Cyber Criminals: బ్యాంక్ ఖాతాలే కీలకం.. సైబర్ నేరగాళ్ల దృష్టి వాటిపైనే
ABN , Publish Date - Oct 25 , 2025 | 10:40 AM
కాసులకు కక్కుర్తిపడి, కమీషన్లకు ఆశపడి కొందరు ఏజెంట్లు చిరుద్యోగులు, నిరుద్యోగులు, అప్పులపాలైన వారిని టార్గెట్‌గా చేసుకుని వారి బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇచ్చి సహకరిస్తున్నారు. తర్వాత వచ్చే పరిణామాలను వారు లెక్క చేయకపోవడంతో పోలీసు కేసుల్లో చిక్కుకుని బయటకు రాలేక నానాతంటాలు పడుతున్నారు.
- కమీషన్‌ల పేరిట ఏజెంట్ల ఆగడాలు
- కేసుల్లో చిక్కుకుని బయటపడలేక తంటాలు
- తప్పించుకుంటున్న కింగ్‌పిన్‌లు
- అరెస్టయిన వారిలో ఖాతాదారులే ఎక్కువ
హైదరాబాద్ సిటీ: కాసులకు కక్కుర్తిపడి, కమీషన్లకు ఆశపడి కొందరు ఏజెంట్లు చిరుద్యోగులు, నిరుద్యోగులు, అప్పులపాలైన వారిని టార్గెట్‌గా చేసుకుని వారి బ్యాంక్ ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇచ్చి సహకరిస్తున్నారు. తర్వాత వచ్చే పరిణామాలను వారు లెక్క చేయకపోవడంతో పోలీసు కేసుల్లో చిక్కుకుని బయటకు రాలేక నానాతంటాలు పడుతున్నారు. కాజేసిన డబ్బును బదిలీ చేసుకునేందుకు కింగ్‌పిన్‌లు ఈ ఖాతాలను విరివిగా వాడుతూ కేసుల్లో చిక్కుకోకుండా తప్పించుకుంటున్నారు.
సైబర్ నేరగాళ్లు పోలీసులకు చిక్కకుండా ఉండేలా డబ్బు లావాదేవీలకు బ్యాంకు ఖాతా(మ్యూల్ అకౌంట్స్)లను సేకరిస్తున్నారు. ఇందుకోసం వారు ఏకంగా ఏజెంట్లనే నియమించుకుంటున్నారు. ఈ ఏజెంట్లు రంగంలోకి దిగి అప్పులపాలైన వారిని, గేమింగ్‌లో డబ్బు పోగొట్టుకున్న, ఆర్థిక అవసరాలున్న వారిని గుర్తించి, కమీషన్లు ఇస్తామని ఆశచూపుతూ ఖాతాలను ఇచ్చేందుకు ఒప్పిస్తున్నారు. మరికొంతమంది బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలంటూ అమాయకుల నుంచి సేకరించిన పత్రాలతో ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లకు అందిస్తున్నారు. అయితే, బ్యాంక్ సిబ్బందిలో కొందరు సైబర్ నేరగాళ్లతో కుమ్మక్కై కమీషన్లు తీసుకొని ఖాతాలు సమకూర్చుతుండగా.. ఇంకొందరు నిబంధనలకు పాతరవేస్తూ నకిలీ పత్రాలతో బ్యాంక్ ఖాతాలు తెరిచేలా సహకరిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

రూ.50 వేలకు ఖాతా..
దేశంలో డాటా ప్రొటెక్షన్ యాక్ట్ పకడ్బందీగా అమలు కాకపోవడంతో ప్రజల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చేరుతోంది. సిమ్‌కార్డు, బ్యాంక్ అకౌంట్‌తోపాటు కేవైసీ పూర్తి చేసి, గూగుల్‌పే, ఫోన్‌పే వంటి యాప్‌లు ఇన్‌స్టాల్ చేసి ఇచ్చే ఖాతాలను ఏజెంట్లకు రూ.50 వేలు చెల్లించి సైబర్ నేరగాళ్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ ఖాతాలను ఉపయోగిస్తూ పలు రకాలుగా మోసాలు చేస్తున్నారు.
ప్రైవేటు బ్యాంకుల్లోనే 62 శాతం ఖాతాలు
లావాదేవీలు నిర్వహించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రైవేటు బ్యాంక్ ఖాతాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు. సైబర్ నేరాల్లో కాజేసిన మొత్తంలో 62శాతం లావాదేవీలు వీటి ద్వారానే జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. కొందరు బ్యాంక్ అధికారులు ఖాతాల సంఖ్య, లావాదేవీలు పెంచుకోవడానికి కూడా ఇలాంటి ఖాతాలను చూసీచూడనట్లు వదిలేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
మాయమాటలు చెబుతూ..
విద్యార్థులు, చిరుద్యోగులు, నిరుద్యోగులు, అప్పుల పాలైన వారిని ఏజెంట్లు టార్గెట్ చేసుకుంటున్నారు. కమీషన్లు వస్తాయని మాయమాటలు చెబుతూ వారి ఖాతాలను సేకరించి కేటుగాళ్లకు అందజేస్తున్నారు. ఖాతాలను ఇవ్వడం ద్వారా కొంత కమీషన్, ఆయా ఖాతాల్లో పడ్డ డబ్బును వేరే ఖాతాలకు బదిలీ చేయడం, క్రిప్టో, డాలర్లలో మార్చి విదేశాలకు పంపడం వల్ల మరికొంత కమీషన్‌ను సంపాదిస్తున్నారు. ఇటీవల డిజిటల్ అరెస్ట్ కేసులో దర్యాప్తు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైం అధికారులు నల్గొండకు చెందిన విద్యార్థితోపాటు పలువురు చిరుద్యోగులను అరెస్ట్ చేశారు. బెట్టింగ్‌లో అప్పులపాలైన వారు తమ ఆర్థిక అవసరాల కోసం ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇచ్చినట్లు గుర్తించారు. పెద్దమొత్తంలో ఈజీ మనీ వస్తుండటంతో తర్వాత వచ్చే పరిణామాలను లెక్క చేయకుండా పలువురు ఏజెంట్లు సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఖాతాలిస్తే క్రిమినల్ కేసులే..
వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు ఇతరులకు ఇవ్వడం నేరం. బ్యాంకు ఖాతాలు ఇచ్చిన వారు మోసాలు చేయకపోయినా సైబర్ నేరగాళ్లకు సహకరించినందుకు బాధ్యులు అవుతారు. బ్యాంకు ఖాతాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నాం. లోన్ ఇప్పిస్తామని, ప్రభుత్వ పథకాల కోసమని చెబితే నమ్మి అపరిచితులకు ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వకూడదు.
- కవిత, డీసీపీ,సైబర్ క్రైం
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. బంగారం ధర మరికొంచెం తగ్గింది..
Read Latest Telangana News and National News