Nagula Chavithi: ఇంతకీ నాగుల చవితి ఎప్పుడు.. పూజకు శుభ ముహూర్తం?
ABN , Publish Date - Oct 24 , 2025 | 10:11 AM
ఏడాదిలో అత్యంత పవిత్రమైన మాసాలు ఉన్నా.. కార్తీక మాసం విశిష్టతే వేరు. ఈ మాసంలో అన్ని రోజులు శుభ దినాలే. ఈ నెలలో వచ్చే పండగల్లో అత్యంత ముఖ్యమైనది నాగుల చవితి.
ఏడాదిలో అత్యంత పవిత్రమైన మాసాలు ఉన్నా.. కార్తీక మాసం విశిష్టతే వేరు. ఈ మాసంలో అన్ని రోజులు శుభ దినాలే. ఈ నెలలో వచ్చే పండగల్లో అత్యంత ముఖ్యమైనది నాగుల చవితి. మరొకటి నాగ పంచమి. నాగుల చవితి వెళ్లిన మరునాడే ఈ నాగ పంచమి వస్తుంది. ఈ రెండు రోజులు శ్రీవల్లిదేవ సేన సమేత శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారిని భక్తులు ఆరాధిస్తారు. నాగుల పుట్టలో పాలు పోస్తారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో అభిషేకాలు సైతం నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారి ఆలయాలకు పోటెత్తుతారు. ఏపీలోని శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారి పుణ్య క్షేత్రాలు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మోపిదేవి, సింగరాయపాలెంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడతాయి.

నాగులకు.. అంటే పాములకు పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉందన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ మాసంలో శుక్ల పక్షం చవితి తిథి రోజున ఈ నాగుల చవితి వస్తుంది. ఈ రోజు నాగ దేవతలను పూజించడం ద్వారా భక్తులు సర్ప భయాలను తొలగించు కోవచ్చు. అలాగే సంతాన సిద్దితోపాటు కుటుంబంలో సుఖ సంతోషాలను సైతం పొందవచ్చని శాస్త్ర పండితులు పేర్కొంటారు.
నాగుల చవితి..శుభ ముహూర్తం
ఈ ఏడాది నాగుల చవితి పండగ అక్టోబర్ 25వ తేదీన జరుపుకుంటారు. చవితి తిథి 2025, అక్టోబర్ 25 వ తేదీ తెల్లవారుజామున 1.19 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్ 26వ తేదీ తెల్లవారుజామున అంటే.. 3.48 గంటలకు ముగుస్తుంది. ఇక నాగ దేవతలకు పూజకు శుభ ముహూర్తం అక్టోబర్ 25వ తేదీ ఉదయం 8.59 గంటల నుంచి 10.25 గంటల వరకు ఉంటుందని పండితులు చెబుతున్నారు. అంటే దాదాపుగా రాహు కాలంలో నాగ దేవతలను పూజించాల్సి ఉంటుంది.
నాగుల చవితి రోజు.. భక్తులు ఏం చేయాలి..
తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పుట్టలుంటాయి. అలాగే పలు దేవాలయాల్లో నాగ ప్రతిమలు ఉంటాయి. పుట్టల్లో పాలు పోయ్యాలి. ఇక దేవాలయాల్లోని ప్రతిమల ముందు ఆవు పాలు ఉంచాలి. తులసి దళాలు, పువ్వులను స్వామి వారికి సమర్పించాలి. అలాగే పంచామృతం నైవేద్యంగా అందించాలి. స్వామి వారికి పాలు సమర్పించడం వల్ల సర్ప దోషాలు తొలగి పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
స్వామి వారికి నైవేద్యంగా ఏం సమర్పించాలంటే..
ఇక స్వామి వారికి నువ్వులతో చేసిన చిమ్మిలి ఊండతోపాటు బెల్లం, పెసరపప్పు, చలివిడి నైవేద్యంగా సమర్పించాలి. స్వామి వారికి ఎర్రని పూలతో పూజించాలి.
ఈ రోజు..
నాగుల చవితి, నాగ పంచమి రోజు సుబ్రహ్మణ్యాష్టం 8 సార్లు చదవాలి. అదే విధంగా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం సైతం ఈ రోజు పారాయణం చేయడం వల్ల భక్తులు మంచి ఫలితాలను అందుకుంటారని శాస్త్ర పండితులు వెల్లడిస్తున్నారు.
ఈ దోషాలు తొలుగుతాయి..
ఇక నాగుల చవితి పండగకు సంబంధించి పురాణ కథలు చాలనే ఉన్నాయి. ముఖ్యంగా నాగ దేవతను పూజించడం ద్వారా సర్ప దోషం తొలుగుతుందని భక్తులంతా బలంగా విశ్వసిస్తారు.
1)
శుక్ల పక్షం చవితి తిథి రోజు నాగ దేవతను ఆరాధించడం వల్ల.. సర్ప దోష నివారణ కలుగుతుంది.
2)
సంతానం లేని వారు.. ఈ రోజు సర్ప దేవతలను పూజించాలి. తద్వారా సంతాన భాగ్యం కలుగుతుంది. దీంతో కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి.
3)
పల్లె ప్రాంతాల్లో రైతులు.. తమ పంటలను రక్షించుకునేందుకు నాగ దేవతలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. పంటలు సమృద్ధిగా పండాలని.. అలాగే వ్యవసాయ భూమి సారవంతం కావాలని వారు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తారు. దీంతో పంటలు అధిక దిగుబడికి, పశు పక్ష్యాదులకు నాగదేవత రక్షణనిస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు.
4)
ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా జీవితంలో సుఖ శాంతులు కలుగుతాయి. అలాగే సర్ప దోషంతోపాటు ఇతర వ్యాధులకు సంబంధించిన దోషాలు సైతం తొలుగుతాయని భక్తులంతా భావిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బస్సు ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ రియాక్షన్
కార్తీక మాసంలో ఈ నాలుగు ఆచరిస్తే..
For More Devotional News And Telugu News