MP School Incident: ప్రిన్సిపల్‌కు 52 సార్లు సారీ చెప్పి.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Nov 30 , 2025 | 10:38 AM
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్కూలు మూడో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి యత్నించాడు. స్కూలుకు సెల్ ఫోన్ తీసుకొచ్చి ప్రిన్సిపల్ ఆగ్రహానికి గురైన అతడు ఆత్మహత్యకు యత్నించాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. స్కూలుకు మొబైల్ ఫోన్‌ను తీసుకొచ్చిన అతడికి ప్రిన్సిపల్ గట్టి వార్నింగ్ ఇవ్వడంతో తీవ్ర ఒత్తిడికి లోనైన విద్యార్థి బలవన్మరణానికి యత్నించాడు. రత్లామ్ జిల్లా డోంగ్రే నగర్‌లో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది (MP Class 8 Student Suicide Attempt).
స్కూలు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఆ విద్యార్థి స్కేటింగ్‌లో మంచి ప్రతిభావంతుడు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా పాల్గొన్నాడు. అయితే, ఇటీవల అతడు క్లాస్‌కు మొబైల్ ఫోన్‌ను తీసుకొచ్చాడు. తరగతి గదిలోనే వీడియోను రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. విషయం స్కూలు యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో వారు బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడేందుకు నిర్ణయించారు.
ఈ క్రమంలో విద్యార్థి తండ్రి స్కూలుకు వెళ్లారు. అదే సమయంలో బాలుడు ప్రిన్సిపల్ గదికి వెళ్లాడు. ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యింది. దాదాపు 4 నిమిషాల పాటు అక్కడే ఉన్న విద్యార్థి 52 సార్లు ప్రిన్సిపల్‌కు సారీ చెప్పాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌ను ముగించేస్తానని ప్రిన్సిపల్ వార్నింగ్ ఇచ్చినట్టు బాలుడు తెలిపాడు. సస్పెండ్ చేస్తానని, గతంలో సాధించిన మెడల్స్‌ను వెనక్కు తీసుకుంటానని కూడా ప్రిన్సిపల్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. దీంతో, వణికిపోయిన విద్యార్థి బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్లి మూడవ అంతస్తు నుంచి కిందకు దూకేశాడు. విద్యార్థి తండ్రి స్కూల్ వెయిటింగ్ ప్రాంతంలో వేచి చూస్తున్న సమయంలోనే కొద్ది మీటర్ల దూరంలో ఈ దారుణం జరిగింది. తీవ్రంగా గాయపడ్డ విద్యార్థిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది.
‘స్కూలుకు రావాలని నాకు మొదట ఫోన్ వచ్చింది. అక్కడికి వెళ్లాక నా బిడ్డ పడిపోయాడని ఎవరో చెప్పారు. ఆ తరువాత నేరుగా ఆసుపత్రికి రమ్మని తెలిపారు’ అని బాలుడి తండ్రి ప్రీతమ్ కటారా తెలిపారు. బాలుడు క్లాసుకు సెల్ ఫోన్ తీసుకొచ్చిన మాట వాస్తవమేనని సబ్‌డివిజనల్ మెజిస్ట్రేట్ చెప్పారు. ఇంతలోనే పరిస్థితి ఊహించని విధంగా చేయి దాటిపోయిందని అన్నారు. బాలుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే ముందు అతడి తండ్రితో మాట్లాడాలని తాము అనుకున్నట్టు స్కూలు యాజమాన్యం తెలిపింది. ఇక సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చదవండి
హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు పేరు, మతం మార్పు.. చివరకు..
మరో డిజిటల్ అరెస్ట్ స్కామ్.. దాదాపు రూ.32 కోట్లు నష్టపోయిన మహిళ
మరిన్ని క్రైమ్, జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి