Share News

Hyderabad: నగరంలో.. అల్లరిమూకల ఆగడాలు

ABN , Publish Date - Oct 22 , 2025 | 10:20 AM

గ్రేటర్‌ పరిధిలో రౌడీగ్యాంగ్‌లు, అల్లరిమూకలు ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. రోడ్డుపై వెళ్తున్న వారిని అడ్డగించి అకారణంగా దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కర్రలు, కుత్తులు, దేశవాళీ తుపాకులతో హల్‌చల్‌ చేస్తున్నాయి.

Hyderabad: నగరంలో.. అల్లరిమూకల ఆగడాలు

- మద్యం, గంజాయి మత్తులో పేట్రేగిపోతున్న ముఠాలు

- ప్రజలపై అకారణంగా దాడులు

- భయభ్రాంతులకు గురి చేస్తున్న గ్యాంగ్‌లు

- పోలీస్‌ ఉన్నతాధికారులు దృష్టి సారించాలంటున్న స్థానికులు

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ పరిధిలో రౌడీగ్యాంగ్‌లు, అల్లరిమూకలు ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. రోడ్డుపై వెళ్తున్న వారిని అడ్డగించి అకారణంగా దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కర్రలు, కుత్తులు, దేశవాళీ తుపాకులతో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆపై చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నాయి. చివరకు వారి అరాచకాలు పరాకాష్టకు చేరి పోలీసులను సైతం లెక్కచేయలేని పరిస్థితి నెలకొంది. వాటిపై పోలీస్‌ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.


- ఇటీవల అంబర్‌పేటలో అర్ధరాత్రి ఓ యువకుడిపై అల్లరి మూకలు అకారణంగా రాడ్లు, కర్రలతో దాడి చేశాయి. తీవ్ర గాయాలపాలైన యువకుడిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు ..నిందితులను గుర్తించారు.

- వనస్థలిపురంలో ఇటీవల అంబులెన్స్‌ను గ్యాంగ్‌ అడ్డుకున్నది. దారి ఇవ్వాలన్న డ్రైవర్‌పై దాడికి పాల్పడింది. అక్కడే ఉన్న ఓ సెక్యూరిటీ గార్డు అడ్డుకోవాలని యత్నిస్తే విచక్షణారహితంగా దాడి చేసింది.


- కేపీహెచ్‌బీ హైదర్‌నగర్‌ పరిధిలో ఓ వ్యక్తిపై ఓ పార్టీకి చెందిన స్థానిక నేతలు దాడికి పాల్పడ్డారు. వారంతా స్థానికంగా ఛోటమోటా లీడర్లుగా చెలామణి అయ్యే వ్యక్తులు కావడం విశేషం.

- రెండు రోజుల క్రితం కేపీహెచ్‌బీలో పరిధిలో ఓ పోకిరీల గుంపు ఇంట్లో ఉన్న దంపతులపై దాడికి పాల్పడింది. ఇంటి ముందు ఇష్టానుసారంగా బైక్‌లు పార్కింగ్‌ చేయొద్దు అన్నందుకు కొట్టింది.

- సనత్‌నగర్‌ పరిధిలో వాచ్‌మెన్‌పై ఓ పోకిరీ దాడికి పాల్పడ్డాడు. ఫోన్‌ అడిగితే ఇవ్వలేదన్న కోపంతో వాచ్‌మెన్‌ను తీవ్రంగా కొట్టాడు.


వారితో దోస్తీ..

ట్రై కమిషనరేట్‌లోని పలు ప్రాంతాల్లో శాంతి భద్రతలు పట్టుతప్పుతున్నాయనే ఆరోపణలున్నాయి. కొంతమంది పోలీసుల పనితీరు రోజురోజుకూ దిగజారిపోతుంది. పోకిరీలు, ఆకతాయిలు, రౌడీ మూకల ఆగడాలను అరికట్టాల్సిన పోలీసులు.. డబ్బు కోసం దాసోహం అన్నట్లుగా వారితో ములాఖాత్‌ అయి దొంగలు, నేరస్తులతో దోస్తీ కడుతూ అందినంతా దండుకుంటున్నారు. శాంతి భద్రతలు పట్టు తప్పుతున్నా, అరాచక శక్తులు రాజ్యమేలుతున్నా, నిందితులతో కలిసి కొంతమంది పోలీస్‌ అధికారులు దోపిడీలకు పాల్పడుతున్నా.. పోలీస్‌ బాస్‌లు మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.


రెండు వేల మంది రౌడీషీటర్స్‌

కేవలం హైదరాబాద్‌ సిటీ కమిషనరేట్‌ పరిధిలోనే సుమారు 1500 మంది రౌడీషీటర్స్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్‌ల గణాంకాలు తీసుకుంటే మరో 500 వరకు రౌడీషీటర్స్‌ ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ట్రై కమిషనరేట్స్‌ పరిఽధిలో అధికారికంగానే 2 వేల మంది రౌడీషీటర్స్‌ ఉన్నట్లు అంచనా. అనధికారికంగా 2,500 వరకు ఉండే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్ప తగ్గుదల.. మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఆ జిల్లాలో స్కూళ్లకు సెలవు..!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 22 , 2025 | 10:20 AM