Share News

Juvenile Crime: నువ్వుగానీ చంపావేమిట్రా

ABN , Publish Date - Aug 24 , 2025 | 03:54 AM

పన్నెండేళ్ల బాలిక సహస్ర నిండు ప్రాణాలను బలిగొన్న పదో తరగతి చదువుతున్న ఆ బాలుడు 14 హత్య తర్వాతా నిర్భీతిగా వ్యవహరించాడు. హత్య అనంతరం రక్తపుమరకలు అంటిన టీషర్టుతోనే ఇంట్లోకి వెళ్లి.. ఆ మరకలు ఇంట్లో ఎవరి కంటా పడకుండా ఉండేందుకు..

Juvenile Crime: నువ్వుగానీ చంపావేమిట్రా

  • టెన్షన్‌ పడుతుండటంతో సహస్ర హత్యపై నిందితుడైన బాలుడిని ప్రశ్నించిన తల్లి

  • పోలీసుల విచారణలో బయటపడ్డ వివరాలు

  • బ్యాట్‌ దొంగతనం కోసం ఇంట్లోకి.. సహస్ర అడ్డుకోవడంతో హత్య.. జువైనల్‌ హోంకు బాలుడు

  • వాడిని ఉరితీయండి.. బాలిక తల్లిదండ్రుల ధర్నా

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): పన్నెండేళ్ల బాలిక సహస్ర నిండు ప్రాణాలను బలిగొన్న పదో తరగతి చదువుతున్న ఆ బాలుడు (14) హత్య తర్వాతా నిర్భీతిగా వ్యవహరించాడు. హత్య అనంతరం రక్తపుమరకలు అంటిన టీషర్టుతోనే ఇంట్లోకి వెళ్లి.. ఆ మరకలు ఇంట్లో ఎవరి కంటా పడకుండా ఉండేందుకు దండెం మీద ఆరేసిన ఓ చొక్కా తీసుకొని దాన్ని టీషర్టుకు అడ్డంగా పెట్టుకొని బాత్‌రూంలోకి వెళ్లిపోయాడు. ఆ టీషర్టును విప్పి.. వాషింగ్‌మెషిన్‌లో వేశాడు. కత్తిని శుభ్రంగా కడిగేసి.. ఫ్రీజ్‌మీద పెట్టాడు. తర్వాత స్నానం చేసి ఏమీ తెలియనట్లుగా ఇంట్లోవారితో కలిసి టీవీ చూశాడు. ఇంట్లో బాలుడి తీరును అనుమానించిన తల్లి.. ‘నువ్వు గానీ చంపావేమిట్రా ఆ అమ్మాయిని’ అని ప్రశ్నిస్తే.. ‘నీమీదొట్టమ్మా? అని బొంకాడు. ఆపై ‘నువ్వే పట్టించేలా ఉన్నావే’ అంటూ బెదురుగా మాట్లాడాడు. ఆ బాలుడు ఎప్పుడూ ఊహాలోకంలో విహరిస్తుంటాడని.. తానో సీఐడీ అధికారి అయిపోయినట్లు.. పెద్ద క్రికెటర్‌ను అయిపోయినట్లుగా భావిస్తుంటాడని అతడితో మాటల సందర్భంగా గుర్తించారు. గల్లీలో క్రికెట్‌ ఆడుతుండగా సహస్ర తమ్ముడి వద్ద ఉన్న ఖరీదైన బ్యాట్‌పై కన్నేసి.. దాన్ని చోరీ చేసేందుకు ఇంట్లోకి చొరబడ్డాడని.. సహస్ర అడ్డుకోవడంతో ఆమెను కత్తితో పొడిచాడని పోలీసులు తేల్చారు. బాలుడిని మేడ్చల్‌లోని జువైనల్‌ హోంకు తరలించారు. ఈ మేరకు కూకట్‌పల్లి దయార్‌గూడలో బాలిక హత్య కేసుకు సంబంధించి సీపీ అవినాశ్‌ మహంతి వివరాలు వెల్లడించారు.

కళ్లు మూసుకొని 27 కత్తిపోట్లు

దయార్‌గూడలో బాలిక సహస్ర తల్లిదండ్రులు అపార్ట్‌మెంట్‌లోని పెంట్‌హౌ్‌సలో.. బాలుడి తల్లిదండ్రులు ఆ పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లోని నాలుగో అంతస్తులో ఉంటున్నారు. గల్లీలో క్రికెట్‌ ఆడినప్పుడల్లా ఆ బాలుడు సహస్ర తమ్ముడి బ్యాట్‌తో ఆడేవాడు. తనకు ఆ బ్యాట్‌ ఇచ్చేయాలని అతడు అడిగినా సహస్ర తమ్ముడు ఇవ్వలేదు. గుట్టుగా ఇంట్లోకి చొరబడి ఆ బ్యాట్‌ సొంతం చేసుకోవాలని బాలుడు ప్రణాళిక వేసుకున్నాడు. ఈనెల 18న ఉదయం 10 తర్వాత కత్తి తీసుకొని తన అపార్ట్‌మెంట్‌ గోడ దూకి ఆవలివైపు అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించాడు. ఇంట్లో సహస్ర ఒక్కత్తే ఉండటం, ఆమె టీవీలో మునిగిపోయి ఉండటంతో లోపలికి దూరి.. వంటగదిలో ఉన్న బ్యాట్‌ను తీసుకున్నాడు. అతడు వెళ్లిపోతుండగా గమనించిన సహస్ర.. వెళ్లి నిందితుడిని టీషర్టు పట్టుకొని వెనక్కి లాగింది. మా నాన్నకు చెప్తానంటూ బెదిరించింది. సహస్రతో పెనుగులాడిన బాలుడు, తన వెంట తెచ్చుకున్న కత్తితో తొలుత ఆమె మెడపై పొడిచాడు. ఆపై.. కళ్లు మూసుకొని కత్తితో విచక్షణారహితంగా కడుపులో పొడిచాడు. ఆమె శరీరంపై 27 కత్తిపోట్లను వైద్యులు గుర్తించారు.


‘నీ ఆట ముగిసింది..’ అని అనగానే..

పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి విచారణలో భాగంగా చుట్టుపక్కలవారిని ప్రశ్నిస్తుండగా అక్కడికి వెళ్లిన బాలుడు.. ‘హత్య జరిగిన రోజు ఉదయం 10:30 గంటలకు సహస్ర డాడీ డాడీ అని అరవడం నేను విన్నాను’ అని పోలీసులకు చెప్పాడు. తర్వాత పోలీసులు ఎన్నిసార్లు ఘటనాస్థలికి వెళ్లినా ప్రతిసారి 3వ అంతస్తువరకొచ్చి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకొని వెళ్లేవాడు. ఈ విషయాన్ని మూడో ఫ్లోర్‌లో ఉంటున్న ఓ వ్యక్తి గమనించాడు. గతంలోనూ ఆ బాలుడు గోడదూకి సహస్ర ఇంటికి వెళ్లడాన్ని ఆ వ్యక్తి చూసి ఉండటంతో పోలీసులకు ఉప్పందించాడు. తర్వాత ఏసీపీ రవికిరణ్‌ రెడ్డి వెళ్లి బాలుడిని దగ్గరకు పిలుచుకున్నారు. మాట లు కలిపి.. ‘ఏంట్రా సహస్ర వాళ్ల తమ్ముడితో నువ్వు ఆడుకునేదట.. నిజమేనా? నీ ఆట ముగిసిందిరా. ఇప్పటికైనా నిజం చెప్పు’ అని గద్దించారు. ‘సార్‌ సీఐడీ క్రైమ్‌ సీరియల్‌లో నిజం తెలిసిన తర్వాత కొట్టరు కదా.. నేను నిజం చెప్తాను సార్‌’ అంటూ నేరం అంగీకరించాడు. బ్లూరేస్‌ సూపర్‌ లైట్‌ టెక్నాలజీ ద్వారా హత్య చేసిన రోజు ధరించిన టీషర్టుపై ఉన్న రక్తపు నమూనాలను సేకరించారు. అవి సహస్ర బ్లడ్‌ శాంపిల్స్‌తో సరిపోయాయి.

వాడిని ఉరితీయండి

‘మాకు జరిగిన అన్యాయం మరెవ్వరికీ జరగకూడదు’ అని సహస్ర తల్లిదండ్రులు కృష్ణ, రేణుక మీడియాతో వాపోయారు. తమ కుమార్తెను హత్య చేసిన బాలుడిని ఉరితీయాలి, కాల్చి పడేయాలి, పెట్రోల్‌ పోసి తగులబెట్టాలి అంటూ శనివారం కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బంధుమిత్రులతో కలిసి ధర్నా చేశారు. బ్యాట్‌ కోసమే హత్య చేశాడని పోలీసులు చెబుతున్నా.. తమకు నమ్మశక్యంగా లేదని, హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల ప్రమే యం ఉందని అనుమానిస్తున్నట్లు చెప్పా రు. కాగా, సహస్ర హత్య చాలా బాధాకర మని, ప్రభుత్వపరంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని ఎస్సీ, ఎస్టీ చైర్మన్‌ బక్కి వెంకటయ్య అన్నారు. బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.


స్నానం చేయడంతోనే అనుమానించిన తల్లి

ప్రతిరోజు ఎన్నోసార్లు మందలిస్తే తప్ప స్నానం చేయని కొడుకు.. బాలిక హత్య జరిగిన రోజు ఉదయం 10:30కే స్నానం చేయడంతో ఆశ్చర్యపోయానని.. అప్పుడే అనుమానం మొదలైందని తల్లి పోలీసులకు చెప్పింది. హత్య జరిగిన రోజు తన కొడుకు టెన్షన్‌గా ఉండటాన్ని గమనించి, రెండు రోజులపాటు కదలికలపై కన్నేసింది. ఘటనాస్థలికి పోలీసులు వచ్చినప్పుడల్లా.. అక్కడ జరిగేది తెలుసుకొని రావడం.. తన ఇంట్లో వాళ్లనూ ఆ వివరాలు అడుగుతుండటంతో మరింత అనుమానించింది. ‘ఏందిరా ఆ వివరాలన్నీ అడుగుతున్నావ్‌.. ఆ పిల్లను నువ్వేమైనా చంపావా?’ అంటూ ప్రశ్నించింది. దాంతో ఆ బాలుడు ‘అమ్మతోడమ్మ.. నేనేమీ చేయలేదు. ఎందుకు అనుమానిస్తున్నావ్‌.. నువ్వే నన్ను పోలీసులకు పట్టించేలా ఉన్నావ్‌’ అంటూ బెదిరిపోయినట్లు మాట్లాడాడని ఆ తల్లి పోలీసులకు చెప్పింది. ఇంట్లో ఎవ్వరూ డబ్బివ్వకుండానే ఇటీవల ఆ బాలుడు సెల్‌ఫోన్‌ కొన్నాడు. ఫోన్‌ ఎలా కొన్నావురా? అని తాను ప్రశ్నిస్తే ‘నీకెందుకు?’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని తల్లి వెల్లడించింది. ఆ రోజే నిలదీసి ఉంటే ఈ రోజు దుస్థితి వచ్చేది కాదని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారని డీసీపీ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి..

నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు

అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 03:54 AM