Haryana Horror: పట్టపగలే దాడి.. రోడ్డుపై విచక్షణా రహితంగా.. నేలకొరిగినా కనికరించకుండా..
ABN , Publish Date - Dec 27 , 2025 | 01:34 PM
హర్యానాలోని పానీపత్‌లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బెట్టింగ్ కార్యకలాపాలకు అడ్డుపడినందుకు ఓ వ్యాపారిని స్థానిక యువత దారుణంగా హత్య చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: హర్యానాలోని పానీపత్‌లో తాజాగా ఓ వ్యక్తి భయానక రీతిలో హత్యకు గురయ్యాడు. హంతకులు అతడిని నడిరోడ్డుపై దారుణ రీతిలో హత్య చేశారు. ఖతీక్ బస్తీ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. మృతుడిని విక్రమ్ అలియాస్ విక్కీగా గుర్తించారు. కాలనీకి చెందిన యువత కొందరు ఈ దారుణానికి పాల్పడ్డారని కుటుంబ సభ్యులు తెలిపారు (Panipat Horrific Incident). విక్కీ పాత దుస్తుల వ్యాపారం చేస్తుండేవాడు.
శుక్రవారం సాయంత్రం 7 గంటల సమయంలో కొందరు వ్యక్తులు తల్వార్‌లు, సుత్తులతో వచ్చి బాధితుడిపై ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో, అతడు కుప్పకూలిపోయినా కనికరించక విచక్షణా రహితంగా పొడిచారు. రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఈ దారుణం జరగడం గమనార్హం. తొలుత వారు దాడి మొదలెట్టగానే బాధితుడు పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ అతడిని వెంటాడిన నిందితులు ఇష్టారీతిన దాడి చేశారు. అతడు మరణించాడని నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని రోడ్డు మధ్యలోకి ఈడ్చుకొచ్చారు. ఆ తరువాత నిందితుల్లో ఒకరు తన చేతిలోని కత్తిని గాల్లో హెచ్చరికగా ఊపి అక్కడి నుంచి వెళ్లిపాయారు.
పాత వివాదం వల్లే ఈ హత్య జరిగినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించే కొందరు స్థానిక యువతను విక్కీ గతంలో అడ్డుకునే ప్రయత్నం చేశారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విక్కీని హత్య చేసిన వారిలో కొందరు ఇతర హత్య కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. ఇక నిందితులు గతంలో కూడా ఓసారి విక్కీపై దాడి చేశారని అన్నారు. అతడి బైక్‌ను రోడ్డుపైనే తగలబెట్టారని అన్నారు.
మరోవైపు ఈ ఘటనపై స్థానిక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అసలు ఈ దాడి ఎందుకు జరిగిందో కూడా తెలియాల్సి ఉంది. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.
ఇవీ చదవండి..
సెల్‌ఫోన్ మాట్లాడుతూ..10 తులాల బంగారం బ్యాగు మరచిన మహిళ
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు