Share News

Jan Dhan Account Re-KYC: జన్ ధన్ అకౌంట్ హోల్డర్‌లకు రీ-కేవైసీ.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..

ABN , Publish Date - Aug 07 , 2025 | 08:13 PM

జన్ ధన్ అకౌంట్‌లు ఉన్న లబ్ధిదారులకు ఆర్బీఐ కీలక సూచన చేసింది. లబ్ధిదారులు తమ కేవైసీ వివరాలను మరోసారి సమర్పించాలని సూచించింది. సెప్టెంబర్ 30లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని డెడ్‌లైన్ విధించింది.

Jan Dhan Account Re-KYC: జన్ ధన్ అకౌంట్ హోల్డర్‌లకు రీ-కేవైసీ.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే..
Jan Dhan re-KYC

ఇంటర్నెట్ డెస్క్: ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన బ్యాంక్ అకౌంట్లు ఉన్న వారికి అలర్ట్. ఈ అకౌంట్‌ల లబ్ధిదారులు మరోసారి తమ కేవైసీ వివరాలను తమ బ్యాంకులకు సమర్పించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సూచించింది. ఈ ప్రక్రియకు సెప్టెంబర్ 30 చివరి తేదీగా పేర్కొంది.

పీఎమ్‌జేడీవై పథకాన్ని 2014 ఆగస్టులో ప్రారంభించిన విషయం తెలిసిందే. దేశ ప్రజలందరినీ ఆర్థిక ప్రగతిలో భాగం చేసేందుకు, మారుమూల ప్రాంతాలకు కూడా బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. బ్యాంక్ అకౌంట్స్ లేని వారికి ఈ పథకంలో భాగంగా వివిధ బ్యాంకుల్లో జన్ ధన్ ఖాతాలు ప్రారంభించారు. ఆర్థిక స్వావలంబన సాధించడంలో తొలి అడుగుగా బ్యాంక్ ఖాతాలను ప్రభుత్వం అందించింది. ఇక పథకం నిబంధనల ప్రకారం, ఈ ఖాతాల లబ్ధిదారులు 10 ఏళ్ల తరువాత తమ కేవైసీ వివరాలను మళ్లీ అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. దీంతో, 2014-15 మధ్య కాలంలో పీఎమ్‌జేడీవై బ్యాంక్ అకౌంట్స్ అందుబాటులోకి వచ్చిన వారందరూ మరోసారి తమ వివరాలను తమ బ్యాంకులకు సమర్పించాలి.


ఇక ఆర్బీఐ మార్గదర్శకాల నేపథ్యంలో రీ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు రంగంలోకి దిగాయి. గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేశాయి. జులై 1 మొదలు సెప్టెంబర్ 30 వరకూ ఈ క్యాంపులు అందుబాటులో ఉంటాయి. జన్ ధన్ ఖాతా లబ్ధిదారులు ఈ కేంద్రాలను సందర్శించి తమ రీ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. రీ-కేవైసీతో పాటు ఈ క్యాంపుల్లో లబ్ధిదారులు మైక్రోఇన్సూరెన్స్, పెన్షన్ పథకాలు, జన్ ధన్ ఖాతాల సమస్యలకు పరిష్కారాలు కూడా పొందొచ్చు.

రీకేవైసీలో భాగంగా లబ్ధిదారులు మరో మారు తమ అడ్రస్, ఫోన్ నెంబర్ వంటి వ్యక్తిగత వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ మారినా అధికారులకు కొత్త నెంబర్ తెలియజేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో కూడా ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. ఇందుకోసం లబ్ధిదారులు తమ బ్యాంకుకు చెందిన నెట్‌బ్యాంకింగ్ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఇక ప్రభుత్వ లెక్కల ప్రకారం, ప్రస్తుతం 55.9 కోట్ల జన్ ధన్ బ్యాంక్ అకౌంట్‌లు ఉన్నాయి.


ఇవీ చదవండి:

ఫ్లాట్ కొనడమంటే అతిపెద్ద ఆర్థిక తప్పిదం.. ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ అధిపతి వార్నింగ్

ఈ యాప్స్‌తో వృథా ఖర్చులకు కళ్లెం.. ఓసారి ట్రై చేసి చూడండి

Read Latest and Business News

Updated Date - Aug 07 , 2025 | 08:28 PM