Share News

TG News: బిహార్‌ నుంచి తుపాకులు తెచ్చి..

ABN , Publish Date - Aug 15 , 2025 | 10:28 AM

వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో బిహార్‌(Bihar) నుంచి తుపాకులు తెచ్చి అసాంఘిక శక్తులకు అమ్మాలని ప్రయత్నించిన పాత నేరస్థుడిని మల్కాజిగిరి ఎస్‌ఓటీ, చర్లపల్లి పోలీసులు కలిసి అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి 3 దేశీవాళి తుపాకులు, 10 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

TG News: బిహార్‌ నుంచి తుపాకులు తెచ్చి..

- పాత నేరస్థుడి అరెస్ట్‌,

- 3 తుపాకులు, 10 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో బిహార్‌(Bihar) నుంచి తుపాకులు తెచ్చి అసాంఘిక శక్తులకు అమ్మాలని ప్రయత్నించిన పాత నేరస్థుడిని మల్కాజిగిరి ఎస్‌ఓటీ, చర్లపల్లి పోలీసులు(Cherlapalli Police) కలిసి అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి 3 దేశీవాళి తుపాకులు, 10 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్‌ క్యాంపు కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ సుధీర్‌బాబు కేసు వివరాలు వెల్లడించారు.


ఇప్పటి వరకు రాచకొండ పరిధిలో అక్రమ ఆయుధాలు విక్రయిస్తున్న వారిని అరెస్ట్‌ చేసి 7 తుపాకులను స్వాధీనం చేసుకున్నామని, ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న 3 తుపాకులతో మొత్తం 10 తుపాకులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బిహార్‌ ఔరంగాబాద్‌ ప్రాంతానికి చెందిన శివ్‌ కుమార్‌ (32) పదోతరగతి వరకు చదువుకున్నాడు. ఇతడి తల్లిదండ్రులకు ఆరుగురు సంతానం కాగా ఇతడు పెద్ద కుమారుడు.. కుటుంబ పోషణ కోసం 2014లో సూరత్‌ వెళ్లి దుస్తుల కర్మాగారంలో పనిచేశాడు.


పెళ్లి చేసుకున్న తర్వాత 2022లో నగరానికి మకాం మార్చాడు. మేడిపల్లి శ్రీకర ఫర్టిలైజర్స్‌ సంస్థలో హమాలీ (దినసరి కార్మికుడు)గా పనిచేస్తున్నాడు. వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో గతంలో బిహార్‌ నుంచి గంజాయి చాక్లెట్లు తెచ్చి నగరంలో విక్రయించడం ప్రారంభించాడు. చర్లపల్లి పోలీసులు ఇతడిని అరెస్ట్‌ చేసి, జైలుకు తరలించారు. జైలు నుంచి వచ్చిన ఇతడు తుపాకులు అమ్మితే డబ్బు సంపాదించవచ్చని భావించిన ఇతడు బిహార్‌ వెళ్లి, అతడి బంఽధువు కృష్ణ పవార్‌ను సంప్రదించాడు.


city4.jpg

అతడి సహకారంతో బిహార్‌ నుంచి మూడు తపంచాలు (కంట్రీమేడ్‌ తుపాకులు), 10 రౌండ్ల బుల్లెట్లు కొనుగోలు చేసి నగరానికి తీసుకువచ్చాడు. నగరంలో ఉన్న అసాంఘిక శక్తులకు తుపాకులు విక్రయించేందుకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో ఎదురు చూస్తున్నాడు. తుపాకీ విక్రయంపై పక్కా సమాచారమందుకున్న మల్కాజిగిరి ఎస్‌ఓటీ, చర్లపల్లి పోలీసులు నిందితుడు శివ్‌ కుమార్‌ను అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి 3 తపంచాలు, 10 రౌండ్ల బుల్లెట్లు, మొబైల్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఓటీ డీసీపీ ఏ. రమణారెడ్డి, ఏడీసీపీ ఎన్‌ నర్సింహారెడ్డి, ఏసీపీ అంజయ్యతో పాటు పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


మూసీ పరీవాహక ప్రాంతాల్లో భద్రతా చర్యలు

ఇటీవల కురిసిన వర్షాలకు మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోందని, మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న పౌరులు, రైతులు అప్రమత్తంగా ఉం డాలని సీపీ సుధీర్‌బాబు సూచించారు. సీఎం ఆదేశాల మేరకు మూసీ పరీవాహక ప్రాతాల్లో నిరంతరం గస్తీ నిర్వహిస్తూ, ఎప్పటి కప్పుడు సమాచారం సేకరిస్తున్నామన్నారు. నిరంతరం నిఘా పెడుతూ ప్రజా భద్రతకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నిద్రిస్తున్న చిన్నారిని ఈడ్చుకెళ్లిన చిరుత!

Read Latest Telangana News and National News

Updated Date - Aug 15 , 2025 | 10:28 AM