Share News

Silver Price Surge: పసిడికి పోటీగా వెండి..రూ.1.5 లక్షలకు చేరిన కిలో వెండి

ABN , Publish Date - Sep 29 , 2025 | 08:10 PM

దేశంలో వెండి ధరలు సామాన్యులకు షాక్ ఇచ్చాయి. ఈ క్రమంలో ఢిల్లీలో వెండి ధర కిలోకు ఒక్కసారిగా రూ.7,000 పెరిగి రూ. 1.5 లక్షల మార్కును తాకాయి. అదే సమయంలో, బంగారం కూడా కొత్త గరిష్ట స్థాయిని చేరుకుంది.

Silver Price Surge: పసిడికి పోటీగా వెండి..రూ.1.5 లక్షలకు చేరిన కిలో వెండి
Silver Price Surge

దేశీయ మార్కెట్‌లో చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది. ఎందుకంటే తొలిసారిగా వెండి ధర కిలోకు రూ. 1.5 లక్షలకు చేరి (Silver Price Surge), అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక్కరోజులోనే రూ. 7,000 పెరిగి ఢిల్లీలో ఈ రికార్డు స్థాయిని తాకింది. ఈ క్రమంలో బంగారం రేటుతో పోటీ పడుతోంది. ఇదే సమయంలో 24 క్యారెట్ పసిడి కూడా 10 గ్రాముల ధర రూ. 1,19,500కు చేరుకొని, సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించిన ఈ సమాచారంతో మార్కెట్‌లో ఉత్సాహం నెలకొనగా, కొనుగోలు దారులు మాత్రం పెరిగిన ధరల పట్ల ఆందోళన చెందుతున్నారు.


అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ధరలు పెరిగాయి

విదేశీ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ ధర దాదాపు 2 శాతం పెరిగి ఔన్స్‌కు 3,824.61 డాలర్లకు చేరింది. అదే విధంగా, వెండి ధర 2 శాతం కంటే ఎక్కువగా పెరిగి ఔన్స్‌కు 47.18 డాలర్లకు చేరుకుంది.

ఫ్యూచర్స్ మార్కెట్‌లో రికార్డు ధరలు

దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో కూడా బంగారం, వెండి ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అక్టోబర్ నెల బంగారం ఫ్యూచర్స్ ధర రూ. 1,204 (1.06 శాతం) పెరిగి 10 గ్రాములకు రూ. 1,14,992కి చేరింది. అలాగే, డిసెంబర్ బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ రూ. 1,034 (0.9 శాతం) పెరిగి రూ. 1,15,925కి చేరుకుంది.

వెండి ఫ్యూచర్స్ కూడా మంచి లాభాలను నమోదు చేశాయి. డిసెంబర్ కాంట్రాక్ట్ రూ. 2,290 (1.61 శాతం) పెరిగి కిలోకు రూ. 1,44,179కి చేరుకోగా, మార్చి 2026 కాంట్రాక్ట్ రూ. 2,559 (1.79 శాతం) పెరిగి రూ. 1,45,817కి చేరుకుంది.


పెరుగుదలకు కారణాలు

అమెరికా సుంకాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతలు సహా ఇతర అంశాలు బంగారం, వెండి ధరలను పెంచుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ అంశాలు మార్కెట్‌లో లిక్విడిటి డిమాండ్‌ను మరింత పెంచుతున్నాయని అంటున్నారు. మీరు ప్రస్తుతం బంగారం లేదా వెండిలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్ ట్రెండ్‌లను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.


ఇవి కూడా చదవండి

మరో స్కామ్‌ అలర్ట్.. మీ డబ్బు, ఫోన్‌ను ఇలా కాపాడుకోండి

రూ.485కే 72 రోజుల ప్లాన్..అన్‌లిమిటెడ్ కాలింగ్, 2 జీబీ డేటా

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 29 , 2025 | 08:24 PM