం దేశ పాలనను ‘పారదర్శకత’ వైపు మళ్లించింది. ఆర్టీఐ కేవలం ఒక పరిపాలనా చట్టం కాదు. పారదర్శకత, బాధ్యతాయుత పాలన, ప్రజా భాగస్వామ్యం అనే ప్రజాస్వామ్య మూలాలను బలపరిచే ఉద్యమంగా నిలిచింది. ఈ చట్టం ప్రజాస్వామ్యానికి నూతన శ్వాసనిచ్చిన సంస్కరణ. అధికారాల తలుపులు తెరిచి ప్రజల చేతుల్లో పౌరాధికారం పెట్టిన మానవ హక్కుల విప్లవం. ఇప్పుడు ఈ చట్టం ఇరవై ఏళ్లు పూర్తవుతున్న వేళ... దీని ప్రయాణం ఎలా ఉందో, ప్రపంచంలోని అత్యంత పారదర్శక దేశాలతో పోలిస్తే మనం ఎక్కడ ఉన్నామో పరిశీలించడం అవసరం.

భారతదేశం ఆమోదించిన సహ చట్టం ప్రపంచంలో అత్యంత ప్రజానుకూలమైన చట్టాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇది సమయపాలనతో సమాచారం ఇవ్వడం, ముందుగానే వివరాలు ప్రకటించడం, స్వతంత్ర సమాచార సంఘాలు ఏర్పాటు చేయడం వంటి ముఖ్య లక్షణాలను కలిగి ఉంది. ఇరవై ఏళ్లలో లక్షలాది పౌరులు ఈ చట్టం ద్వారా అవినీతిని వెలికితీశారు, సంక్షేమ పథకాలలో లోపాలను సరిచేశారు, ప్రభుత్వ బాధ్యతను పెంచారు. ప్రారంభ దశలో సహ చట్టం ప్రజల్లో ఆశను రగిలించింది. సాధారణ పౌరుడు కూడా ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నించగలిగాడు. గ్రామ పంచాయతీ నుంచి కేంద్ర మంత్రిత్వ శాఖ వరకు, గ్రామ ప్రథమ పౌరుడు నుంచి దేశ ప్రధానమంత్రి వరకు ‘ప్రజల సొత్తు’ అనే అవగాహన వ్యాపించింది. కానీ రెండు దశాబ్దాల తర్వాత, ఆ కాంతి కొంత మందగించింది. కేంద్ర, రాష్ట్ర సమాచార సంఘాల్లో నియామకాల ఆలస్యం, నిర్ణయాల తడబాటు, లక్షలాది కేసుల పెండింగ్ వంటివి చట్టం అమలుపై మబ్బుల్లా కమ్మాయి.

ఇటీవల విడుదలైన ఒక నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 4 లక్షలకు పైగా ఫిర్యాదులు పరిష్కారం కోసం రాష్ట్ర సమాచార కమిషన్ల వద్ద వేచి ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒక ఆర్టీఐ ఫిర్యాదు విచారణకు రావడానికి దశాబ్దాల సమయం పడుతోంది. తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఇప్పుడున్న ఫిర్యాదులను పరిష్కరించేందుకు దాదాపు 30 సంవత్సరాలు పడుతుందని ‘సార్థక్ నాగరిక సంఘటన్’ అనే స్వచ్ఛంద సంస్థ మూడు రోజుల క్రితం నివేదిక విడుదల చేసింది. సహ చట్టం అమలులో ప్రజలకు మద్దతుగా ఉండాల్సిన సమాచార కమిషన్ల బాధ్యతారాహిత్యానికి ఈ నివేదిక ఉదాహరణగా నిలుస్తోంది. చట్టం ఉన్నా, వ్యవస్థల్లో చలనం లేనట్లు సూచిస్తోంది. పౌరుడు అడిగే ప్రతి సమాచారానికి సమాధానమివ్వాలన్న బాధ్యత ప్రభుత్వానికి ఉన్నా, అది ఆచరణలోకి రాకపోవడం బాధాకరం.


సమాచార హక్కు ఉద్యమం.. ప్రపంచవ్యాప్త ప్రజాస్వామ్య స్ఫూర్తిలో భాగం. యునెస్కో 2024 నివేదిక ప్రకారం, 139 దేశాలు ఇప్పటికే తమ రాజ్యాంగం లేదా చట్టాల ద్వారా ప్రజలకు సమాచారం పొందే హక్కు కల్పించాయి. స్వీడన్ 1766లోనే ‘ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్ యాక్ట్’ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పత్రాలు పరిశీలించే హక్కు ఇచ్చింది. అమెరికా 1966లో ‘ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్’ ద్వారా సమాచార నిరాకరణపై న్యాయ సమీక్షకు వీలు కల్పించింది. బ్రిటన్ (2000లో), మెక్సికో, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా వంటి దేశాలు అవినీతి నిరోధం, ప్రజా భాగస్వామ్యాన్ని బలపరచేందుకు ఇలాంటి చట్టాలు తీసుకువచ్చాయి. ముఖ్యంగా డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్, సింగపూర్ వంటి దేశాలు సంవత్సరాలుగా ‘అవినీతి లేని పరిపాలన’, ‘పౌరాభిప్రాయ బలమైన వ్యవస్థల’తో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. డెన్మార్క్‌లో ప్రభుత్వ నిర్ణయాలు పూర్తిగా బహిరంగంగా, అత్యంత పారదర్శకంగా ఉంటాయి. ప్రతి మంత్రిత్వ శాఖ తమ డేటా, ఖర్చులు, విధాన నిర్ణయాలకు సంబంధించిన సమస్త సమాచారం ప్రజలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతుంది. ఫిన్లాండ్‌లో సమాచార హక్కు చట్టం అమలును రాజ్యాంగ ప్రమాణంగా పరిగణిస్తారు. న్యూజిలాండ్, సింగపూర్‌లో ఫిర్యాదుల పరిష్కారం వేగంగా జరుగుతుంది; విచారణల్లో ఆలస్యం ఉండదు. పాలనలో దాపరికానికి చోటులేదు అన్న భావన ఈ దేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. వీరి విజయాలతో ఒక విషయం మనం గుర్తించాలి. పారదర్శకత అనేది కేవలం చట్టంతో కాదు, నిబద్ధతతో వస్తుంది. సమాచార హక్కు అమలు చేసే అధికారులు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా ఉండాలి. ప్రజల అభ్యర్థనలను ఆలస్యం లేకుండా పరిష్కరించగలిగే వ్యవస్థ నిర్మించాలి.

భారతదేశం ఇప్పటికీ ప్రజాస్వామ్యంలో బలమైన మూలాలు కలిగిన దేశమే. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రధానమంత్రి నుంచి గ్రామ సర్పంచి వరకు ప్రజల ఎదుట బాధ్యత వహించే వ్యవస్థ ఏర్పడింది. అయితే ఈ వ్యవస్థ అమలులో కొన్ని లోపాలు ఉన్నాయి. సమాచార సంఘాల నియామకాలు ఆలస్యం; అప్పీలు, ఫిర్యాదులు సంవత్సరాల తరబడి పెండింగ్; కొన్ని విభాగాల్లో డేటా డిజిటల్‌గా అందుబాటులో లేకపోవడం; స్వచ్ఛందంగా ప్రకటించాల్సిన సమాచారాన్ని అందుబాటులో ఉంచకపోవడం; అధికారుల నిర్లక్ష్యంపై తగిన చర్యలు లేకపోవడం వంటి లోటుపాట్లు... ప్రజల చేతిలో బ్రహ్మాస్త్రంగా పేర్కొనబడే ఆర్టీఐ చట్టాన్ని బలహీనపరుస్తున్నాయి. ఈ బలహీనతలను అధిగమిస్తే.. పారదర్శకత, అవినీతి రహిత పాలనలో భారతదేశం ప్రపంచ అత్యుత్తమ దేశాలలో ఒకటిగా నిలుస్తుంది.


ఇరవై ఏళ్ల ప్రయాణం తర్వాత కూడా, సమాచార హక్కు చట్టం భారత ప్రజాస్వామ్యంలో అత్యంత ధైర్యవంతమైన సంస్కరణగా నిలుస్తోంది. ప్రజా స్వామ్య భవిష్యత్తు కేవలం ఓటు హక్కులోనే కాదు, తెలుసుకునే హక్కులోనూ ఉంది. సమాచారం నిజంగా ప్రజలదైతే పాలన నిజమైన ప్రజాసేవగా మారుతుంది. అదే భారత ప్రజాస్వామ్యానికి శాశ్వత బలం. ఈ చట్టం భారత ప్రజాస్వామ్యానికి వెలుగు చూపిన దీపం. కానీ ఆ వెలుగును నిలబెట్టుకోవడం పౌరులుగా మన బాధ్యత. సమాచార స్వేచ్ఛ ఉన్న దేశమే నిజమైన ప్రజాస్వామ్యం కలిగిన దేశం. మన ప్రజాస్వామ్యం మరో రెండు దశాబ్దాలు మరింత బలంగా ఉండాలంటే ‘సమాచారం ప్రజల హక్కు’ అని ప్రతి పౌరుడూ భావించాలి.

ఆచార్య బాలకిస్టారెడ్డి వుంధ్యాల

అధ్యక్షుడు, తెలంగాణ ఉన్నత విద్యామండలి

(నేటితో సమాచార హక్కు చట్టానికి 20 ఏళ్లు)

ఇవి కూడా చదవండి:

Prashant Kishore: రాహుల్ తరహాలోనే తేజస్వి ఓడిపోతారు.. ప్రశాంత్ కిశోర్ జోస్యం

Mamata Banerjee: బెంగాల్ సీఈఓకు మమతా బెదిరింపులు.. ఈసీ సీరియస్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 12 , 2025 | 02:57 AM