Share News

Ananthapur News: మేనమామే హంతకుడు.. పథకం ప్రకారం బాలుడి హత్య

ABN , Publish Date - Dec 02 , 2025 | 10:38 AM

బాలుడి హత్య కేసులో మిస్టరీ వీడింది. మేనమామే హంతకుడు.. అని పోలీసులు నిర్ధారించారు. కొమ్మెర హర్షవర్ధన్‌ అనే బాలుడిని అతని సొంత మేనమామే చంపేశాడు. జిల్లా వ్యాప్తంగా సంచలనానికి దారితీసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Ananthapur News: మేనమామే హంతకుడు.. పథకం ప్రకారం బాలుడి హత్య

- నిందితుడి అరెస్ట్‌

కదిరి(అనంతపురం): తలుపుల మండలంలో సంచలనం సృష్టించిన కొమ్మెర హర్షవర్ధన్‌ అనే బాలుడి హత్య కేసులో మేనమామను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పథకం ప్రకారమే హత్య చేసినట్లు నిందితుడు ప్రసాద్‌ దర్యాప్తులో ఒప్పుకున్నట్లు కదిరి డీఎస్పీ శివనారాయణస్వామి(Kadiri DSP Shivanarayanaswamy) తెలిపారు. సోమవారం కదిరి రూరల్‌ సర్కిల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. గత నెల 26న ఉదయం 11 గంటలకు తలుపుల మండల పరిధిలోని గరికపల్లికి చెందిన ఐదు సంవత్సరాల హర్షవర్ధన్‌ కనిపించాకుండాపోయాడు.


సాయంత్రం వరకు వెదికిన తల్లిదండ్రులు.. అదేరోజు తలుపుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 27వతేదీ తెల్లవారుజామున 3గంటలకు ఎన్పీకుంట మండలంలోని మర్రికొమ్మెదిన్నె, జౌకల మధ్యలోని అటవీప్రాంతంలో బాలుడి శవాన్ని కనుగొన్నారు. బాలుడిని హత్యపై దర్యాప్తు మొదలు పెట్టారు. మొదటగా బాలుడి మేనమామ ప్రసాద్‌పై పోలీసులకు అనుమానం వచ్చింది. 26వ తేదీ ఉదయం నుంచి బాలుడు మేనమామ వద్దే ఉండడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. చివరకు బాలుడి మేనమామే హంతకుడిగా నిర్ధారణకు వచ్చారు. నిందితుడిని సోమవారం మధ్యాహ్నం కదిరి మున్సిపాలిటీ పరిధిలోని మూర్తిపల్లి సబ్‌ స్టేషన్‌ వద్ద అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు వివరించారు. సమావేశంలో రూరల్‌ సీఐ నాగేంద్ర, తలుపుల ఎస్‌ఐ నరసింహుడు ఉన్నారు.


pandu2.2.jpg

పథకం ప్రకారమే హత్య..

బాలుడు హర్షవర్ధన్‌ను అతడి మేనమామ ప్రసాద్‌ పథకం ప్రకారమే హత్య చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. నిందితుడి కుమారుడు బ్లడ్‌క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఈ విషయంపై ప్రసాద్‌ బావ గంగాధర్‌ సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టాడన్న కక్ష పెంచుకున్నాడు. తన కుమారుడు లేకుండాపోతే ఎంత బాధ ఉంటుందో.. తన బావమరిది కూడా అంత బాధను చూపించాలని మనుసులో పెట్టుకున్నాడు. రెండుమూడునెలలుగా హర్షవర్ధన్‌ను మేనమామ బాగా మచ్చిక చేసుకున్నాడు.


ఆ ఆనుబంధంతోనే బాలుడిని నమ్మించి, గతనెల 26న ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని ఎన్పీకుంట మండలం మర్రికొమ్మెదిన్నె, జౌకల మధ్యలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి ఓ చెట్టుకింద గొంతు నులిమి హత్యచేసినట్లు డీఎస్పీ తెలిపారు. దర్యాప్తులో సంఘటనా స్థలం వద్ద నిందితుడి పర్సు, ఆధార్‌కార్డు, బాలుడి చెప్పులు, నిందితుడి చెప్పులు లభ్యమైనట్లు చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి, ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పిల్లలపట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని డీఎస్పీ సూచించారు. కేసును చేధించిన సీఐ, ఎస్‌ఐ, పోలీసులను డీఎస్పీ అభినందించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఆత్మహత్య

మరో వివాదంలో ఐపీఎస్‌ సునీల్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 02 , 2025 | 10:38 AM