Hyderabad: కదిపితే కన్నీళ్లే.. మృతదేహాలు ‘గాంధీ’ మార్చురీకి
ABN , Publish Date - Feb 13 , 2025 | 08:23 AM
కుంభమేళాకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మల్లారెడ్డి(64), రవికుమార్(56), ఆనంద్‌కుమార్(47), ప్రసాద్(55), బాలరాజు(38), సంతోష్ కుమార్(47) మృతదేహాలకు జబల్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

- పంచనామా చేసి కుటుంబ సభ్యులకు అప్పగింత
కుంభమేళాకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏడుగురు నగరవాసుల మృతదేహాలను బుధవారం గాంధీ ఆస్పత్రికి తరలించారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆస్పత్రికి చేరుకున్నారు. ఎవరిని కదిపినా కన్నీటి పర్యంతమవుతున్నారు.
హైదరాబాద్: కుంభమేళాకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మల్లారెడ్డి(64), రవికుమార్(56), ఆనంద్‌కుమార్(47), ప్రసాద్(55), బాలరాజు(38), సంతోష్ కుమార్(47) మృతదేహాలకు జబల్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. తహసీల్దార్లు వాణి, జయశ్రీ, భీమయ్యగౌడ్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ బిర్జిస్ మున్సిఫా సమక్షంలో దాదాపు రెండు గంటలపాటు పంచనామా అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hi-Tech Jail: హైటెక్ జైలులో గంజాయి కలకలం..
శశికుమార్(37) మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. అతడి సోదరి యూఎస్ నుంచి గురువారం సాయంత్రం హైదరాబాద్ వచ్చిన తర్వాత అప్పగించనున్నారు. గాంధీ ఆస్పత్రికి వచ్చిన మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుల లగేజీలు మార్చురీవద్దే ఉండిపోయాయి. కుటుంబ సభ్యులు తీసుకెళ్లలేదని తెలిసింది. రూ. 50 లక్షలు చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని మృతుల కుటుంబాల సభ్యులు డిమాండ్ చేశారు.
మరణంలోనూ వీడని స్నేహం..
మల్లాపూర్: ఒకే కాలనీలో ఉండే నలుగురు మృతిచెందడంతో కార్తికేయనగర్(Karthikeyanagar)లో విషాదఛాయలు అలుముకున్నాయి. నాచారం చరిత్రలోనే ఇలాంటి విషాద ఘటన ఎప్పుడూ చోటుచేసుకోలేదని పలువురు వాపోయారు. వారంతా ఇరవై ఏళ్లుగా ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. వృత్తిరీత్యా కాలనీల్లోని ప్రతి కుటుంబానికి సుపరిచితులే. ఒకరు మెడికల్ షాపు నిర్వహిస్తుండగా, మరొకరు నగల వ్యాపారి, ఇంకొకరు పాల వ్యాపరంతోపాటు కాలనీ సంక్షేమ సంగం అధ్యక్షుడిగా దీర్ఘకాలంగా కొనసాగుతున్నాడు. నిత్యం వ్యక్తిగత జీవితాల్లో బిజీగా ఉన్నప్పటికీ వారానికి ఒక్కరోజైనా కలుసుకుంటారు.
వీలు చూసుకుని ఏడాదిలో ఒక్కసారైనా కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు వెళ్తుంటారు. కుంభమేళాకు వెళ్లాలని నెలరోజుల క్రితమే ప్లాన్ చేసుకున్నారు. వారి మిత్రుడు మల్లేష్ వ్యక్తిగత కారణాల వల్ల యాత్రకు వెళ్లలేదు. నలుగురు మిత్రులు ప్రాణాలు కోల్పోవడంతో మల్లేష్ కన్నీరు మున్నీరవుతున్నాడు. రవికుమార్ కుంభమేళాకు వెళ్లడానికి ముందూ కుమార్తె అంజలికి రోజే పెళ్లిచూపులు అయ్యాయని, ఈనెల 17 నిశ్చితార్థం, 25న పెళ్లిజరగాల్సిన ఇంట్లో విషాదం జరగడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు.
ఏడాది క్రితం సంతోష్ భార్య మృతి చెందండంతో 8 తరగతి చదివే వరుణ్, ఆరోతరగతి చదువుతున్న ప్రణీత్‌ను కీసరలోని హాస్టల్‌లో ఉంచి చదివిస్తున్నారు. తల్లి మరణించిన ఏడాదిలోపే తండ్రి మృతితో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. తండ్రి మృతితో వరుణ్ సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికంగా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చిన్న కుమారుడితోనే అంత్యక్రియలు పూర్తి చేశారు.
బాధాకరం
నగరవాసులు కుంభమేళాకు వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి. - వి. హనుమంతరావు, కాంగ్రెస్ నాయకుడు
ఈవార్తను కూడా చదవండి: Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన
ఈవార్తను కూడా చదవండి: 70 రకాల క్యాన్సర్లు ముందే గుర్తించొచ్చు
ఈవార్తను కూడా చదవండి: మేడారంలో ఘనంగా మినీ జాతర
ఈవార్తను కూడా చదవండి: సర్వే అంటూ ఇంట్లోకి చొరబడి దోపిడీ
Read Latest Telangana News and National News