TG News: చనిపోతున్నానంటూ భర్త వాట్సాప్ మెసేజ్..
ABN , Publish Date - Sep 20 , 2025 | 08:43 AM
భర్త ఆత్మహత్యాయత్నాన్ని భరించలేని భార్య అదే చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
- మృతదేహంకోసం గాలింపు చర్యలు
- అదే చెరువులో దూకి భార్య ఆత్మహత్యాయత్నం
- యాదాద్రిభువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఘటన
బీబీనగర్(యాదాద్రి భువనగిరి): భర్త ఆత్మహత్యాయత్నాన్ని భరించలేని భార్య అదే చెరువులో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హనుమకొండ(Hanumakonda) జిల్లా ఐనవోలు మండలం రాంనగర్ గ్రామానికి చెందిన బర్ల సురేందర్(36) హైదరాబాద్ రామంతాపూర్‌లోని ప్రగతినగర్‌లో నివాసం ఉంటూ ఐసీఐసీఐ బ్యాంకు హైటెక్ సిటీ మాదాపూర్ బ్రాంచిలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.
వారం రోజులుగా తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్న సురేందర్ ప్రవర్తనను గమనించిన భార్య సంధ్యారాణి ఇదే విషయాన్ని ఇతర కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆఫీ్‌సకు వెళుతున్నానని చెప్పి సురేందర్ ఆఫీ్‌సకు వెళ్లకుండా ఊబర్‌ను బుక్ చేసుకుని బీబీనగర్(Bibinagar) చెరువు కట్టపైకి చేరుకున్నాడు. కారును వెనుకకు తిప్పి పంపాడు. తాను చనిపోతున్నానని కుటుంబ సభ్యులకు వాట్సాప్ ద్వారా వాయిస్ మెసేజ్ పంపించాడు. హుటాహుటిన అక్కడికి వెళ్లిన కుటుంబ సభ్యులకు చెరువు కట్టపై షూ విప్పి అందులోనే మొబైల్ ఫోన్ ఉంచటంతో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అక్కడి ఆనవాళ్ల ద్వారా గుర్తించారు.

కుటుంబ సభ్యులు డయల్ 100కు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, అధికారులు అప్రమత్తమై ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ సిబ్బందిని రప్పించి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఓ వైపు గాలింపు కొనసాగిస్తుండగా భార్య సంధ్యారాణి భర్త లేని లోటును జీర్ణించుకోలేక తను చెరువులోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. అప్రమత్తమైన ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ సిబ్బంది చెరువులోకి దూకి ఆమె ప్రాణాలను కాపాడి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
ప్లీజ్ మమ్మీ.. నువ్వు చచ్చిపోతే నాకెవరుంటారు...
అప్పటి వరకు తన పక్కనే కూర్చున్న తల్లి సంధ్యారాణి పరుగెత్తుకుంటూ వెళ్లి చెరువులోకి దూకడంతో కళ్లారా చూసిన ఐదేళ్ల కుమారుడు సాకేత్ తట్టుకోలేకపోయాడు. నీటిలో మునిగిపోతున్న తల్లిని చూసి గుండెలవిసేలా రోధించాడు. పోలీసులు తల్లిని రక్షించి గట్టుపైకి తీసుకురాగానే తల్లి దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్లి గుండెలకు హత్తుకుని మమ్మీ... నువ్వు చచ్చిపోవద్దు ... నువ్వు అంటే నాకు చాలా ఇష్టం .. నువ్వు చచ్చిపోతే నాకు ఎవ్వరు ఉంటారమ్మా అంటూ రోదించిన తీరును అక్కడున్న వారందరిని కలిచివేసింది. పోలీసులు సంధ్యారాణికి కౌన్సెలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
అదంతా ఫేక్.. ఆ వార్తలను ఖండిస్తున్నా
Read Latest Telangana News and National News