UP Convict Arrest: హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు పేరు, మతం మార్పు.. చివరకు..
ABN , Publish Date - Nov 29 , 2025 | 09:41 AM
హత్య కేసులో దోషిగా ఉన్న ఓ వ్యక్తిని మూడు దశాబ్దాల తరువాత యూపీ పోలీసులు అరెస్టు చేశారు. పెరోల్‌పై విడుదలై 36 ఏళ్లుగా పరారీలో ఉన్న అతడిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: చేసిన పాపానికి ఏదోక రోజు శిక్ష తప్పదు. కాస్త ఆలస్యమైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు ఏకంగా పేరు, మతం మార్చుకుని కొత్త జీవితం మొదలెట్టిన ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. దాదాపు 36 ఏళ్లుగా పరారీలో ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నారు (UP Murder Convict Arrest).
బరేలీకి చెందిన ప్రదీప్ సక్సేనాను ఈ కేసులో 1989లో కోర్టు దోషిగా తేల్చింది. సొంత సోదరుడిని పొట్టనపెట్టుకున్నాడని నిర్ధారించింది. అయితే పెరోల్‌పై విడుదలైన అతడు ఆ తరువాత పత్తా లేకుండా పారిపోయాడు. యూపీలోని మొరాదాబాద్ జిల్లాలో పేరు, మతం మార్చుకుని కొత్త జీవితం ప్రారంభించాడు. ట్రక్ డ్రైవర్ అబ్దుల్ రహీమ్‌గా స్థిరపడ్డాడు. పాత జీవితం ఇక ముగిసిందని అనుకున్నాడు. కానీ లైఫ్‌లో అతడు ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది (Jump the Parole).
అక్టోబర్ 16న అలహాబాద్ హైకోర్టు సక్సేనాను తమ ముందు ప్రవేశపెట్టాలని ఆదేశించింది. పోలీసులకు నాలుగు వారాల గడువు విధించింది. దీంతో, పోలీసులు రంగంలోకి దిగారు. పాత ఫైళ్ల దుమ్ముదులిపి సక్సేనాపై మళ్లీ దృష్టిపెట్టారు. మొదట అతడి మరో సోదరుడిని సంప్రదించారు. దీంతో, సక్సేనా జాడ తెలిసిపోయింది. అతడు మతం మార్చుకున్నాడని, ప్రస్తుతం బరేలీలోనే ఉన్నాడని సక్సేనా సోదరుడు పోలీసులకు తెలిపారు. దీంతో, వారు వలపన్ని అతడిని అరెస్టు చేశారు. విచారణలో అతడు అసలు నిజాన్ని ఒప్పుకున్నాడు. తానే సక్సేనా అని, మతం మార్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించినట్టు తెలిపాడు. తన సొంత సోదరుడి హత్య కేసులో దోషిగా తేలిన సక్సేనాకు కోర్టు అప్పట్లో యావజ్జీవ కారాగార శిక్ష విధించిందని పోలీసులు తెలిపారు. పెరోల్‌పై విడుదలయ్యాక పరారైన అతడిని దాదాపు 36 ఏళ్ల తరువాత అరెస్టు చేసినట్టు తెలిపారు.
ఇవీ చదవండి
మరో డిజిటల్ అరెస్ట్ స్కామ్.. దాదాపు రూ.32 కోట్లు నష్టపోయిన మహిళ
క్లాసుకు లేటుగా వచ్చినందుకు 100 గుంజిళ్ల శిక్ష.. బాలిక మృతి
మరిన్ని క్రైమ్, జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి