Haryana : ఎమ్మెల్యే చెంప పగులగొట్టిన వరద బాధితురాలు

ABN , First Publish Date - 2023-07-13T09:10:33+05:30 IST

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సామాన్యుల కష్టాలు వర్ణనాతీతం. ఎటు చూసినా, బురద నీటిలో, ఆహారం అందుబాటులో లేక, కనీసం తాగడానికి నీళ్లు లేక వారు ఎదుర్కొనే ఇబ్బందులు బాధాకరం. ఇలాంటి దుస్థితిలో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కాపాడవలసిన ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నందువల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయనే ఆవేదన వారిలో ఉంటుంది.

Haryana : ఎమ్మెల్యే చెంప పగులగొట్టిన వరద బాధితురాలు

న్యూఢిల్లీ : ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు సామాన్యుల కష్టాలు వర్ణనాతీతం. ఎటు చూసినా, బురద నీటిలో, ఆహారం అందుబాటులో లేక, కనీసం తాగడానికి నీళ్లు లేక వారు ఎదుర్కొనే ఇబ్బందులు బాధాకరం. ఇలాంటి దుస్థితిలో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కాపాడవలసిన ప్రజా ప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నందువల్లే తమకు ఈ కష్టాలు వచ్చాయనే ఆవేదన వారిలో ఉంటుంది. అలాంటి ఆవేదనను హర్యానాలోని ఓ వరద బాధితురాలు ఉగ్ర రూపంతో వెలిబుచ్చారు.

హర్యానాలోని ఘఘ్ఘర్ నది ఉప్పొంగి ప్రవహించడం వల్ల నివాస ప్రాంతాల్లోకి నీరు రావడంతో ప్రజలు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. ఘులా ప్రాంతంలో వరద పరిస్థితిని సమీక్షించేందుకు స్థానిక జననాయక్ జనతా పార్టీ ఎమ్మెల్యే ఈశ్వర్ సింగ్ బుధవారం వెళ్లారు. వరద బీభత్సంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను పరామర్శించారు. వరద బాధితులంతా తమ గోడు చెప్పుకుంటున్న సమయంలో ఓ బాధితురాలు తీవ్ర ఆగ్రహంతో ఎమ్మెల్యే చెంపపై కొట్టారు. తమ ప్రాంతంలోని చిన్న జలాశయం గట్టు తెగిపోవడంతో తమ ప్రాంతం వరదపాలైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కోపావేశంతో ఊగిపోతూ, ‘‘ఇప్పుడు ఎందుకు వచ్చావు?’’ అంటూ ఆ ఎమ్మెల్యే చెంపపై కొట్టారు. ఆ సమయంలో పోలీసులు కూడా అక్కడే ఉన్నారు.

ఎమ్మెల్యే సింగ్ మీడియాతో మాట్లాడుతూ, గ్రామంలో వరద పరిస్థితి గురించి ప్రజలు తనతో గట్టిగా మాట్లాడారని చెప్పారు. తాను తలచుకుంటే చిన్న జలాశయం గట్టు తెగిపోయి ఉండేది కాదని ఓ మహిళ తనతో అన్నారని చెప్పారు. ఇది ప్రకృతి వైపరీత్యమని, కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల ఈ విపత్తు సంభవించిందని తాను ఆ మహిళకు నచ్చజెప్పానని తెలిపారు. తనను ఆ మహిళ కొట్టారని, అయితే ఆమెను క్షమించానని, ఆమెపై చట్టపరమైన చర్యలేవీ తీసుకోబోనని చెప్పారు.

కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో ఘఘ్ఘర్ నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో చాలా గ్రామాలు జలమయమయ్యాయి. ఢిల్లీలో యమునా నది కూడా ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది.

ఇవి కూడా చదవండి :

Tomato: కిలో టమోటా రూ.60

IMD: నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు

Updated Date - 2023-07-13T09:10:33+05:30 IST