South Asian University Incident: ఢిల్లీలో యూనివర్సిటీ విద్యార్థినిపై అత్యాచార యత్నం
ABN , Publish Date - Oct 14 , 2025 | 12:48 PM
ఢిల్లీలోని సౌత్ ఏషియన్ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని తనపై అత్యాచార యత్నం జరిగిందని ఆరోపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో (New Delhi) తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. తనపై అత్యాచార యత్నం జరిగిందని సౌత్ ఏషియన్ యూనివర్సిటీ విద్యార్థిని ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలు బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. క్యాంపస్ పరిసరాల్లో నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తన దుస్తులు చింపి అసభ్యంగా తాకారని చెప్పారు (South Asian University Incident).
సోమవారం మధ్యహ్నాం మూడు గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఈ ఘటనకు సంబంధించి కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. వెంటనే యూనివర్సిటీకి ఓ బృందాన్ని పంపించామని అన్నారు. ఈ ఉదంతానికి సంబంధించి పోలీసులు తొలుత లైంగిక వేధింపుల అభియోగం మోపుతూ కేసు నమోదు చేశారు. బాధితురాలి స్టేట్‌మెంట్ తీసుకున్నాక కేసులో సామూహిక అత్యాచార యత్నానికి సంబంధించిన సెక్షన్లు జత చేశారు.
యూనివర్సిటీ పరిసరాల్లో అన్ని చోట్లా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ సేకరించి పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
ఈ ఘటనపై విద్యార్థులు నిరసనకు దిగడంతో యూనివర్సిటీలో సోమవారం ఉద్రిక్తత వాతావరణం కనిపించింది. ఇక ఘటనపై విచారణకు తాము పూర్తిగా సహకరిస్తున్నామని యూనివర్సిటీ ఓ ప్రకటనలో తెలిపింది. సార్క్ దేశాల కూటమి మధ్య ఏర్పడిన ఒప్పందంలో భాగంగా ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. సార్క్ దేశాల వారందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు ఈ యూనివర్సిటీని నెలకొల్పారు.
ఇదిలా ఉంటే సెప్టెంబర్ 9న నగరంలోని ఆదర్శ్ నగర్ ప్రాంతంలో ఓ ఎమ్‌బీబీఎమ్ విద్యార్థినిపై అత్యాచార ఉదంతం కలకలానికి దారి తీసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఉదంతం మర్చిపోక ముందే మరో అత్యాచారయత్నం కేసు వెలుగులోకి రావడం సంచలనం రేకెత్తిస్తోంది.
ఇవి కూడా చదవండి:
కశ్మీర్‌లో చొరబాట్లకు యత్నం.. ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా దళాలు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి