Share News

Ayyappa Temple: 18 మెట్లు.. 23 ఏళ్లు.. నిరాటంకంగా కొనసాగుతున్న పూజలు

ABN , Publish Date - Dec 03 , 2025 | 09:43 AM

నగరంలోని శ్రీనగర్‌కాలనీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అయ్యప్ప ఆలయం 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నిత్యం ఈ ఆలయాని భక్తులు పెద్దసంఖ్యలో విచ్చేసి పూజలందుకుంటున్నారు. ముఖ్యంగా కార్తీక మాసం, మండల, జ్యోతి దీక్షల సమయంలో భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది.

Ayyappa Temple: 18 మెట్లు.. 23 ఏళ్లు.. నిరాటంకంగా కొనసాగుతున్న పూజలు

- అష్టకలశాభిషేకం, లక్ష పుష్పార్చన

- శబరిమల తరహాలో తిరుభావరణం, అయ్యప్ప గజారోహణం

హైదరాబాద్: స్వామియే శరణమయ్యప్ప అంటే చాలు ఎంతటి ఆపదైనా ఇట్టే మాయమవుతుంది అన్నది భక్తుల విశ్వాసం. అందుకే అయ్యప్పను కొలిచేవారు కార్తీక మాసం వచ్చిందంటే చాలు దీక్ష తీసుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో మండల కాలం పూజలు నిర్వహించి నెత్తిన ఇరుముడి కట్టుకొని శబరియాత్రకు బయలు దేరుతుంటారు. ఈ మండల కాలం ఓ విధంగా అయ్యప్ప దీక్షాపరులకు పండుగ కాలం అని చెప్పొచ్చు.


ఇలాంటి వేడుకలను శబరిమల తరహాలో నిర్వహిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక ఉత్సవాలను నిర్వహిస్తున్న శ్రీనగర్‌కాలనీ వేంకటేశ్వరస్వామి ఆలయ(Srinagar Colony Venkateswara Swamy Temple) ప్రాంగణంలోని అయ్యప్ప ఆలయం 23 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రతీ మండల కాలంలో ప్రతీ రోజు విశేష పూజలతోపాటు అష్టకలశాభిషేకం, లక్ష పుష్పార్చన, గజారోహణం వంంటి ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహిస్తోంది. ప్రతీ రోజు గణపతి హోమం, అభిషేకం, సాయంత్రం పడిపూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.


ప్రతీ రోజు అన్నదానం..

అయ్యప్ప స్వామి ఆలయంలో నిత్యం వచ్చే అయ్యప్ప దీక్ష పరులతో పాటు భక్తులకు ఇక్కడ నిత్యం అన్నదానం, సాయంత్రం అల్పాహారం అందిస్తుంటారు. 1999లో సుమారు 30మందితో మొదలైన అన్నదానం అదే యేడాది 50 మంది వరకు భక్తులు వచ్చే వారు. తొలి యేడాది స్పందన బాగుండడంతో అన్నదానంను ప్రతి యేటా కొనసాగించాలని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస్‌ గురుస్వామి భావించారు. ఈ మేరకు 2000లో మండల పూజ ఉత్సవాల్లో అన్నదానం నిర్వహించేందుకు ఏర్పాట్లు జరిగాయి.


city5.jpg

వంద, రెండు వందల నుంచి వెయ్యి మందికి చేరారు. మాల వేసుకున్న ఉద్యోగులు, విద్యార్థులకు ఇక్కడి అన్నదానం వరంలా మారింది. అనతి కాలంలోనే ఈ కార్యక్రమానికి ప్రాచుర్యం కలిగింది. 2008 నుంచి ఆలయంలో సుమారు నాలుగు వేల మంది అయ్యప్పలు భిక్ష స్వీకరించేవారు. అంతేగాకుండా సాధారణ భక్తులు ఇక్కడ అన్నదానంను అయ్యప్పస్వామి ప్రసాదంగా స్వీకరిస్తుంటారు. ప్రతీ రోజు ఆరు క్వింటాళ్ల బియ్యం, క్వింటా పప్పు, క్వింటా కూరగాయలు వంటల్లో ఉపయోగిస్తున్నారు. ఒక కూర, పప్పు, సాంబరు, మజ్జిగ అందిస్తున్నారు.


ఇక సాయంత్రం అయితే ఆకు మీద కనీసం మూడు రకాల అల్పాహారాలు వడ్డిస్తుంటారు. ఉదయం, సాయంత్రం కిచెన్‌లో సుమారు 15 మంది వంటవాళ్లు పనిచేస్తుండగా వడ్డించేందుకు సుమారు 20 మంది వరకు సేవలందిస్తుంటారు. ఇక ముడిసరుకుల కొనుగోలు, ఇతరత్రా కార్యక్రమాలను సేవా సమితి నిర్వాహకులు సమీక్షిస్తుంటారు. ప్రతీ రోజు వంటి మామిడి నుంచి కూరగాయలు తెప్పించడం దగ్గర నుంచి నాణ్యమైన సరుకుల కొనుగోలు వరకు వీరే పర్యవేక్షిస్తుంటారు.


మేళవిస్తున్న కేరళ సంప్రదాయం

ప్రస్తుతం ఆలయంలో మండల పూజలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు, కేరళ సంప్రదాయాలను అనుసరించి ఇక్కడ పూజాధికాలు జరుగుతుంటాయి. మండల దీక్షలు మొదలైన 20 రోజులకు అష్టకలశాభిషేకం నిర్వహిస్తారు. ఈనెల 7న ఉదయం నుంచి 108 కలశాలకు వేద మంత్రాల మధ్య కలశ పూజలు నిర్వహించిన అనంతరం దీక్ష పరులు నెత్తిన కలశాలు పెట్టుకొని ప్రదక్షిణలు చేసి ఆ నీటితో అయ్యప్ప మూల విరాట్‌కు అభిషేకం చేస్తారు. కేరళ వాయిద్యాల మధ్య ఈ తంతు నిర్వహిస్తారు. మండల పూజ ముగిసే ముందర అయ్యప్పకు వివిధ రకాల లక్ష పుష్పాలు తీసుకువచ్చి పూజలు చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పూజాధికాలు జరుగుతాయి.


city5.3.jpg

ప్రతిష్ఠాత్మకం గజారోహణం..

ఆలయంలో అయ్యప్ప గజారోహణంను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 14న ఈ ఉత్సవం జరగనున్నది. శబరిమలలో ప్రతీ యేట మకరజ్యోతి రోజున అయ్యప్పకు పందల రాజ్యం నుంచి తిరువాభరణం తీసుకువచ్చి స్వామి వారికి అలంకరిస్తారు. ఇది అయ్యప్ప భక్తులకు పెద్ద వేడుక. ఇదే తరహాలో ఇక్కడ గజారోహణం రోజున అయ్యప్ప తిరువాభరణం తీసుకువచ్చారు. పెద్ద పెట్టలో స్వామి వారి నగలను పెట్టి జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌.5లో పూజలు నిర్వహిస్తారు. అనంతరం పెద్ద వేడుకగా ఆధ్యాత్మిక నినాదాల మధ్య తిరువాభరణ ఊరేగింపు నిర్వహిస్తారు.


శబరిమల తరహాలో ఇక్కడ కూడా ఆభరణాలను స్వామి వారికి అలంకరించే వరకు ఆకాశంలో గద్ద తిరుగుతుంటుంది. అయ్యప్ప ఆభరణాలు అలంకరించిన అనంతరం పడిపూజా మహోత్సవం నిర్వహిస్తారు. ఈ తంతు నిర్వహించేందుకు శబరిమల నుంచి ప్రత్యేకంగా తంత్రీలు వస్తారు. ఇదే రోజు సాయంత్రం కేరళ సంప్రదాయ నృత్యాలు, విన్యాసాల మధ్య అయ్యప్ప గజారోహణం చేస్తారు. అయ్యప్ప ఉత్సవ విగ్రహాన్ని ఏనుగు అంబారిపై పెట్టి శ్రీనగర్‌కాలనీ, ఇందిరానగర్‌, కృష్ణానగర్‌, యూసు్‌ఫగూడ, ఎల్లారెడ్డిగూడ మీదుగా ఊరేగింపు నిర్వహిస్తారు.


ఈసారి మరింత వైభవంగా ఉత్సవాలు

ఈ యేడాది అయ్యప్ప మండల పూజలు ఘనంగా జరుగుతున్నాయి. అష్టకలశాభిషేకం, గజారోహణం, లక్ష పుష్పార్చనను మరింత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. శ్రీనగర్‌కాలనీ అయ్యప్ప అన్నదానం అంటే నగరంతోపాటు చుట్టూ ఉన్న ప్రాంతాల వారికి కూడా తెలుసు. గజారోహణంకు వివిధ ప్రభుత్వ రంగాలకు చెందిన అధికారులు తోడ్పాటును అందిస్తున్నారు.

- సిపిరి అర్జున్‌యాదవ్‌, ధర్మకర్తల మండలి చైర్మన్‌


ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం

మండల దీక్షలో ప్రత్యేక పూజలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, సంప్రదాయకంగా నిర్వహిస్తున్నాం. ఆధ్యాత్మిక భావనకు పెద్దపీట వేస్తూ అయ్యప్ప భజనలు, పడిపూజలు జరుపుతున్నాం. గజారోహణంలో సుమారు 15 మంది భక్తులకు పైగా హాజరవుతారు. ఈ తంతు కోసం శబరి నుంచి ప్రత్యేకంగా తంత్రీలను రప్పిస్తాం. అయ్యప్పస్వామి ఆలయం అన్నదానంను అత్యంత ప్రతిష్ఠాత్మంగా నిర్వహిస్తున్నాం. ఎంతోమంది దాతలు ఈ అన్నదానంకు సహకరిస్తున్నారు.

- శ్రీనివాస్ శర్మ, ఆలయ ఈవో


ఈ వార్తలు కూడా చదవండి..

ఎన్నికల నిర్వహణకు డబ్బులేవి?

పట్టుబట్టి.. మంజూరు చేయించి...

Read Latest Telangana News and National News

Updated Date - Dec 03 , 2025 | 09:43 AM