Brothers Killed: అన్నదమ్ముల దారుణ హత్య, అట్టుడికిన గ్రామం
ABN , Publish Date - Oct 25 , 2025 | 05:40 PM
షాపులో కూర్చుని ఉన్న ఇద్దరు అన్నదమ్ముల్ని బయటకు లాగి పది మంది దుండగులు తీవ్రంగా దాడి చేశారు. వీరిలో కొందరు వారిపై దాడి చేస్తుండగా, మరికొందరు ఈ దాడిని వీడియో తీస్తూ గంతులు వేశారు. దాడితో గ్రామమంతా అట్టుడికిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్‌లోని షాహ్‌డోల్ జిల్లా, బల్బహారా గ్రామంలో జంట హత్యలు సంచలనం సృష్టించాయి. అక్టోబర్ 21న దీపావళి పండుగ సందర్భంగా దీపాలు వెలిగించుకుని ఆటో రిపేర్ షాపులో కూర్చున్న ఇద్దరు సోదరులపై 10 మంది అకస్మాత్తుగా దాడి చేశారు. ఈ దాడి మొత్తం కెమెరాలో రికార్డ్ అయింది. బాధితులు రాహుల్ తివారీ, అతడి సోదరుడు ఈ దాడిలో మరణించారు.
అనురాగ్ శర్మ అనే వ్యక్తి, అతని సహచరులు ఈ దాడికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. కత్తులు, కొడవళ్లు, రాడ్లతో షాపులోకి చొరబడ్డ దుండగులు రాహుల్, అతడి సోదరుడ్ని బయటికి లాగి తీవ్రంగా దాడి చేశారు. సోదరుడు అక్కడికక్కడే మృతిచెందగా, రాహుల్ షాహ్‌డోల్ మెడికల్ కాలేజ్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు.
కెమెరా ఫుటేజ్ ప్రకారం, కొందరు దుండగులు, ఇరువురి సోదరులపై దాడి చేయగా, మరికొందరు ఈ దృశ్యాల్ని వీడియో తీశారు. రాహుల్ తివారీ మరణానికి ముందు తన వాంగ్మూలంలో అనురాగ్ శర్మ, అతడి సహచరుల పేర్లు చెప్పాడు. ఈ స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు.
ఇలా ఉంటే, దాడి జరిగిన వెంటనే పోలీసులకు ఫోన్ చేసినా రెండు గంటలపాటు రాకుండా తాత్సారం చేశారని మృతుల బంధువులు ఆందోళనకు దిగారు. కేశవ్ ఘాట్ ఔట్‌పోస్ట్ ఇన్‌చార్జ్ ఆషిష్ ఝారియా నిర్లక్ష్యం చేశాడని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ గ్రామస్తులు, బాధిత కుటుంబ సభ్యులు రోడ్డు మీద ఆందోళనకు దిగారు. దీంతో కలెక్టర్, ఎస్‌పి వచ్చి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితుల ఆరోపణల మేరకు కేశవ్ ఘాట్ ఔట్‌పోస్ట్ ఇన్‌చార్జ్‌ను, బుధార్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్‌ను సస్పెండ్ చేశారు.
కాగా, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇప్పటి వరకూ 8 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. మిగిలినవారు ఇంకా పరారీలో ఉన్నారు. అయితే, ప్రాథమిక దర్యాప్తులో ఈ దాడికి కారణం భూ వివాదమని తేలింది.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్ర డాక్టర్ సూసైడ్ కేసు.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి