Janagama: శుభకార్యానికి వచ్చి మృత్యుఒడికి..
ABN , Publish Date - May 23 , 2025 | 08:37 AM
ఓ విద్యార్థి.. విద్యుదాఘాతంతో మృతిచెందిన విషాద సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో చోటుచేసుకుంది. హైదరాబాద్ ముషీరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం శుభకార్యంలో పాల్గొనేందుకు జనగామ జిల్లా బచ్చన్నపేటకు వెళ్లింది. అయితే.. అక్కడ విద్యుదాఘాతానికి గురై అసద్ (15) అనే విద్యార్థి మృతిచెందాడు.
- విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి
జనగామ: శుభకార్యానికి వచ్చిన విద్యార్థి విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన విషాదకర ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కేంద్రంలో గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్(Hyderabad)లోని ముషీరాబాద్‌కు చెందిన అలియాబేగం-దావూద్‌అలీ దంపతులకు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు ఎండీ అసద్ (15) ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. అసద్ తండ్రి గతంలోనే చనిపోగా, తల్లి కూలీనాలి చేసుకుని కుటుంబాన్ని పోషిస్తోంది.

బచ్చన్నపేటలో జరిగిన బంధువుల వివాహానికి అసద్‌తో కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం వచ్చారు. గురువారం సాయంత్రం స్నానం చేసేందుకు స్థానికంగా స్ర్కాప్‌షాపు నిర్వహిస్తున్న సమీప బంధువు జమాల్ షాపు వద్దకు అసద్ వెళ్లాడు. స్నానం చేసేందుకు ఉపక్రమించగా నీళ్లు రాకపోవడంతో భవనం పైకెక్కి డ్రమ్ముల్లో నీటిని పరిశీలిస్తుండగా పైన ఉన్న 11కేవీ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ అబ్దుల్ హమీద్ తెలిపారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బాబోయ్ మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
సీఎం ఓఎస్‌డీని అంటూ మెయిల్స్, కాల్స్
Read Latest Telangana News and National News