Share News

Children PAN Card: మీ చిన్నారులకు పాన్ కార్డ్ తీసుకోండి.. ఇన్వెస్ట్‌‌మెంట్‌పై అవగాహన కల్పించండి!

ABN , Publish Date - Nov 21 , 2025 | 04:26 PM

ఏదైనాసరే చిన్నప్పటినుంచీ చేస్తే అది ఒక హాబీగా, ఆ రంగంలో నిష్ణాతులుగా మారే అవకాశం చాలా ఎక్కువ. అది సాంస్క‌తిక అంశాలైనా, క్రీడలైనా లేదా పొదుపు, పెట్టుబడులైనా. ఆయా అంశాల్ని చిన్నారులకు అలవాటు చేయడం కూడా తల్లిదండ్రుల బాధ్యత.

Children PAN Card: మీ చిన్నారులకు పాన్ కార్డ్ తీసుకోండి.. ఇన్వెస్ట్‌‌మెంట్‌పై అవగాహన కల్పించండి!
Children Pan Card Benefits

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడు, మైనర్లు (18 సంవత్సరాల వయసు లోపు వారు) కూడా పాన్ కార్డ్ తీసుకోవచ్చని మీకు తెలుసా. ఇన్‌కమ్ ట్యాక్స్ విభాగం ఇటీవల చిన్నారులకు(మైనర్లు) పాన్ కార్డ్ ఆవశ్యకతపై ఓ ప్రత్యేక ఈ-క్యాంపెయిన్ కూడా చేపట్టింది. చిన్నారుల తల్లిదండ్రులు లేదా సంరక్షకులు వారి ప్రతినిధులుగా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దేశంలో నివసించే వారితో పాటు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ (NRI) పాన్ కార్డ్ తీసుకోవచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్ లో అప్లై చేసి పొందవచ్చు.


అయితే, మైనర్లు స్వయంగా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడం వీలుకాదు. వారి తల్లిదండ్రులు, లేదా సంరక్షకులు లేదా రిప్రెజెంటేటివ్ అసెస్సీలు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా అప్లై చేయొచ్చు. పిల్లలు భారత్‌లో నివసిస్తున్నా, NRI అయినా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయవచ్చు.


ఇందుకోసం ఆన్‌లైన్ విధానంలో సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఫామ్ నింపాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఆ ఫామ్స్ ఆఫ్‌లైన్‌ విధానంలో PAN కేంద్రానికి పంపించాలి. మైనర్‌కు జారీ చేసిన పాన్ కార్డ్‌లో వారి ఫోటో, సంతకం ఉండదు. 18 ఏళ్ల వయసు నిండిన తర్వాత, ఫోటో, సంతకంతో కొత్త కార్డ్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. అయితే, పాన్ నంబర్ మాత్రం పాతదే కొనసాగుతుంది.


పెట్టుబడుల మీద చిన్నారులకు అవగాహన:

నేటి పోటీ ప్రపంచంలో చిన్నారులకు చిన్నతనం నుంచే పొదుపు, పెట్టుబడుల ఆవశ్యకత పట్ల వారిని నేరుగా ఇన్వాల్వ్ చేసే వీలుంటుంది. చిన్నారులకు వారి పేరుపై పాన్ కార్డ్ ఉంటే, డీమ్యాట్ (Demat) అకౌంట్ ఓపెన్ చేసి, షేర్లు కొనుగోలు చేయవచ్చు. కానీ ఇది పూర్తిగా తల్లిదండ్రులు లేదా చట్టపరమైన గార్డియన్ (లీగల్ గార్డియన్) పర్యవేక్షణలోనే జరుగుతుంది. మైనర్‌లు ట్రేడింగ్ లేదా సెల్(అమ్మకాలు) చేయలేరు. ఎందుకంటే ఇండియన్ కాంట్రాక్ట్స్ యాక్ట్, 1872 ప్రకారం వారు ఆర్థిక ఒప్పందాల్లో పాల్గొనలేరు. అయితే, కంపెనీస్ యాక్ట్, 2013 ప్రకారం ఏ వయస్సు ఉన్నా షేర్లు కలిగి ఉండవచ్చు. ఇంట్రాడే, F&O, కరెన్సీ డెరివేటివ్స్ వంటివి మాత్రం చేయకూడదు.

అయితే, మైనర్స్ అకౌంట్‌ను గార్డియన్ మాత్రమే ఆపరేట్ చేయాలి. షేర్లు గిఫ్ట్ రూపంలో మాత్రమే ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. 18 సంవత్సరాల తర్వాత మైనర్.. మేజర్ అయినప్పుడు, అకౌంట్ కొనసాగించవచ్చు కానీ కొత్త KYC, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.


చిన్నారులకు పాన్ కార్డు వల్ల ఇతర లాభాలు:

చిన్నారుల పేర బ్యాంక్‌లో ఖాతా తెరవడానికి సులభమవుతుంది. పిల్లల పేరుతో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD), రికరింగ్ డిపాజిట్ (RD) లాంటి ఖాతాలు తెరవడానికి PAN కార్డు చాలా ఉపయోగపడుతుంది. చిన్నారుల పేర మ్యూచువల్ ఫండ్స్, SIPలలో పెట్టుబడులకు వీలు కలుగుతుంది. అంతేకాదు, ఫైనాన్షియల్ ఐడెంటిటీ చిన్న వయసులోనే చిన్నారులకు బిల్డ్ అవుతుంది.


ఇవి కూడా చదవండి..

అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలకు బల్దియా బిగ్ షాక్

ఏ తప్పూ చేయలేదు.. లై డిటెక్టివ్‌కు రెడీ: కేటీఆర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 08:21 PM