Hyderabad: విదేశీ అక్రమార్కులపై కొరవడిన నిఘా.. అరాచక శక్తులకు అడ్డాగా నగరం
ABN , Publish Date - Nov 12 , 2025 | 08:22 AM
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుళ్లు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. పేలుళ్లకు రెండు రోజుల ముందు గుజరాత్‌లో యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మహ్మద్ మోహియుద్దిన్ ఉండటం చర్చనీయాంశమైంది.
- పలు ప్రాంతాల్లో తిష్టవేస్తున్న నేరస్థులు
- కనిపించని స్పెషల్ పోలీసుల నిఘా
హైదరాబాద్ సిటీ: దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుళ్లు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. పేలుళ్లకు రెండు రోజుల ముందు గుజరాత్‌లో యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు ముగ్గురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారిలో హైదరాబాద్(Hyderabad)కు చెందిన సయ్యద్ మహ్మద్ మోహియుద్దిన్ ఉండటం చర్చనీయాంశమైంది. అనంతరం ఢిల్లీ(Delhi)లో పేలుళ్లు జరగడం, 9మంది దుర్మరణం చెందడం, 24 మందికి తీవ్ర గాయాలు కావడం యావత్ దేశాన్ని కలిచి వేసింది.
ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్(Mumbai, Kolkata, Bangalore, Hyderabad) వంటి నగరాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఈ క్రమంలో పోలీసులు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు ముమ్మరం చేశారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలు, సున్నితమైన, సమస్యాత్మకమైన ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. దేశంలో ఎక్కడ ఎప్పుడు ఉగ్రవాద కార్యకలాపాలు వెలుగులోకి వచ్చినా హైదరాబాద్ నగరంతో ఏదో లింకులు బయట పడుతున్నాయి. హైదరాబాద్ నగరం ఉగ్రవాదులకు ఒక షెల్టర్ జోన్‌గా మారిందనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి.

అక్రమార్కులపై తగ్గిన ఫోకస్
సరిహద్దు దేశాల నుంచి హైదరాబాద్‌కు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు ఎక్కువగా ఉంటున్నారు. అలాంటి వారిపై నిరంతరం నిఘా అవసరం. కానీ నిఘా వర్గాలు ఆ విషయంలో విఫలం అవుతున్నాయనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ సిటీ పోలీస్ సమర్ధవంతంగా పని చేయడంలో స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) అధికారులు, సిబ్బంది పనితీరు అత్యంత కీలకం. ఎస్‌బీ అనేది ఒక ప్రత్యేక వ్యవస్థగా పనిచేస్తే మెరుగైన ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ చాలామంది అధికారులు ఎస్‌బీలో విధులంటే పని్‌షమెంట్‌గా భావిస్తున్నారు. విఽధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇతర దేశాల నుంచి వచ్చి నగరంలో తిష్టవేస్తున్న అక్రమార్కులపై ప్రత్యేక ఫోకస్ పెట్టలేకపోతున్నట్లు తెలుస్తోంది.
యుద్ధం సమయంలో హడావిడి
ఇటీవల పాకిస్థాన్, భారత్‌కు జరిగిన యుద్ధం (ఆపరేషన్ సింధూర్) సమయంలో నగరంలో అక్రమంగా ఉంటున్న విదేశీ అక్రమ వలసదారులపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. అప్పటికే నగరంలో కేవలం పాకిస్థానీలే 208 మంది ఉన్నట్లు గుర్తించినట్లు తెలిసింది. వారిలో కొంతమంది నగరం విడిచి వెళ్లిపోగా, మరికొందరు వివిధ న్యాయ సంబంధింత కారణాలతో పోలీసుల భద్రత, పర్యవేక్షణలో ఉన్నట్లు గుర్తించారు.

మరో పది మంది వరకు సరైన అడ్రస్ లు లేకపోవడంతో స్థానికులు సహకారంతో వారిని వెతికి పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, నైజీరియాతో పాటు.. గినియా, కజకిస్తాన్, ఇతర ఆఫ్రికా దేశాలకు చెందిన విదేశీయులు ఎక్కువగా నగరంలోని టోలిచౌకి, లంగర్‌హౌజ్, సన్‌సిటీ, గోల్కొండ, బండ్లగూడ తదిర ప్రాంతాల్లో నివాసం ఉంటున్నట్లు సమాచారం ఉండటంతో పోలీస్ స్టేషన్ల వారీగా కాలనీలు, బస్తీల్లో జల్లెడ పట్టి విదేశీ అక్రమార్కుల లెక్క తేల్చడానికి ఎస్‌బీ అధికారులు విశ్వప్రయత్నం చేశారు. యుద్ధం సమయంలో హడావిడి చేసి ఆ దిశగా మళ్లీ దృష్టి సారించలేదనే విమర్శలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
హాయ్‌ల్యాండ్‌కు గ్రూప్-1 పత్రాల తరలింపుపై రికార్డుల్లేవ్
Read Latest Telangana News and National News