Hyderabad: ఏఐతో గొంతు మార్చి.. ఏమార్చి..
ABN , Publish Date - Jun 30 , 2025 | 10:31 AM
సైబర్ నేరాల గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతున్న తరుణంలో నేరగాళ్లు కొత్తదారులు వెతుకుతున్నారు. విదేశాల్లో ఉన్న బంధువులు, స్నేహితుల పేర్లు చెప్పి మోసాలకు తెగబడుతున్నారు.
- ఎన్నారై బంధువులు, స్నేహితుల ఫొటోలతో చాటింగ్
- పలు కారణాలు చెప్పి డబ్బు వసూలు చేస్తున్న సైబర్ నేరగాళ్లు
- పెరుగుతున్న కేసులు.. అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ: సైబర్ నేరాల గురించి ప్రజల్లో అవగాహన పెరుగుతున్న తరుణంలో నేరగాళ్లు కొత్తదారులు వెతుకుతున్నారు. విదేశాల్లో ఉన్న బంధువులు, స్నేహితుల పేర్లు చెప్పి మోసాలకు తెగబడుతున్నారు. వాట్సా్‌పలో సదరు వ్యక్తుల ఫొటోలు పెట్టి చాటింగ్ చేస్తున్నారు. ఏఐని వినియోగించి వారి గొంతులను అనుకరిస్తున్నారు. అరెస్ట్, కేసులు, వీసా సమస్య అంటూ పలు కారణాలు చెప్పి అందినంత వసూలు చేస్తున్నారు.
నగర సైబర్ క్రైం ఠాణాకు నెల వ్యవధిలో ఈ తరహా సైబర్ మోసాలపై పలు ఫిర్యాదులు అందాయి. కొత్త నంబర్ల ద్వారా విదేశాల్లో ఉంటున్న స్నేహితులు, బంధువుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్‌ను నమ్మవద్దని.. నేరుగా మాట్లాడిన తర్వాతే ఆర్థిక లావాదేవీలు చేయాలని, సైబర్ నేరం జరిగినట్లు గ్రహిస్తే 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
- ఈదీబజార్‌కు చెందిన ఓ వ్యక్తికి వరుసకు సోదరుడు సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. ఈనెల 25న అతడి ఫొటోతో ఉన్న వాట్సాప్ నంబర్ ద్వారా సైబర్ నేరగాడు బాధితుడితో చాటింగ్ చేశాడు. తాను పెద్ద మొత్తంలో డబ్బు పంపుతానని, బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎ్‌ఫఎస్‌సీ కోడ్ తదితర వివరాలు అడిగితే చెప్పాడు. కొద్ది సేపటి తర్వాత డబ్బు బదిలీ చేశానని చెబుతూ దానికి సంబంధించి సిటీ బ్యాంక్ ఓచర్ పంపించాడు. వీసా సమస్య పరిష్కరిస్తాడంటూ ఏజెంట్ నంబర్ ఇచ్చాడు. ట్రావెల్ ఏజెంట్ డబ్బు డిమాండ్ చేయడంతో నీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి కదా.. ముందు డబ్బు కట్టమని సూచించాడు. మోసం గురించి బాధితుడు తెలుసుకునేలోగా సైబర్ నేరగాళ్లు పలు దఫాలుగా రూ. 1.90 లక్షలు వసూలు చేశారు.

- నగరానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి స్నేహితుడు యూకేలో ఉంటున్నాడు. యూకేలో ఉన్న వ్యక్తి ఫొటోతో ఉన్న కొత్త నంబర్ నుంచి ఫోన్ చేసిన సైబర్ నేరగాడు తాను ఇండియా వస్తున్నానని చెప్పాడు. తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నానని, విదేశీ కరెన్సీ తీసుకురావడంతో ఎయిర్‌పోర్ట్‌లో ఇన్‌కంట్యాక్స్ అధికారులు అడ్డుకున్నారని చెప్పాడు. కస్టమ్ అధికారినంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాడు క్లియరెన్స్ పేరుతో పలు దఫాలుగా రూ 2.05 లక్షలు వసూలు చేశాడు.
- సౌదీలో ఉంటున్న తమ్ముడి ఫొటోను డీపీగా పెట్టిన క్రిమినల్స్.. నగరంలో ఉంటున్న అన్నను బురిడీ కొట్టించి రూ. 1.19 లక్షలు కాజేశారు. బాధితుడి తమ్ముడి ఫొటో వాట్సాప్ డీపీలో పెట్టుకున్న సైబర్ నేరగాడు కుటుంబ సభ్యులతో చాటింగ్ చేశాడు. డబ్బు పంపుతున్నానని ఖాతా నంబర్‌లు తీసుకొని, డబ్బు పంపినట్లు నకిలీ రసీదు పంపించి 24 గంటల్లో ఖాతాలో జమ అవుతాయన్నాడు. కొద్దిసేపటి తర్వాత అదే నంబర్ నుంచి మరో వ్యక్తి ఫోన్ చేసి తాను సౌదీ ఎంబసీ నుంచి మాట్లాడుతున్నానని, వీసా గడువు ముగిసిన కారణంగా మీ తమ్ముడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పాడు. వీసా పునరుద్ధరణ, టికెట్ ఖర్చు అంటూ రూ.1.19 లక్షలు వసూలు చేశాడు.
- నగరానికి చెందిన మహిళకు సైబర్ నేరగాళ్లు ఇటీవల ఫోన్ చేసి విదేశాల్లో ఉంటున్న మీ కుమార్తెను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశామని చెప్పారు. కేసు నుంచి బయటపడాలంటే డబ్బు కట్టాలని డిమాండ్ చేశారు. కుమార్తె భవిష్యత్ గురించి ఆందోళన చెందిన మహిళ నుంచి అందినంత వసూలు చేశారు. కుమార్తె క్షేమంగా ఉందని తెలుసుకునే వరకు వసూళ్ల పర్వం కొనసాగింది.
ఈ వార్తలు కూడా చదవండి.
గుడ్ న్యూస్.. రూ.98 వేల దిగువకు బంగారం.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ఎంపీ రఘునందన్‌కు మళ్లీ బెదిరింపు కాల్
Read Latest Telangana News and National News