Hyderabad: క్యాబ్‌లో దుండగులు.. విమానంలో పోలీసులు
ABN , Publish Date - Sep 13 , 2025 | 09:53 AM
కూకట్‌పల్లిలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. హంతకులు క్యాబ్‌లో పారిపోతున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు విమానంలో బయలుదేరినట్లు తెలిసింది.
- కూకట్‌పల్లి హత్య కేసులో నిందితుల కోసం వేట
- పథకం ప్రకారమే ఇంట్లో పనికి..
- డబ్బు, బంగారం కోసమే జార్ఖండ్ ముఠా స్కెచ్
- కూకట్‌పల్లి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
- ఐదుగురు క్రిమినల్స్ ఉన్నట్లు అంచనా
హైదరాబాద్‌సిటీ: కూకట్‌పల్లిలో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. హంతకులు క్యాబ్‌లో పారిపోతున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని పట్టుకునేందుకు విమానంలో బయలుదేరినట్లు తెలిసింది. ఈ హత్య కేసులో జార్ఖండ్‌కు చెందిన హర్ష, రోషన్‌లతో పాటు మరో ముగ్గురు నిందితులున్నారని పోలీసులు గుర్తించినట్లు సమాచారం. దాంతో మరో రెండు పోలీస్ బృందాలు అదనంగా రంగంలోకి దిగినట్లు సమాచారం.
పథకం ప్రకారం..
స్వాన్‌లేక్ గేటెడ్ కమ్యూనిటీ అపార్టుమెంట్‌లో ఉండే రాకేష్, రేణు అగర్వాల్ దంపతుల ఇంట్లో జార్ఖండ్‌కు చెందిన రాజ్ పనిచేసేవాడు. అతను ఇటీవల మానేశాడు. అతని స్థానంలో పదిరోజుల క్రితం పశ్చిమ బెంగాల్‌కు చెందిన శంకర్ ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా జార్ఖండ్‌కు చెందిన హర్ష పనిలో చేరాడు. అదే అపార్టుమెంట్‌లో పై అంతస్తులో ఉంటున్న రాకేష్ సోదరుడి ఇంట్లో కూడా జార్ఖండ్‌కు చెందిన రోషన్ పనిచేస్తున్నాడు. హర్ష, రోషన్‌తో పాటు పనిమానేసిన రాజ్ జార్ఖండ్‌లో ఒకే ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. రాకేష్ అగర్వాల్ ఇంట్లో పెద్ద ఎత్తున బంగారం, రూ.లక్షల్లో డబ్బు ఉన్నట్లు రాజ్, రోషన్‌లు గుర్తించారు. డబ్బు కొట్టేయాలని పథకం వేశారు. దీనిలో భాగంగానే రాకేష్ అగర్వాల్ ఇంట్లో రాజ్ పని మానేసి వెళ్లిపోవడం, అతని స్థానంలో హర్ష పనిలో కుదిరేలా ప్లాన్ చేశారు. హర్ష చేరిన పదిరోజుల్లోనే చోరీపని పూర్తి చేయాలని నిర్ణయించుకుని అమలు చేసినట్లు తెలిసింది.
లాకర్ కీ కోసం చిత్రహింసలు
బుధవారం మధ్యాహ్నం ఈ ముఠా తమ పథకాన్ని అమలు చేసింది. రాకేష్ ఇంట్లోకి వెళ్లిన ఇద్దరూ.. ఒంటరిగా ఉన్న రేణు అగర్వాల్ నోట్లో దుస్తులు కుక్కి కాళ్లు చేతులు కట్టేశారు. లాకర్ తాళాలు ఎక్కడున్నయో చెప్పాలని, ఎక్కడెక్కడ డబ్బు, బంగారం ఉందో చెప్పాలని చిత్రహింసలు పెట్టారు. సుమారు గంటకుపైగా ఆమెను చిత్రహంసలు పెట్టినా నోరు విప్పకపోవడంతో ఆగ్రహానికి గురైన దుండగులు కుక్కర్‌తో ఆమె తలపై బలంగా మోదారు. ఆపై కత్తితో గొంతుకోసి విచక్షణా రహితంగా పొడిచి చంపేశారు. అనంతరం ఇంట్లోనే స్నానం చేసి, ట్రావెల్ బ్యాగుతో యజమాని స్కూటీపై పారిపోయారు.
క్యాబ్‌లో దుండగుల పరారీ..
దుండగులు హఫీజ్‌పేట రైల్వేస్టేషన్‌లో స్కూటీని వదిలేసి, క్యాబ్ మాట్లాడుకొని పారిపోయినట్లు పోలీసులు గుర్తించినట్లుగా తెలిసింది. స్కూటీని స్వాధీనం చేసుకున్న పోలీసులు టెక్నికల్, సైంటిఫిక్ ఎవిడెన్స్ సేకరించారు. ఇదిలా ఉండగా.. దుండగులు క్యాబ్‌లో పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు హుటాహుటిన విమానంలో జార్ఖండ్‌కు బయల్దేరారు. వారు జార్ఖండ్ చేరుకునేలోపు, పోలీసులు అక్కడికి రీచ్ అయినట్లు తెలిసింది. కాగా.. మరో బృందం క్యాబ్‌ను వెంబడించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠాలో మొత్తం ఐదుగురు నిందితులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరంతా శంకర్ ఏజెన్సీ ద్వారా వివిధ ప్రాంతాల్లో పనిమనుషులుగా చేరిన వారిగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. నిందితులు ఎక్కువ మంది ఉన్నట్లు తేలడంతో మరో రెండు బృందాలు అదనంగా దిగినట్లు తెలిసింది. నేడు హంతకుల ముఠాను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం ధరకు రెక్కలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రూ.12 వేల కోట్లు కాదు.. రూ.12 కోట్లే!
Read Latest Telangana News and National News