Investments: సన్‌టెక్ ఎనర్జీలో సచిన్ పెట్టుబడి.. భారత క్లీన్ ఎనర్జీకి బూస్ట్!
ABN , Publish Date - Dec 24 , 2025 | 09:59 AM
సౌర విద్యుత్ ఉత్పత్తులను అందించే సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్‌లో సచిన్ ఇన్వెస్ట్ చేశారు. బ్రాండ్ విశ్వసనీయత మరింత పెరిగేందుకు, జాతీయ స్థాయిలో వేగంగా విస్తరించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని..
ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 24: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ హైదరాబాద్‌కు చెందిన సోలార్ కంపెనీ సన్‌టెక్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (బ్రాండ్: ట్రూజాన్ సోలార్ / Truzon Solar)లో స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. డిసెంబర్ 23, 2025న ప్రకటించిన ఈ భాగస్వామ్యం ద్వారా సచిన్ రూ. 3.6 కోట్లతో 1.8 లక్ష షేర్లు కొనుగోలు చేశారు.
ఇది కంపెనీలో సుమారు 2% స్టేక్‌కు సమానం. 2008లో చారుగుండ్ల భవానీ సురేశ్ స్థాపించిన ఈ కంపెనీ రెసిడెన్షియల్, కమర్షియల్, యూటిలిటీ-స్కేల్ సోలార్ ప్రాజెక్టులు, రూఫ్‌టాప్ సిస్టమ్స్, PM-కుసుం పథకాలు వంటి రంగాల్లో పనిచేస్తోంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బలమైన ఉనికి ఉంది.
తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వంటి కొత్త మార్కెట్లలో దూకుడుగా విస్తరిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కంపెనీ వ్యవస్థాపకుడు.. మేనేజింగ్ డైరెక్టర్ చారుగుండ్ల భవానీ సురేశ్ మాట్లాడుతూ, 'సచిన్‌తో ఈ భాగస్వామ్యం కేవలం పెట్టుబడి మాత్రమే కాదు.. మా విలువలు, గవర్నెన్స్, లాంగ్-టర్మ్ విజన్‌కు బలమైన ధృవీకరణ. ఇది బ్రాండ్ విశ్వసనీయతను పెంచి, జాతీయ స్థాయిలో వేగవంతమైన విస్తరణకు దోహదపడుతుంది' అని పేర్కొన్నారు.
సచిన్ విశ్వాసం, ఎక్సలెన్స్, జాతీయ గర్వం వంటి విలువలు ట్రూజాన్ సోలార్‌తో సమానంగా ఉండటంతో ఈ పార్టనర్‌షిప్ భారత క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్‌ను వేగవంతం చేస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది. 2030 నాటికి భారత్ టాప్-3 సోలార్ EPC కంపెనీల్లో ఒకటిగా మారాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ట్రూజాన్ సోలార్‌కు ఈ ఇన్వెస్ట్‌మెంట్ మైలురాయిగా నిలుస్తుంది. సచిన్ గతంలో కూడా రిన్యూవబుల్ ఎనర్జీ రంగంలో (రేజాన్ సోలార్ వంటివి) పెట్టుబడులు పెట్టారు. ఈ తాజా భాగస్వామ్యం భారత్ సోలార్ రంగానికి మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు.
ఇవీ చదవండి:
ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి ప్రాజెక్టు.. ఇల్లు అప్పగించని పౌరుడు.. చివరకు..
వాయుకాలుష్యం నుంచి తక్షణ ఉపశమనం.. నెట్టింట వైరల్‌గా మారిన వీడియో