Silver: వెండికీ... ఒక రోజు రానే వచ్చింది...
ABN , Publish Date - Dec 07 , 2025 | 11:03 AM
బంగారం బంగారమే! కాదనలేం. కానీ, వెండికీ పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మానవ సంస్కృతులతో ఈ లోహ బంధం విడదీయలేనంతగా పెనవేసుకుంది. తవ్వేకొద్దీ వెండి చరిత్ర బయల్పడుతూనే ఉంది. మానవ నాగరికతలో వేల ఏళ్ల నుంచీ ఆభరణాలు, నాణేలు, దేవతామూర్తుల రూపంలో వెండి మన ఆత్మీయలోహంగా మారిపోయింది.
ప్రతి మనిషికీ ఒక రోజు వస్తుంది అన్నట్లే వెండికీ ఒక రోజు రానే వచ్చింది. ఏళ్ల తరబడి జంటగా ప్రయాణించిన పసిడి, వెండి పరుగులో పుత్తడి ముందుకెళ్లింది. వెండిని వెనకేశానని మురిసిపోయింది. కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న సిల్వర్.. సిక్స్‌ప్యాక్ మెటల్‌లా శక్తిమంతమై.. గోల్డును సైతం బోల్డ్ చేసింది. పద్నాలుగేళ్లలో ఏకంగా 188 శాతం పెరిగి... సంచలనం సృష్టించింది. ఇప్పుడు వెండి.. శ్వేత బంగారం!! నేలమాలిగల్లో దాగున్న ఆ లోహపు అపురూప చరిత్రను తవ్వి తీస్తే ఎన్నో ఆసక్తికర విశేషాలు. అవే.. ఈ వారం కవర్‌స్టోరీ..
‘‘సిల్వరే కదాని చిన్నచూపు చూశాం. అబ్బో.. ఈ మధ్య పైపైకే పోతోంది. బంగారం కంటే ఎక్కువ పెరుగుతోంది. చూస్తుండగానే కిలో రూ.1.74 లక్షలు దాటేసింది. గోల్డు ఎలాగూ కొనేలా లేదు.. ఇప్పుడు వెండి కూడా అందనంత దూరం వెళ్లిపోయింది. ఓ పదేళ్ల కిందట వెండిని కొనుంటే ఇప్పుడు బంగారమయ్యేది!’’ గోల్డుషాపుల వద్ద ఏ ఇద్దరు గృహిణులు ముచ్చట్లు మొదలుపెట్టినా ఇదే మాట వినిపిస్తోంది. అవును, వారన్నది నిజమే!. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక మార్పుల వల్ల వెండి కూడా బంగారమైపోయిందిప్పుడు!. ఊహించనంత ధర పెరిగిపోయి.. ఆశ్చర్యపరుస్తోంది.

1981లో కిలో వెండి ధర రూ.2715, పదేళ్లకు (1991) పెద్దగా పెరిగిందేమీ లేదు. అప్పట్లో రూ.6646 పలికిందంతే!. ఇంకో దశాబ్దం అంటే 2001 నాటికి కూడా స్వల్పంగానే (రూ.7215) పెరిగింది. అప్పట్లో అందరిదృష్టి బంగారంపైనే ఉండేది. అబ్బే వెండే కదా ఏం పెరుగుతుందని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సంప్రదాయ పూజాసామాగ్రి, దేవతా విగ్రహాలు తప్పిస్తే.. ఇదొక పెట్టుబడిగా అస్సలు భావించలేదు. ఏళ్లు గడిచాయి. ఆధునిక, సాంకేతిక, డిజిటల్ విప్లవం ఊపందుకుంది. పరిశ్రమల్లో వెండి వినియోగం భారీగా పెరిగింది. 2011 వచ్చేసరికి రూ.56,900 చేరుకుందీ సిల్వర్. ఇక అప్పటి నుంచీ చుక్కలు చూపిస్తూ పైపైకెళ్లిపోయింది.
బంగారం ఎలాగూ మధ్యతరగతి వర్గాల కలగా మిగిలిపోయింది. కనీసం వెండి కొందామన్నా అందుబాటు ధరల్లో లేని పరిస్థితికి వెళ్లిపోయింది. ‘‘చూద్దాం.. ఏదో ఒక సమయంలో తగ్గుతుంది..’’ అనుకుంటూ తమకు తాము సర్ది చెప్పుకున్నారు పేద, మధ్యతరగతి మదుపర్లు. 2021 రానే వచ్చింది. అయినా వెండి ‘తగ్గేదేల్యా..’ అంటూ మరింత వేగంగా పరుగులు తీసింది. ఆ పరుగు ధర కిలో రూ.62.572. ‘ఇక.. ఇది కూడా బంగారమే!’ అనే భావన స్థిరపడింది. ‘వెండిని సైతం కొనలేం బాబోయ్.. ఇదేం రేటు?’ అనేంత ఎత్తుకు వెళ్లి కూర్చుందీ లోహం. ఇప్పుడు కిలో వెండి రూ.1.74 లక్షలు. అంటే ఈ పద్నాలుగేళ్లలో ఈ శ్వేతలోహం 188 శాతం పెరిగిందంటే ఊహించగలమా? ఈ కాలంలో పుత్తడి 171 శాతం మాత్రమే పెరిగింది. ఒకరకంగా చెప్పాలంటే బంగారం కంటే వెండినే అధికంగా పెరిగినట్లు లెక్క!.
విలువైన చరిత్ర..
బంగారం బంగారమే! కాదనలేం. కానీ, వెండికీ పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మానవ సంస్కృతులతో ఈ లోహ బంధం విడదీయలేనంతగా పెనవేసుకుంది. తవ్వేకొద్దీ వెండి చరిత్ర బయల్పడుతూనే ఉంది. మానవ నాగరికతలో వేల ఏళ్ల నుంచీ ఆభరణాలు, నాణేలు, దేవతామూర్తుల రూపంలో వెండి మన ఆత్మీయలోహంగా మారిపోయింది. మొట్టమొదట వెండి ఆసియా, టర్కీ, గ్రీస్‌లలో ఎక్కువగా వాడుకలో ఉందని చరిత్రకారులు చెబుతున్నారు. ఐదువేల ఏళ్ల కిందట సిల్వర్‌తో అందమైన వస్తువుల తయారీ జరిగినట్లు పురావస్తు ఆధారాలు లభించాయి.
క్రీ.పూ. 800లో ఆసియాఖండంలో వెండి వాణిజ్య లోహం. ఉత్తర ఆఫ్రికా, మెసపటోమియాలలోనూ మారకద్రవ్యంగా కొనసాగింది. గ్రీస్‌లోని పురాతన ఏథెన్స్‌కు సమీపంలో ఉన్న లారియం గనులు వెయ్యి సంవత్సరాలకు పైగా వెండికి ప్రధాన వనరుగా ఉండేవి. అప్పట్లో ఇక్కడ 31 వేల కిలోల వెండిని వెలికి తీశారు. గ్రీస్‌లోని అయోనియా దీవుల్లో వెండి పూత పూసిన ఒక పెద్ద వృషభ విగ్రహం లభించడంతో ఆధారాలను బలపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు లభించిన అతి పురాతన వెండి విగ్రహం ఇదే కావడం విశేషం. గ్రీకులే కాదు.. రోమన్లు కూడా అప్పట్లో వెండితో నగలు, నాణేలు, గృహోపకరణాలు తయారుచేశారు.
ఆ రెండు జాతుల సామ్రాజ్యం భూగోళంలోని అనేక ప్రాంతాలకు విస్తరించడంతో.. వెండిపై కన్నుపడింది. ముఖ్యంగా జర్మనీ, స్పెయిన్‌లలో తవ్వితీసిన వెండిని తీసుకెళ్లారు. ఈ క్రమంలో 15వ శతాబ్దం వచ్చేసరికి వెండి వనరులు క్షీణించడం మొదలుపెట్టాయి. ఇదిలా ఉంచితే.. అతి ప్రాచీన పురాతన నాణేలలో గుర్తించదగ్గది రోమన్ వెండి నాణెం డెనారిస్. క్రీ.పూ.211 నుంచి దాదాపు 3వ శతాబ్దం వరకు ముద్రించిన ఈ నాణెం రోమన్ల ఆర్థిక వ్యవవస్థకు గట్టి పునాదులు వేసిందని చెప్పవచ్చు. ఐరోపా అంతటా అభివృద్ది చెందిన నాణేలకు డెనారిస్ ఊతంగా నిలిచింది. ఆ తర్వాత కాయిన్ల డిజైన్లు మారుతూ వచ్చాయి. అయితే వెండి నాణేల బరువు, నాణ్యత మాత్రం తగ్గలేదు. ఈ చిన్న విషయమే ఈ లోహ లభ్యత స్థాయిని తెలియజేస్తుంది.
గ్రీకులు, రోమన్లు.. మిగిలిన ఐరోపా వాసులు వివిధ రూపాల్లో వెండిని పదిలపరుచుకున్నారు. ఒక విలువైన లోహంగా .. మదుపుసాధనంగా గుర్తించారు. ఆ మార్పును గమనించిన ఇంగ్లండ్ 14వ శతాబ్దం చివరినాటికి వెండి కళాకృతుల తయారీని ప్రోత్సహించడం మొదలుపెట్టింది. వెండి వస్తువుల తయారీ కళాకారులు పుట్టుకొచ్చారు. మెల్లగా ఆ దేశం హాల్‌మార్కింగ్ వ్యవస్థను స్థిరీకరించింది కూడా.
చైనా సైతం వెండికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. క్రీ.శ. 618 కాలంలో టాంగ్ రాజవంశం ఈ లోహ మెరుపులకు ఆకర్షితులైంది. అలా ఆ దేశంలో కూడా వెండి బాగా ప్రజాదరణ పొందింది.

స్పానిష్ వలసదారులు కొత్త రాజ్యాలను ఆక్రమించినప్పుడు విస్తారమైన వెండి నిక్షేపాలను కనుగొన్నారు. రెండువేల ఏళ్లకు పైగా వెండిని తవ్విన సంస్కృతులను అధ్యయనం చేశారు. ద గ్రేట్ అజ్టెక్ చక్రవర్తి మోంటెజుమా క్యూరాస్ ఆ రోజుల్లోనే తన కాలర్‌పట్టీకి వెండిని అలంకరించుకునేవారు. ఆయన చేతికి కంకణాలు, చెవిపోగులు సరేసరి. ఆ రాజు తలపై పెట్టుకున్న పక్షుల ఈకలతో తయారుచేసిన కిరీటంలాంటి శిరస్త్రాణంలోనూ వెండిని పొదిగారు. పలు రాజ్యాల రాజులు ఈ అద్భుత లోహానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారనడానికి ఇలాంటి ఆధారాలు అనేకం చరిత్రపుటల్లో నిక్షిప్తం అయ్యాయి.
ఆ దేశాల నుంచీ..
పురాతన కాలంలో చరిత్ర సృష్టించిన వెండి.. ఆధునికయుగంలోనూ కొత్త మెరుపులతో మైమరపించింది. మెక్సికో, పెరూ, బొలీవియా పర్వతాల్లోని ప్రసిద్ధ పోటోసి ప్రాంతంలో సమృద్ధిగా వెండి దొరికింది. కొత్త వెండి గనుల నిక్షేపాలు, తవ్వకాలు, శుద్ధి ప్రక్రియలలో సాంకేతిక పురోగతి సాధించింది. పదహారో శతాబ్దం వచ్చేసరికి ప్రపంచ వెండి సరఫరా బాగా విస్తరించింది. సుమారు మూడొందల ఏళ్లలో బొలీవియా, మెక్సికో, పెరూ ప్రపంచ వెండి ఉత్పత్తిలో ఇంచుమించు 85 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

ఈ సమయంలో కేవలం బొలీవియా గనుల నుంచే సుమారు 3.11 కోట్ల కిలోల వెండిని వెలికితీశారు. మెక్సికో 4.5 కోట్ల కిలోలు, పెరూ 93 వేల కిలోలను ప్రపంచానికి అందించాయి. ఆధునికపు వెండిలో ఎక్కువ భాగం సార్వత్రిక డాలర్ అయిన ‘పీసెస్ ఆఫ్ ఎయిట్’ను ముద్రించడానికి ఉపయోగపడింది. ‘పీసెస్.. ’ అనేది స్పానిష్ డాలర్ పెసో వెండి నాణెం సాధారణ ఆంగ్లనామం. దీనిని ఆ భాషలో రియల్ డి ఎవొచో (రియల్ ఆఫ్ ఎయిట్) అంటారు. ఈ నాణెం 16 నుంచి 19వ శతాబ్దం వరకు అంతర్జాతీయ వాణిజ్యంలో విస్తృతంగా వినియోగంలోకి వచ్చిన తొలి అంతర్జాతీయ కరెన్సీ. ఆ నాణెం తాలూకు ఆధిపత్య వారసత్వమే అమెరికా డాలర్‌కు దారితీసింది.
.
17వ శతాబ్దంలో ఉత్తర అమెరికాలోని తెగలు ఆభరణాలను తయారుచేయడానికి... ఐరోపావాసుల నుంచి పొందిన వెండి నాణేలను ఉపయోగించారు. అమెరికాలో ఇప్పటికీ పలువురు మూలవాసుల (నేటివ్స్) కుటుంబాలు వెండి పనివారుగా కొనసాగుతున్నారు. మన దగ్గర బంగారుపని చేసే స్వర్ణకారులు, కలప పని చేసే వడ్రంగులు, లోహ పనిముట్లు చేసే కంసాలుల మాదిరే.. అమెరికాలో వెండిపనుల్ని చేసే వృత్తి నేటికీ కొనసాగుతోంది. మన దేశంలోకి కార్పొరేట్లు ప్రవేశించాక కులవృత్తులు కనుమరుగు అవుతున్నట్లే అమెరికాలోనూ అదే పరిస్థితి ఎదురైంది.

పద్దెనిమిదో శతాబ్దం మధ్య నాటికి ఉత్తర అమెరికా నగరాలైన న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియాలలో వెండి ఆభరణాలు, కళాకృతులు, వస్తువుల తయారీ సంస్థలు భారీగా వెలిశాయి. మరోవైపు ఇంగ్లండ్‌లో వెండి పూత ప్రక్రియలో అధునాతన సాంకేతిక పద్ధతులు వచ్చేశాయి. పంతొమ్మిదో శతాబ్దం వచ్చేసరికి.. ఎలకో్ట్రప్లేటింగ్ ఆవిష్కరణతో వెండి ఆభరణాలు మరింత సరసమైనవిగా మారాయి. ఆధునిక వినియోగదారుల్ని ఆకర్షించాయి. వెండి గిరాకీ ఊపందుకుంది. అనేక మైనింగ్ కంపెనీలు రంగంలోకి దిగాయి. అమెరికాలోని నెవాడా, కొలరాడో, ఉతాలలో కొత్త వెండి గనుల్ని కనుక్కున్నారు. ఇరవయ్యో శతాబ్దం మొదలయ్యే సరికి సాంకేతిక విప్లవం విస్తరించింది. దీంతో వివిధ పరిశ్రమలలో వెండి వినియోగం ఊపందుకుంది.
పరిశ్రమల్లో వినియోగం..
అత్యంత శక్తిమంతమైన విద్యుత్ వాహకం వెండి. ఇదొక రసాయన మూలకం... తేజస్సును వెదజల్లే లోహం. ఉష్ణోగ్రతను కూడా తట్టుకుంటుంది. వినియోగంలో సామర్థ్యం ఎక్కువ. ఆధునిక సాంకేతిక యుగం.. ముఖ్యంగా ఐటీ విప్లవం మొదలయ్యాక.. ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్ పరికరాల వాడకం అధికం అయ్యింది. వీటన్నింటిలో ఎంతోకొంత వెండిని ఉపయోగిస్తారు. ఎలక్ట్రిక్ స్విచ్చులు, సోలార్ ప్యానల్స్, కాటలిస్టులు, వైద్య పరికరాల్లో ఈ లోహ ప్రాధాన్యత అధికం. కంప్యూటర్లు, మొబైల్‌ఫోన్లు, ఆటోమొబైల్స్, అప్లయెన్సెస్, సర్క్యులేటెడ్ బోర్డులు, రేడియో ప్రీక్వెన్సీ డివైజ్‌లు,
ఆంటెనాలు, సోలార్‌సెల్స్, సూపర్‌కంప్యూటర్లు, టెలివిజన్లు, మైక్రోవేవ్స్, బొమ్మలు, కీబోర్డులు... ఇలా మనం నిత్యం ఉపయోగించే పరికరాలు, సాధనాలలో ఈ విలువైన లోహ ఉత్పత్తులు ఉంటాయి. ఇతర ఉత్పత్తుల విషయానికి వస్తే.. వెండి సాధారణంగా ఉపయోగించే ఉత్ర్పేరకం. ఇది రెండు ప్రధాన పారిశ్రామిక రసాయనాలను ఉత్పత్తి చేయడానికి చాలా కీలకం. ఇథిలిన్ ఆక్సైడ్, ఫార్మాల్డిహైడ్.. వీటిని ప్లాస్టిక్, తివాచీలు, వస్త్రాలు, యాంటీ ఫ్రీజ్ వంటి వాటిలో వాడతారు.

ఎయిర్ కండీషనర్స్, రిఫ్రిజిరేటర్లు, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌లోని విమానాల జెట్ ఇంజిన్ల బేరింగులపైన వెండిపూత పూస్తారు. దీనివల్ల ఇవి అంత త్వరగా వేడెక్కవు. ఇక, వెండిని వైద్యవిధానాల్లో వాడతారన్నది పూర్వం నుంచీ వస్తున్న మాట. ఆధునిక వైద్య విధానంలో కూడా అదే సంప్రదాయం వస్తున్నది. ముఖ్యంగా వైద్యపరికరాల తయారీలో వెండి ప్రాధాన్యత ఎనలేనది. బ్రీతింగ్ ట్యూబ్స్, ప్రోస్థెటిక్స్, కాథెటర్స్ వంటి వైద్య పరికరాల లోపల వెండిపూత ఉంటుంది. ఈ పూత ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. బ్యాండేజ్‌లు, ఆయింట్‌మెంట్లలోనూ ఈ మెటల్ ఉంటుంది. సర్జికల్‌టూల్స్, నీడిల్స్, స్టెతస్కోప్, ఫర్నీచర్, డోర్‌హ్యాండిల్స్, లినెన్స్, పేపర్‌ఫైల్స్... ఇలా పలు వస్తువుల తయారీలో సిల్వర్ ఉంటుంది.
ఆటోమొబైల్ విషయానికి వస్తే.. విద్యుత్‌కార్ల తయారీ, పవర్‌విండోస్, పవర్‌సీట్స్, ఆన్ ఆఫ్ స్విచ్ తయారీలో ఈ లోహ వాడకం ఉంటుంది. మన దేశంలో ఏటా లక్షల వాటర్‌ఫ్యూరిఫైయర్లను అమ్ముతూనే ఉంటారు. ముఖ్యంగా ఈ ఫిల్టర్ల లోపల బ్యాక్టీరియా చేరకుండా, పాచి పట్టకుండా వెండిపూత కాపాడుతుంది. వెండి ఆక్సిజన్‌తో కలిసి శానిటైజర్‌గా.. ఒక రకంగా క్రిమిసంహారక మందులాగా పనిచేస్తుంది. ఇలా పరిశ్రమల్లో వెండి వినియోగం అధికం కావడం వల్ల ధరలు విపరీతంగా పెరిగాయని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మార్పునకు తోడు ప్రపంచవ్యాప్తంగా వెండి గనుల్లోని నిక్షేపాలు సైతం తరిగిపోతున్నాయి. ఇంకొన్నేళ్లు గడిస్తే వెండి కూడా బంగారమైపోతుంది. అందుకే ... పుత్తడిని కొనలేని వినియోగదారులు కనీసం వెండినైనా కొని భద్రపరుచుకుంటే.. భవిష్యత్తులో బంగారం అవుతుంది.
- మల్లెంపూటి ఆదినారాయణ

- మన దేశంలో ఆడపిల్లలు పుట్టిన వెంటనే వెండితో చేసిన కాళ్ల పట్టీలు వేయడం, మగపిల్లలైతే వెండి మొలతాడు చేయించడం సంప్రదాయం.
- వెండి దేవతా విగ్రహాలు, వెండి హారతి పల్లేలు, ఎత్తయిన దీపాలు, భోజన కంచాలు, గ్లాసులు, చెంబులు, కంకణాలు, కడియాలు, గొలుసులు, మువ్వలు, పట్టీలు, అలంకార వస్తువులు, కళాకృతులు.. వంటివన్నీ భారత్‌లో బాగా అమ్ముడవుతున్నాయి.
- వెండి చల్లదనాన్ని అందిస్తుంది. గ్రీకు పురాణాల్లో చంద్రుని దేవత అయిన ఆర్టెమిస్‌తో ముడిపడి ఉంది. వెండిని దేవతల కన్నీళ్లుగా విశ్వసిస్తారు గ్రీకులు. రోమన్లకు కూడా ఇలాంటి వెండి విశ్వాసాలే ఉన్నాయి.
- వెండి దేవతల ఎముకల నుంచి ఉద్భవించిన పవిత్రమై లోహమని.. ప్రాచీన ఈజిప్షియన్ల నమ్మకం. అందుకే వెండి ఆభరణాలను ధరిస్తే తమకు రక్షణ లభిస్తుందని భావిస్తారు.
- చైనాలో పిల్లలకు రక్షణ కోసం తరచూ వెండి కంకణాలను తొడుగుతుంటారు. పెద్దల ఆశీర్వాదం తెలియజేసేందుకు కూడా ఈ లోహ వస్తువులు, ఆభరణాలను ఇస్తుంటారు.
- అమెరికాలోని మూలవాసులు వెండిని దైవికసంబంధ లోహంగా పూజిస్తారు. వైద్య ప్రయోజనాల కోసం వాడతారు.
- వెండి నాణేలు, బిస్కెట్లు, బార్‌లు కొని భద్రపరుచుకోవచ్చు. దొంగల బారిన పడకుండా బ్యాంకు లాకర్లలో దాచుకోవచ్చు. అన్నిటికంటే సులువైన ఉపాయం.. సిల్వర్ ఈటీఎఫ్‌లు. డీమ్యాట్ అకౌంట్ ద్వారా నేరుగా కొనుక్కోవచ్చు
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయాలకతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
Read Latest Telangana News and National News