Deputy CM Pawan: తిరుమల లడ్డూ మిఠాయి కాదు
ABN , Publish Date - Nov 12 , 2025 | 06:04 AM
తిరుమల శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదం కేవలం మిఠాయి కాదని, అది హిందువుల ఉమ్మడి భావోద్వేగమని, వారి విశ్వాసానికి ప్రతీకని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
అది హిందువుల ఉమ్మడి భావోద్వేగం
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాలి
‘ఎక్స్’లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పోస్టు
అమరావతి, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదం కేవలం మిఠాయి కాదని, అది హిందువుల ఉమ్మడి భావోద్వేగమని, వారి విశ్వాసానికి ప్రతీకని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అందరి నమ్మకానికి, గాఢమైన భక్తికి ప్రతిబింబం కాబట్టే దాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరికీ పంచుతామని గుర్తుచేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు వైఫల్యాలు, అనైతిక చర్యలు తిరుమల పవిత్రతను తీవ్రంగా దెబ్బతీశాయని, భక్తుల హృదయాలను కలచివేశాయని ఆరోపించారు. నాటి చర్యలు టీటీడీకి ఒక గుణపాఠంగా మిగిలిపోతాయని పేర్కొన్నారు. తిరుమల పవిత్రతను పునరుద్ధరించడానికి, లక్షలాది మంది భక్తుల విశ్వాసాన్ని తిరిగి పొందడానికి టీటీడీ నిరంతరం కృషి చేయాలని కోరారు. టీటీడీ బోర్డు, ఆలయ అధికారులు, ఈవో, జేఈవో నుంచి ఉద్యోగులు, కాంట్రాక్టర్ల వరకూ.. వారి పాత్ర కేవలం పదవికి, హోదాకు పరిమితం కాదని, సనాతన ధర్మాన్ని పాటించే లక్షలాది మంది భక్తులకు సేవ చేయడానికి లభించిన పవిత్ర అవకాశమని వివరించారు. ఇకపై టీటీడీకి సంబంధించిన ఆర్థిక నివేదికలు, నాణ్యత నియంత్రణ, ఆడిట్‌ల నుంచి ఆస్తి, విరాళాల నిర్వహణ వరకూ కార్యకలాపాలన్నీ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, అన్ని వివరాలను బహిరంగంగా అందుబాటులో ఉంచాలని కోరారు. సనాతన ధర్మాన్ని అత్యంత పురాతనమైన, నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికతల్లో ఒకటిగా అభివర్ణించారు. అన్ని వర్గాల సమ్మతితో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన సమయం అసన్నమైందని పవన్ స్పష్టం చేశారు.